💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 కవితారంగము 🏵
సాహిత్యానికి సంబంధించి 15, 16 సంవత్సరాల వయస్సులోనే అవధాన ఆశుకవితా ప్రదర్శనలు చెయ్యటం మొదలై కొంతకాలం పాటు ఆ రంగంలో విహరించి నెమ్మదిగా వాటిని విరమించి కావ్య నిర్మాణ మార్గంలో ప్రయాణించడం మొదలైంది. 'రసవాహిని', 'ఆనందయోగిని', రసగంగ, గంధర్వగీతి పద్యకావ్యములు, శివసాహస్రి, ఐంద్రీసాహస్రి, అంబికాసాహస్రి మొదలైన స్తుతి కావ్యాలు, కవిబ్రహ్మ, కావ్యకంఠ మొదలయిన నాటకాలు, రమణీ ప్రియదూతిక, మొదలైన నవలలు. ఆంధ్రభాగవత విమర్శ,కవితామహేంద్రజాలము మొదలైన పరిశోధన గ్రంథాలు, తాంత్రిక ప్రపంచం వంటి మంత్రశాస్త్ర గ్రంథాలు వీటితో పాటు పత్రికలలో వ్యాస పద్య రచనలు షుమారు నాలుగు దశాబ్దాల సాహిత్య యాత్రలో ఉదయించినవి.
సాహితీరూపకమయిన భువన విజయంతో ప్రారంభించి, ఇంద్రసభ, వైకుంఠసాహితీసభ, కైలాససాహితీసభ, శ్రీనాధ విజయసభ వంటి ముప్పైకి పైగా రూపకాలను సృష్టించి ఆంధ్రదేశంలోని నలుమూలల్లో వివిధ రాష్ట్రాలలో ఆంధ్రులున్నచోట్ల, అంతేకాక అమెరికాఖండంలో న్యూయార్క్ నుండి కాలిఫోర్నియా దాకా ఉన్న మహానగరాలలో కవి పండిత బృందంతో పర్యటించి ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. వందలకొద్దీ జరిగిన ఈ రూపక ప్రదర్శనలు వేల కొలది జనాన్ని సమ్మోహితులను చేయడమే కాక తెలుగు పద్యానికి అపూర్వమైన ప్రచారాన్ని తెచ్చినవి.
నేను పీఠాధిపతిని అయిన తరువాత జరిగిన సభలలో కొంతమంది కవిపండితులు జనప్రియమైన సాహితీరూపకాలు ఇక ఏమి కానున్నవో అని ఆందోళనను వ్యక్తం చేశారు. ఎందుకంటే మునుపటివలె ఏ కృష్ణదేవరాయల పాత్రనో ఏ ఇంద్రుని పాత్రనో నేను ధరించడం జరుగదు కనుక. అప్పుడు నేను సమాధానం చెపుతూ "ఏవిద్య అయినా కళ అయినా వ్యక్తుల కోసం ఆగదు.
అనంతమైన కాలంలో మధ్య మధ్యలో కొద్దిపాటి విశ్రాంతి లేక విరమణ వచ్చినట్లు కన్పించినా ఎవరో తగిన వారు వస్తారు, రధయాత్ర కొనసాగుతునే ఉంటుంది. ఇప్పుడు కూడా నేను పాత్రధారణ చేయకూడదు గనుక చేయను. కానీ మా సన్నిధిలో సాహితీరూపకాలను జరిపిస్తూనే ఉంటాను" అన్నాను. ఇప్పుడు ఆ విధంగానే జరుగుతున్నది. ధర్మచైతన్యాన్ని పెంపొందించడానికి దేవతాభక్తిని వర్దిల్ల చేయడానికి సాహితీరూపకాన్ని ఇప్పుడు ఒక శక్తిమంతమైన ఉపకరణంగా ఉపయోగించటం జరుగుతున్నది.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment