3.వరోజు అమ్మవారి అలంకారము
శ్రీ అన్నపూర్ణా దేవి
🌳🌳🌳🌳🌳🌳
నేడు విజయవాడ దుర్గమ్మ అన్నపూర్ణ దేవి అలంకరణలో దర్శనం ఇస్తారు.
అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారికలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయశుభాలను అందిస్తుంది.
అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్పూర్తి, వాక్శుద్ది, వాక్సిద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. #భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి. బుద్ధి ఙ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచైన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని అర్షవాక్యం.
అమ్మవారిని తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి. " హీం శ్రీం, క్లీం ఓం నమోభగత్యన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణ చెయ్యాలి.
అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించాలి.
శ్రీ అన్నపూర్ణా దేవి స్తోత్రము!
-
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ |
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 1
నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ
ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ |
కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 2
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ |
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 3
కైలాసాచల కందరాలయకరీ గౌరీ-హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ |
మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 4
దృశ్యాదృశ్య-విభూతి-వాహనకరీ బ్రహ్మాండ-భాండోదరీ
లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విఙ్ఞాన-దీపాంకురీ |
శ్రీవిశ్వేశమనః-ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 5
ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీ-నీలసమాన-కుంతలధరీ నిత్యాన్న-దానేశ్వరీ |
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 6
ఆదిక్షాంత-సమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ
కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శర్వరీ |
స్వర్గద్వార-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 7
దేవీ సర్వవిచిత్ర-రత్నరుచితా దాక్షాయిణీ సుందరీ
వామా-స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 8
చంద్రార్కానల-కోటికోటి-సదృశీ చంద్రాంశు-బింబాధరీ
చంద్రార్కాగ్ని-సమాన-కుండల-ధరీ చంద్రార్క-వర్ణేశ్వరీ
మాలా-పుస్తక-పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 9
క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ |
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ 10
అన్నపూర్ణే సాదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే |
ఙ్ఞాన-వైరాగ్య-సిద్ధయర్థం బిక్బిం దేహి చ పార్వతీ 11
మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః |
బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ 12
సర్వ-మంగల-మాంగల్యే శివే సర్వార్థ-సాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోஉస్తు తే 13
రచన: ఆది శంకరాచార్య -
సర్వేజన సుఖినోభావంత్
🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
ఈరోజు (05.10.24) శ్రీశైలంలో చంద్రఘంటా దుర్గా అలంకరణ
🌔🌔🌔🌔🌔🌔🌔🌔🌔🌔🌔🌔
చంద్రఘంటా దుర్గా , దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో మూడవ అవతారం. భక్తులు ఈ అమ్మ వారిని చంద్రఖండ , చండికా , రణచండీ అని కూడా పిలుస్తారు. చంద్రఘంటా అంటే అర్ధచంద్రా కారంతో , గంట కలగి ఉన్నది అని అర్ధం. నవరాత్రులలో పూజించే నవదుర్గల్లో మూడో అవతారమైన చంద్రఘంటా దేవి ధైర్యానికీ , శక్తికీ , తేజస్సుకూ ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఆమె తన తేజస్సుతో పూజించినవారి పాపాలు , ఈతిబాధలు , రోగాలు , మానసిక రుగ్మతలు , భూత భయాలు దూరం చేస్తుంది.
పురాణ గాథ
శివుడు , పార్వతి దేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తరువాత ఆమె ఎంతో సంతోషిస్తుంది. పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకా దేవి , హిమవంతులు కూడా పెళ్ళికి అంగీకరిస్తారు. పెళ్ళి రోజున శివుడు దేవతలతోనూ , మునులతోనూ , తన గణాలతోనూ , శ్మశానంలో తనతో ఉండే భూత , ప్రేత , పిశాచాలతోనూ తరలి విడిదికి వస్తాడు. వారందరినీ చూసి పార్వతి తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివునకు కనిపించి , తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని ఆయనను కోరుతుంది. అప్పుడు శివుడు రాజకుమారుని వేషంలో , లెక్కలేనన్ని నగలతో తయారవుతాడు. అప్పుడు ఆమె కుటుంబసభ్యులు , స్నేహితులు , బంధువులూ భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారు. ఆ తరువాత శివ , పార్వతులు వివాహం చేసుకుంటారు. అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రఘంటా అవతారం ఎత్తింది.
శివ , పార్వతుల కుమార్తె కౌషికిగా దుర్గాదేవి జన్మించింది. శుంభ , నిశుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు. ఆమె యుద్ధం చేస్తుండగా , ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు. అమెను తన తమ్ముడు నిశుంభునికిచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకుని ధూమ్రలోచనుణ్ణి కౌషికిని ఎత్తుకురమ్మని పంపిస్తారు. అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంటా దుర్గా అవతారం ధరించి ధూమ్రలోచనుణ్ణి , అతని పరివారాన్ని సంహరిస్తుంది. అలా శుంభ , నిశుంభులతో యుద్ధంలో నవదుర్గా అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంటా దుర్గా అవతారం ఎత్తింది అమ్మవారు.
రూప వర్ణన
చంద్రఘంటా దుర్గా దేవి ఎనిమిది చేతులతో ఉంటుంది. ఒక చేతిలో త్రిశూలం , మరో చేతిలో గద , ఒక చేతిలో ధనుర్భాణాలు , మరో చేతిలో ఖడ్గం , ఇంకో చేతిలో కమండలం ఉంటాయి. కుడి హస్తం మాత్రం అభయముద్రతో ఉంటుంది. చంద్రఘంటా దుర్గాదేవి పులి మీదగానీ , సింహం మీదగానీ ఉంటుంది . ఈ వాహనాలు ధైర్యానికి , సాహసానికీ ప్రతీకలు. అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా , ఫాలభాగంలో మూడో నేత్రంతో ప్రకాశిస్తుంది ఆ తల్లి. అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూంటుంది. శివుడు ఈ అమ్మవారి అందానికి ముగ్ధుడయ్యాడని పురాణోక్తి.
పులి లేదా సంహవాహిని అయిన అమ్మవారు ధైర్య ప్రదాయిని. నిజానికి ఈ రూపం కొంచెం ఉగ్రమయినా , ఆమె ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతోనే ఉంటుంది. ఉగ్రరూపంలో ఉండే ఈ అమ్మవారిని చండి , చాముండాదేవి అని పిలుస్తారు.
ఈ అమ్మవారిని ఉపాసించేవారు మొహంలో దైవ శోభతో ప్రకాశిస్తుంటారని భక్తుల నమ్మికం. వారు అద్భుతమైన తేజస్సుతో ఉంటారట. ఈ అమ్మవారిని పూజించేవారు విజయాన్ని అతిశీఘ్రంగా పొందగలరని భక్తుల విశ్వాశం. దుష్టులను శిక్షించేందుకు ఈ అమ్మవారు ఎప్పుడూ తయారుగా ఉంటుందని పురాణోక్తి. అలాగే తన భక్తులకు ప్రశాంతత , జ్ఞానం , ధైర్యం ప్రసాదిస్తుందట ఈ అమ్మవారు. రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని ఘంట భీకరమైన శబ్దం చేసిందట. కొందరు రాక్షసులకు ఆ ఘంటానినాదానికే గుండెలవిసాయని దేవి పురాణం చెబుతోంది. అయితే ఈ ఘంటానినాదం ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమనీ , ఎంతో మధురంగా వినపడుతుందని ప్రతీతి. దుష్టులకు అమ్మవారి రూపం ఎంత భయదాయకమో , ఉపాసకులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది.
ధ్యాన శ్లోకం
పిండజ ప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ప్రసాదం తనుతే మహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా
🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🪷🍇🪷
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
(05.10.24)బతుకమ్మ పండుగలో "నానబియ్యం బతుకమ్మ"
🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగతో... రాష్ట్రమంతటా కోలాహలం నెలకొంది. మహాలయ అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు. అచ్చమైన ఈ ప్రకృతి పండుగను తొమ్మిదిరోజుల పాటు జరుపుకుంటారు. తొమ్మిది రోజులు.. తొమ్మిది రూపాల్లో ఆ అమ్మవారిని పూజిస్తారు.
ఇవాళ నాలుగో రోజు సందర్భంగా... నానబియ్యం బతుకమ్మను చేస్తారు. నానేసిన బియ్యం , పాలు , బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.
నాలుగంతరాల బతుకమ్మ
తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత. రోజుకో విధంగా గౌరమ్మను కొలుస్తూ... ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు.
నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మగా కొలుస్తారు. తంగేడు, గునుగు , బంతి , చామంతి వంటి తీరొక్క పూలతో నాలుగంతరాల బతుకమ్మను పేరుస్తారు. శిఖరంపై పసుపుతో తయారుచేసిన గౌరమ్మను ఉంచుతారు. ఉదయం అమ్మవారికి పూజలు చేసి... సాయంత్రం వేళ గంగమ్మ ఒడికి చేరుస్తారు.
ఇవాళ నానపెట్టిన బియ్యాన్ని బెల్లం లేదా చక్కెరతో కలిపి ముద్దలుగా తయారు చేసి... పంచుతారు.
గంగమ్మ చెంతకు బతుకమ్మ
సాయంత్రం వేళ విశాలమైన ప్రదేశంలో తొలుత వెంపలి చెట్టును నాటి... దానిపై పసుపు కుంకుమను చల్లుతారు. అనంతరం బతుకమ్మలను ఆ చెట్టు చుట్టూ ఉంచుతారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఒకరి చేయి ఒకరు పట్టుకొని కోలాటాలు చేస్తారు. మరికొందరు చేతిలో రెండు కర్రలను పట్టుకొని కోలాటం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...., ఒక్కేసి పువ్వేసి చందమామ... ఒక్కజాములాయే చందమామ..., పసుపుల పుట్టింది గౌరమ్మా... పసుపుల పెరిగింది గౌరమ్మా... అంటూ చప్పట్లతో కష్టసుఖాలను తెలియజేసే జానపద పాటలు పాడుతారు. బంధాలు , బంధుత్వాలపైనా పాటలు పాడుతారు. చివరగా ఆ బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చుతారు.
🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒
No comments:
Post a Comment