*🌹. కార్తీక పురాణం - 3 🌹*
*🌻 3వ అధ్యాయం : కార్తీకస్నాన మహిమ, బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. 🌻*
*ప్రసాద్ భరద్వాజ*
బ్రహ్మర్షియైన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షియైన జనకునికి ఇంకా యిలా చెప్పసాగాడు; 'రాజా! స్నానదాన జప తపాలలో దేవినిగానీ, ఈ కార్తీకమాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా - అది అక్షయమైన ఫలాన్నిస్తుంది. ఎవరైతే సుఖలలాసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో - ఆటువంటివాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు.
శ్లో" పౌర్ణమ్యాం కార్తీకేమాసి స్నానాందీస్తు నాచరన్ !
కోటిజన్మసు చండాలయోనౌ సంజాయతే నృప !!
శ్లో" క్రమాద్యోనౌ సముత్సన్నో భవతి బ్రహ్మరాక్షసః !
అత్త్రై వోదాహరంతీ మ మితిహాసం పురాతనమ్ !!
భావం: కార్తీక పౌర్ణమినాడు, స్నాన దాన జపోపవాసాలలో ఏ ఒక్కటీ కూడా ఆచరించని వాళ్లు కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి, తుదకు బ్రహ్మ రాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను విను.
అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్త్వనిష్ఠుడనే బ్రహ్మణుడుండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పకులనివాడూ, అన్ని భూతములయందునూ దయాళువూ, తీర్థాటన ప్రియుడూ అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్రా సందర్భముగా ప్రయాణిస్తూ మార్గమధ్యములో గోదావరీ తీరానగల ఒకానొక యెత్తయిన మర్రిచెట్టు మీద - కారు నలుపు కాయచ్చాయ గలవాళ్లూ, ఎండిన డొక్కలు కలవాళ్లూ, ఎర్రని నేత్రములు - గడ్డములూ కలవాళ్లూ, గ్రుచ్చబడిన ఇనుపతీగెలకుమల్లే పైకి నిక్కివున్న తలవెంట్రుకలతో, వికృత వదనార విందాలతో, కత్తులూ, కపాలాలూ ధరించి, సర్వజీవ భయంకరులుగా వున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వలన భయము చేత ఆ మర్రి చెట్టు నాలుగు వైపులా కూడా పన్నెండు మైళ్ల దూరంలో యెక్కడా ప్రాణి సంచారమనేదే వుండేది కాదు. అటు వంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరము నుంచే చూసిన తత్వనిష్ఠుడు ఆదిరిపడ్డాడు. దానితో బాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడినవాడై - శోకాకుల చిత్తముతో శ్రీహరిని స్మరించసాగాడు.
🌻. తత్వనిష్ఠుడి శరణాగతి
శ్లో" త్రాహి దేవేశ లోకేశ! త్రాహి నారాయ ణావ్యయ సమస్త భయవిధ్వంసిన్! త్రాహిమాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ ! త్వత్తోహం జగదీశ్వర !!
అంటే - "దేవతలకూ, లోకాలకూ కూడా యజమానివయిన వాడా ! నారాయణా ! అవ్యయా! నన్ను కాపాడు. అన్నిరకాల భయాలనూ అంతము చేసేవాడూ! నిన్నే శరణుకోరుతున్న నన్ను రక్షించు. ఓ జగదీశ్వరా! నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగనివాడను. నన్ను కాపాడు రక్షించు" అని యెలుగెత్తి స్మరించుచు రాక్షస భయముతో అక్కడ నుంచి పారిపోసాగాడు. అతనిని పట్టి వదించాలనే తలంపుతో ఆ రాక్షసత్రయము అతని వెనుకనే పరుగెత్తసాగినది. రక్కసులా పారునికి చేరువవుతున్న కొద్దీ, సాత్వికమైన విప్ర తేజస్సు కంటబడడం వలనా - తెరిపి లేకుండా అతనిచే స్మరించబడుతూన్న హరినామము చెవులబడుట వలనా - వెంటనే వారికి జ్ఞానోదయమయింది. అదే తడవుగా ఆ బాపని కెదురుగా చేరుకొని, దండ ప్రణామా లాచరించి, అతనికి తమ వలన కీడు కలుగబోదని నమ్మబలికి, 'ఓ బ్రాహ్మణుడా! నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి. అని పునః పునః నమస్కరించారు. వారి నమ్రతకు కుదుట పడిన హృదయముతో - తత్వనిష్ఠుడు 'మీరెవరు? చేయరాని పనులు వేనిని చేయడం వలన యిలా అయిపోయారు? మీ మాటలు వింటుంటే బుద్దిమంతుల్లా వున్నారు. మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు వివరముగా చెప్పండి. మీ భయబాధావళి తొలగే దారి చెబుతాను' అన్నాడు.
🌻. ద్రావిడుని కథ
పారుని పలుకులపై, ఆ రక్కసులలో ఒకడు తన కథనిలా వినిపించసాగాడు. 'విప్రోత్తమా! నేను ద్రావిడుడను. ద్రవిడ దేశమందలి మంధరమనే గ్రామాధికారినైన నేను, కులానికి బ్రహ్మణుడనే అయినా - గుణానికి కుటిలుడనీ, వంచనామయ వచః చమత్కారుడినీ అయి వుండేవాడిని. ణా కుటుంబ శ్రేయస్సుకై, అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువలకుగాని, బ్రాహ్మణులకు గాని యేనాడూ పట్టెడన్నమయినా పెట్టి ఎరుగను. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడంచేత - నా కుటుంబము నాతో సహా ఏడు తరాల వాళ్లు అధోగతుల పాలయిపోయారు. మరణానంతరము దుస్సహమైన నరకయాతనల ననుభివించి చివరికిలా బ్రహ్మరాక్షసుడనయ్యాను. కృపాయత్త చిత్తుడవై - నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు' అన్నాడు.
🌻. ఆంధ్రదేశీయుని గాథ
రెండవ రాక్షసునిలా విన్నవించుకోసాగేడు - 'ఓ పవిత్రుడా! నేను ఆంధ్రుడను. నిత్యమూ నా తల్లిదండ్రులతో కలహించుచు, వారిని దూషించుచు వుండేవాడిని. నేను నా భార్యాపిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ, తల్లిదండ్రులకు మాత్రం చద్దికూటిని పడవేసే వాడిని. బందావ బ్రాహ్మణ కోటికేనాడూ ఒక పూటయినా భోజనము పెట్టక - విపరీతముగా ధనార్జన చేసి ఆ కావరముతో బ్రతికే వాడిని. ఆ శరీరము కాలంచేశాక నరకానపడి ఘోరాతి ఘోరమైన బాధలనుభవించి చివరి కిక్కడిలా పరిణమించాను. ఆ ద్రావిదునికివలెనే - నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించుము' అని అన్నాడు.
🌻. పూజారి కథ
అనంతరం మూడవ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొఱపెట్టనారంభించాడు. 'ఓ సదాచార సంపన్నుడా! నేను ఆంధ్రదేశపు బ్రహ్మణుడను. విష్ణ్వాలయంలో పూజారిగా వుండేవాడిని. కాముకుడనూ, అహంభావినీ, కఠినవచస్కుడినీ అయిన నేను - భక్తులు స్వామి వారికర్పించే కైంకర్యాలన్నిటినీ - నా వేశ్యలకు అందచేసి, విష్ణు సేవలను సక్రమముగా చేయక గర్వముతో తెరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి, వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖములనుభవించుచు పాపపుణ్య విచక్షణారహితుడనై ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చవిచూసి, అనంతరము యీ భూమిపై నానావిధహీన యోనులలోనూ, నానా నీచజన్మలనూ యెత్తి కట్టకడకీ బెట్టిదమయిన బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను. ఓ సదాయుడా! నన్ను మన్నించి - మరలా జన్మించే అవసరం లేకుండా - మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా' అని ప్రార్ధించాడు.
🌻 బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతి పొందుట
తమ తమ పూర్వ భవకృత మహాఘరాశికి - ఎంతగానో పశ్చాత్తాప పడుతూన్న ఆ రక్కసులకు అభయమిచ్చి 'భయపడకండి - నాతో కలిసి కార్తీక స్నానానికి రండి. మీ సమస్త దోషాలూ నశించిపోతాయి' అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడా బ్రహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు - బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయముగా ముందు స్నానం చేసి, పిమ్మట రక్కసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరము
శ్లో" అముకానాం బ్రహ్మరాక్షసత్వ వివారణార్ధం !
అస్యాం కావేర్యాం - ప్రాతఃస్నాన మహం కరిష్యే !!
అనే సంకల్పములతో అతడు విధివిధానముగా స్నానం చేసి, తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా - వారు విగతదోషులూ - దివ్యవేషులూ అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు.
విదేహరాజా! అజ్ఞానము వలన కాని, మోహ - ప్రలోభాల వలన గాని, ఏ కారణము చేతనైనా గాని - కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీనదిలో స్నానమాచరించి, విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహముగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలము కలుగుతుంది. అందువల్ల - ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానమును తప్పకుండా చేయాలి. కావేరీలో సాధ్యము కాకపోతే గోదావరిలోనైనా, మరెక్కడయినా సరే - ప్రాతః స్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతః స్నానము చేయరో, వాళ్లు పది జన్మలు చండాలపు యోనులలో పుట్టి, అనంతరము ఊరపందులుగా జన్మిస్తారు సుమా! కాబట్టి - ఎటువంటి మీమాంసతోటీ నిమిత్తం లేకుండా స్త్రీలుగాని, పురుషులుగాని కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతఃస్నానం ఆచరించాలి.
ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్మ్యమందు త్రయీధ్యాయ స్సమాప్త:
🌹 🌹 🌹 🌹 🌹
#శివసూత్రములు #SivaSutras
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://www.youtube.com/@ChaitanyaVijnanam
https://t.me/Sivasutras
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://sivasutralu.blogspot.com/
https://incarnation14.wordpress.com/tag/siva-sutras/
https://www.threads.net/@prasad.bharadwaj
No comments:
Post a Comment