కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 8

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 8 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

నచికేతుడు మూడవ వరముగా ‘ఆత్మతత్వము’ను గురించి అడుగగా, యముడు నచికేతునకుగల యోగ్యతను తెలుసుకొనుటకున్నూ, వాని దృఢత్వమును ఎఱుగ గోరియూ, యముడు ఈ విధముగా అనుచున్నాడు
నూరు సంవత్సరములు జీవించునట్టి, పుత్ర పౌత్రులను అడుగుము. 

వారితో కూడా సుఖముగా జీవించుటకు వీలగునట్లు ఆలమందలను, ఏనుగులను, గుర్రములను, బంగారము మొదలగువానిని కోరుకొనుము. విశాలమైన ఈ భూభాగమును లేక మాండలిక రాజ్యమును కోరుకొనుము. 

ఈ సంపదలన్ని ఉన్నప్పటికిని నేను అల్పాయిష్కడనైతినే అని, వీని వలన కలుగు ఫలమేమని నీవు తలంచినచో, ఈ సంపదల వలన కలుగు సుఖమును అనుభవించుటకు, నీవు ఎంతకాలము జీవింప తలంతువో, అంతకాలము సుఖముగా జీవించి యుండు నటుల, వరమును కోరుకొనుము. విస్తారమైన ధనమును, దివ్యములు మానుషములు అగు, ఏ యే కామములు కలవో, వానిని అన్నింటిని కోరుకొనుము. 

ఈ లోకమున మానవులకందని కోరికలు ఎన్నియో కలవు. ఆ కోరికలన్నింటిని నీవు స్వేచ్ఛగా అడుగుము. రథములతోను, వాద్యములతోను కూడినట్టి స్త్రీలను, నీకు ఒసంగు చున్నాను. ఈ స్త్రీలచే అన్ని విధములైన సేవలు చేయించుకొనుము. అన్ని సుఖములను అనుభవింపుము. అంతేకానీ, మరణానంతర విషయము నన్ను అడుగకుము అని యముడు చెప్పెను.

         ఇక్కడ మనందరి విశేషాలను చెబుతున్నారన్నమాట. మనమందరం కామ్యక కర్మలుగా పూజలు చేసేటప్పడు రోజువారి నిత్యజీవితంలో కూడా, నిత్యపూజలు చేసేటప్పుడు, అనేక రకములైనటువంటి కోర్కెలను మనం అడుగుతూ ఉంటాము.

ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం, మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం, పుత్ర పౌత్రాది సిద్ధ్యర్థం, ఇలా ‘ధం’ అని చెప్పేటటువంటి ఎన్ని మంత్రాలు శ్లోకాల రూపంలో, మంత్రాల రూపంలో, విధుల రూపంలో ఏవైతే మనం రోజువారీ అడుగుతున్నామో, అవన్నీ కూడా మనకి ఇప్పుడిక్కడ బోధిస్తున్నారన్నమాట. 

మానవులందరూ సాధారణంగా అడిగేవి ఏమిటి? అంటే, నా మనవళ్ళు, ముని మనవళ్ళని చూచేంత వరకూ నేను బ్రతికి ఉండుట. మునిమనుమడికి మునిమనుమడు పుట్టేవరకూ అనుగ్రహించా పో! అన్నాడాయన.  

పూజలు జరిపేటప్పుడు మనం గుడికెళ్ళి పూజించారనుకోండి, ఏం చెబుతారు? ధన వస్తు వాహన కనక పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం అంటాడాయన, ఒకేసారి అన్నీ కలిపి కోరేశాడన్నమాట. 

ఒక్కోసారి ఒక్కొక్కటి అడిగితే కష్టమని. ధన, వస్తు, వాహన, కనక మళ్ళా వస్తువులలో, వాహనాలలో కనకం ఉంటుందో లేదో అని, మళ్ళా కనకం వేరుగా ధన, వస్తు, వాహన, కనక ఇంకేమిటి? రధ, గజ, తురగ ‘రధ గజ తురగ’ - అంటే, ఏనుగులు, గుర్రాలు, రధాలు. ఇంకేం కావాలట? ఇవన్నీ ఉన్నాయండీ మరి సౌకర్యాన్ని అమర్చుకోవడానికి కావలసినటువంటి కుటుంబ సౌఖ్యం అమరేటటువంటివన్నీ కూడా కావాలా? వద్దా? అవి కూడా ఇచ్చారు. 

ఇవన్నీ కలిపి ఏక మొత్తంగా ఒక్కొక్కటి విడివిడిగా అడగాల్సిన పనిలేకుండా, నీకు మొత్తం ఒకసారే ఇచ్చేశాను అనుకో, అవన్నీ తీసేసుకోవయ్యా, ఈ ఆత్మతత్వాన్ని విడిచిపెట్టు అన్నాడు.
         
ఇందులో ఒక గొప్ప రహస్యాన్ని బోధిస్తున్నారు. ఏమిటంటే, మానవులెవరైతే, ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలని, తీవ్రమైనటువంటి తపన చెందుతూ ఉంటారో, తీవ్రమోక్షేచ్ఛను పొందాలనే ప్రయత్నం చేస్తారో, తీవ్ర వైరాగ్యాన్ని పొందే ప్రయత్నం చేస్తారో, అప్పుడు ప్రకృతి వీటన్నింటినీ అనుగ్రహించడం మొదలుపెడుతుంది. అనుకున్నదే తడవుగా అయిపోవడంతో మొదలౌతుంది. ఇప్పుడు ఏదన్నా వర్షం ఆగిపోతే బాగుండు, అనుకుంటాడు. వర్షం ఆగిపోతుంది. 

ఇప్పుడు ఏదన్నా బండి వచ్చి నన్ను ఎక్కించుకెళ్తే బాగుండు అనుకుంటాడు. ఎవరో వస్తారు, టక్కుమని ఎక్కమంటారు, ఎక్కించుకుని తీసుకువెళ్ళి చేరవలసిన గమ్యస్థానంలోకి దించేస్తారు. 

ఇప్పుడు నన్ను ఎవరైనా కీర్తిస్తే బాగుండు అనుకుంటాడు, వెంటనే ఆ సమయం సందర్భం ఒనగూడి, ఆయన్ని అద్భుతంగా ఇంద్రుడని, చంద్రుడని, సూర్యుడని వాళ్ళకంటే గొప్పవాడని, ఇంకా అంతకంటే రాజరాజని, చక్రవర్తి అని ఈ రకంగా పొగిడేస్తారు. ఇప్పుడు నాకు అర్జెంటుగా అధికారం లభిస్తే బాగుండు అనుకుంటాడు. 

వెంటనే మండలాధిపత్యమో, లేకపోతే సామ్రాజ్యాధిపత్యమో ఇంకా మరీ అయితే చతుర్దశ భువన భాండములందు ఆయన కోరినటువంటి లోకానికి అధిపతిగానో, వెంటనే చేయబడుతాడు. 

ఈ రకంగా సకామ్యమైనటువంటి ఆకర్షణ, ప్రేరణ నీలో కలుగుతుంది. కలగగానే నీవు సరే అంటే చాలు అంతే, ఇంకేమి ఎక్కువ అననవసరం లేదు. ఓకే అంటే చాలు, రెండు అక్షరాల పదం, సరే అంటే చాలు. ఔను అంటే చాలు. తల పంకించినా చాలట, దానికి ఎక్కువ అవసరం లేదు, ఔను అని తల ఊపినా చాలట. అంతే, అది అయిపోతావు అంతే వెంటనే. 

ఆ రకంగా నీవు ఈ రకమైనటువంటి ప్రకృతితో కూడినటువంటి, భోగ భాగ్య సంపదలతో కూడిన సమస్తము నీవు పొందేటటువంటి అవకాశము ఆత్మసాక్షాత్కార జ్ఞానం పొందేలోగానే వస్తుంది. వాటన్నింటి యందు నీవు విరక్తుడవై, పూర్ణవైరాగ్యమును పూని ఉన్నవాడవైతేనే నీవు ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతావు.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment