గీతోపనిషత్తు -173


🌹. గీతోపనిషత్తు -173 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 16

🍀 16. సమతుల్య ప్రవర్తన - సమతుల్యమే యోగమునకు ప్రధానము. అతిగా భుజించి నను, అతిగా నిద్రించినను సాధకుని యందు మితిమీరిన తమస్సు ఏర్పడును. దేహము బరువెక్కును. సోమరితనము కలుగును. దానివలన మరపు కలుగును. ఆహారము, పని, నిద్ర విషయము లందు సమతుల్యమును ప్రతి సాధకుడు తనకు తానుగ సాధించుకొన వలసినదే. అట్లు కానిచో యోగ సాధనకు అర్హత లేదు. యోగ సాధకుడు సంఘ జీవనమున తనదగు క్రమము నేర్పరచు కొనవలెను. అవసర మగుచో కొన్ని సాంఘిక కార్యములను విసర్జించవలెను. అట్లే ఏకాంతము పేరున సంఘమునకు, కుటుంబమునకు దూరమగుట యోగ సాధనకు పనికిరాదు. అట్లని వారితో మమైకమగుట కూడ సాధన కంతరాయమే. సమతుల్యమే యోగమునకు ప్రధాన సూత్రము. 🍀

నాత్యశ్నతస్తు యోగో స్తి న చై కాంత మనశ్నతః |
న చాతిస్వప్న శీలస్య జాగ్రతో నైవ చార్జున || 16


అతిగా భుజించువాడు, అసలు భుజించనివాడు యోగి కాడు. అతిగా మేల్కొని యుండువాడు మరియు అతిగ నిద్రించు వాడు కూడ యోగి కాడు. సమతుల్యమే యోగమునకు ప్రధానము. అతిగా భుజించి నను, అతిగా నిద్రించినను సాధకుని యందు మితిమీరిన తమస్సు ఏర్పడును. దేహము బరువెక్కును. సోమరితనము కలుగును. దానివలన మరపు కలుగును.

చేయవలసిన పనుల యందు అశ్రద్ధ, ఆలస్యము, వైఫల్యము కలుగుచుండును. సామాన్యముగ మానవునకు దినమున ఆరేడు గంటలకన్న నిద్ర అవసరము కలుగదు. రెండుమూడుసార్లు కన్న అన్నపానీయము లావశ్యకత కలుగదు. ఆకలి, దాహము, నిద్ర అతిగా నున్నచో జీవితమే బరువగును. ఇక యోగ మెక్కడ?

తన దేహ పరిస్థితిని తానే గమనించి, తన దేహమునకు సరిపడు ఆహారము తానే తెలుసుకొని భుజింపవలెను. అజీర్తికి తావియ్యరాదు. పగటి నిద్ర నిషిద్ధమని ఆర్యులు తెలుపుదురు. ఎండలు మండు కాలమున మధ్యాహ్నము నిద్రించుట కన్న, ఇరువది ముప్పది నిమిషములు విశ్రాంతి గొనుట మేలు. శరీరమునకు తగిన వ్యాయామము, స్నానాదిక శుచిత్వము, పరిశుద్ధమగు భోజనము, సౌకర్యమును గూర్చు వస్త్రధారణము ప్రధానములు.

నిజమునకు సూర్యరశ్మి, పీల్చు గాలి, నీరు కూడ ఆహారములే. వీనిని దండిగ గొనువారు ప్రాణశక్తిని చక్కగ నార్జించుకొందురు. ఆ మేరకు భోజనమును తగ్గించుకొందురు. ఏది ఎట్లున్నను శరీరమును ఆరోగ్యవంతముగ నుంచుకొనుట, బరువుగ తనకు అని పించకుండుట ముఖ్యము. పరుగున బోవు గుఱ్ఱము వలె చురుకుగ నున్న శరీరము ప్రధానమని తెలియవలెను.

ఆహారము, పని, నిద్ర విషయము లందు సమతుల్యమును ప్రతి సాధకుడు తనకు తానుగ సాధించుకొన వలసినదే. అట్లు కానిచో యోగ సాధనకు అర్హత లేదు. అదే విధముగ వలసిన భోజనమును భుజింపని వాడు, ఆవశ్యకమగు నిద్రను నిర్జించువాడు కూడ సమతుల్యమును కోల్పోవును. ఇట్టి వాని యందు రజోగుణము మితిమీరును.

దొరికినది తినుట, ఆలస్యముగ నిద్రించుట, ఐదుగంటల కన్న తక్కువ నిద్రించుట, నిద్రపట్టక పోవుట ఇట్టి వన్నియు రజోగుణ దోషములే. దీనివలన శరీరము శుష్కించును. సాధనకు పనికి రాదు. మితి మీరిన పరుగుతో పనులు చేయువారు ఆహారమును, నిద్రను లెక్క చేయరు. వీరును యోగార్హత కోల్పోవుదురు. ప్రస్తుత కాలమున ఆహార వ్యవహార, నిద్రాదులయందు మానవజాతి సమతుల్యమును కోల్పోయినది.

యోగ సాధకుడు సంఘ జీవనమున తనదగు క్రమము నేర్పరచు కొనవలెను. అవసర మగుచో కొన్ని సాంఘిక కార్యములను విసర్జించవలెను. మితిమీరిన పనులు, కార్యములు, కార్యక్రమములు సాధకుని సహజ ప్రశాంతతను హరించును. కావున సాధకుడు విచక్షణతో తనదగు క్రమ శిక్షణను సౌమ్యముగ నేర్పరచుకొనవలెను.

అట్లే ఏకాంతము పేరున సంఘమునకు, కుటుంబమునకు దూరమగుట యోగ సాధనకు పనికిరాదు. అట్లని వారితో మమైకమగుట కూడ సాధన కంతరాయమే. సమతుల్యమే యోగమునకు ప్రధాన సూత్రము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


21 Mar 2021

No comments:

Post a Comment