శ్రీ శివ మహా పురాణము - 373


🌹 . శ్రీ శివ మహా పురాణము - 373 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 11

🌻. హిమవంతునితో శివుని సమాగమము - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-


లోకములచే పూజింపబడే ఆ శక్తి హిమవంతుని పుత్రికయై ఆయన గృహములో పెరిగి ఎనిమిది సంవత్సరములు వయస్సు గలది అయెను (1). ఓ నారదా! సతీ వియోగ దుఃఖితుడైన శివుడు ఆమె జన్మించిన వృత్తాంతము నెరింగి అంద్భుతమగు ఆమె మూర్తిని తన హృదయుములో ధ్యానించి మిక్కిలి ఆనందించెను (2).

అదే సమయములో లోకాచారము ననుసరించి శంభుడు మనస్సును నియంత్రించి గొప్ప తపస్సును చేయగోరెను (3). ఆయన నంది మొదలగు శాంతస్వభావము గల కొందరు గణములు వెంటరాగా ఉత్తమమగు హిమవత్పర్వత శిఖరమునందున్న గంగావతార క్షేత్రమును చేరుకొనెను (4).

ఓ మహర్షీ! పరమ పావనియగు గంగ సర్వుల పాపసమూహములను నశింప చేయుట కొరకై పూర్వము బ్రహ్మ పురమునుండి జారి ఇచట పడినది (5). జితేంద్రియుడగు శివుడు అచట నుండి తపమునారంభించెను. ఆయన అలసట ఎరుంగని వాడై ఆత్మస్వరూపమును ఏకాగ్రతతో ధ్యానించెను (6).

నిత్యము, జ్యోతిస్స్వరూపము, నిర్దోషము, చిదానందఘనము, అద్వయము, సర్వాశ్రయము అగు అత్మ మనస్సులో అఖండ ధీరూపముగా గోచరించును. ఆత్మయే జగద్రూపముగా పరిణమించినది(7). శివుడు ధ్యానములో నిమగ్నుడై యుండగా, నంది, భృంగి మొదలగు కొందరు ప్రమథ గణములు కూడా ధ్యానమను చేయ మొదలిడిరి (8).

అపుడు కొందరు గణములు శంభు పరమాత్ముని సేవను చేసిరి. మరి కొందరు శబ్దమును చేయకుండగా మౌనముగా ద్వార పాలురై నిలబడిరి(9). ఇంతలో ఔషధిప్రస్థములో శివుని రాకను గురించి విని హిమవంతుడు ఆదరముతో అచటకు విచ్చేసెను(10). గణములతో కూడియున్న ఆ పర్వతరాజు రుద్ర ప్రభువునకు చేతులొగ్గి నమస్కరించి ప్రేమతో పూజించి స్తుతించెను(11).

హిమాలయుడిట్లు పలికెను-

దేవ దేవా! మహాదేవా! జటాజూట ధారీ! శంకరా! ప్రభో! లోకనాథుడవగు నీవీ ముల్లోకములను పాలించుచున్నావు(12). హే దేవదేవా! ఈశ్వరా! యోగి రూపమును ధరించిన నీకు నమస్కారము. నిర్గుణుడవయ్యు సగుణుడవై విహరించు నీకు నమస్కారము (13).

హే శంభో! కైలాసవాసి అయ్యు సర్వలోకములను సంచరించునట్టియు, లీలచే ఆకారమును స్వీకరించి శూలధారివగు నీకు నమస్కారము. నీవు పరమేశ్వరుడు (14). నీవు సకలగుణ నిధానమవు. వికారములు లేనట్టియు, కామనలు లేనట్టియు, విశిష్టమగు సంకల్ప శక్తి కలిగినట్టియు, జ్ఞానఘనుడైనట్టియు, పరమాత్మవగు నీకు నమస్కారము (15).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


21 Mar 2021

No comments:

Post a Comment