✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 18 - 1
🍀 18. నూతన చిత్తము - 1 - చిత్తమును దేనిపై నియమింపవలెను? ధ్యాన సమయమున తాను, నేను అను వెలుగు పై తన లోపల నొకచోట నియమింపవలెను. అట్లు నియమించుట హృదయము నందు గాని, భ్రూమధ్యము నందు గాని చేయవలెను. అభ్యాస వశమున చిత్తము పరిపరి విధముల ఇంద్రియ మార్గములలో ప్రవృత్తి లోనికి పరువెత్తు చుండును. దానిని మరల “తాను - నేను" అను వెలుగు వైపునకు మళ్లించుటకు కావలసినది అనునిత్య అభ్యాసము. పై తెలిపిన విధముగ నియమింప బడుటకు సాధకునకు మిక్కిలి ఓర్పు, సహనము కావలెను. సాధకుని స్ఫూర్తిని బట్టి అతని యందు మరియొక చిత్త ముద్భవించును. అట్టి నూతన చిత్తమునకు బలమేర్పడుటకే అనునిత్య అభ్యాసము. 🍀
యదా వినియతం చిత్తమాత్మన్యే వావతిష్ఠతే |
నిస్పృహ స్సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా || 18
వినియతమైన చిత్తము ఎప్పుడును ఆత్మయందే తిష్ఠ వైచి యుండునపుడు సర్వకామమలు నిస్పృహ చెందును. అట్లు చెందుట వలన యోగసాధకుడు, యోగ యుక్తుడగు చున్నాడు. సామాన్యముగ పరిపరి విధముల పోవు చిత్తమును నిర్దిష్టముగ ఒకే విషయమున నుంచుట ముందు తెలుపబడినది.
చిత్తమును నియమింపుము అని ముందు శ్లోకములలో తెలుపుట జరిగినది. చిత్తమును దేనిపై నియమింపవలెను? ధ్యాన సమయమున తాను, నేను అను వెలుగు పై తన లోపల నొకచోట నియమింపవలెను.
అట్లు నియమించుట హృదయమునందు గాని, భ్రూమధ్యము నందు గాని చేయవలెను. ఇట్లు ఏకాగ్రతతో చిత్తము ఒక నిర్దిష్ట కేంద్రమున నియమించుటకు వలసిన అనుగుణములను ముందు శ్లోకములలో వివరించుట జరిగినది.
అభ్యాస వశమున చిత్తము పరిపరి విధముల ఇంద్రియ మార్గములలో ప్రవృత్తి లోనికి పరువెత్తు చుండును. దానిని మరల “తాను - నేను" అను వెలుగు వైపునకు మళ్లించు అభ్యాసము మరియొకటి నేర్వవలెను. ఇది అభ్యాస మగువరకు తిప్పలు తప్పవు. నిత్య పరిశ్రమ అభ్యాసమును కూర్చగలదు. అంతరంగమున చిత్తము పూర్తిగ, స్థిరముగ నేనను వెలుగునందు తిష్ఠ వేయుట ఈ శ్లోకమున చెప్పబడినది.
దానికి వలసినది అనునిత్య అభ్యాసము. ప్రతిదినము రెండు మార్లుగాని, మూడు మార్లుగాని ఈ అభ్యాసము చేయవలెనని పెద్దలు తెలుపుదురు. త్రిసంధ్యలు అట్టి అభ్యాసమునకు అనుకూలమగు కాలమని కూడ పెద్దలు తెలిపిరి. ఇంద్రియ ప్రవృత్తులలో తిరుగుట నేర్చిన చిత్తము, పై తెలిపిన విధముగ నియమింపబడుటకు సాధకునకు మిక్కిలి ఓర్పు, సహనము కావలెను. జన్మల తరబడి బహిరంగమున తిరుగాడెడి చిత్తమును నిర్దిష్టముగ నొకచోట నుంచుట పరిశ్రమతో కూడినది.
తిరుగుబోతు స్వచ్ఛందముగ నింటనుండుట సాధ్యమా! గ్రామ వీధుల తిరుగాడు గ్రామసింహము (ఊరకుక్క) ఒక చోట నుండుట కిష్టపడునా! సాధకుని స్ఫూర్తిని బట్టి అతని యందు మరియొక
చిత్తము ఉద్భవించును. అట్టి నూతన చిత్తమునకు బల మేర్పడుటకే అనునిత్య అభ్యాసము.
స్ఫూర్తికి కారణము దైవ సంకల్పము. దైవ సంకల్పమే నూతన స్ఫూర్తిగ భాసించును. అదియే నూతన చిత్తము. ఈ చిత్తమును దైవారాధన ద్వారా, నిత్య అభ్యాసముద్వారా బలపరచుకొనుట సాధకుని కర్తవ్యము. సత్సాంగత్యము, సత్కర్మాచరణము, సద్గుణోపాసన, సదౌష్టి ఈ చిత్తమునకు బలమీయగలవు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
25 Mar 2021
No comments:
Post a Comment