శ్రీ శివ మహా పురాణము - 375


🌹 . శ్రీ శివ మహా పురాణము - 375 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 11

🌻. హిమవంతునితో శివుని సమాగమము - 3 🌻


ఓ పర్వత రాజా! నాతపస్సు ఇచట ఇపుడు అన్ని విధములా నిర్విఘ్నముగా కొనసాగునట్లు మంచి యత్నమును చేయుము (30). ఓ పర్వత శ్రేష్ఠమా ! నీవు నాకు చేయగల గొప్ప సేవ ఇదియే. కావున, ఆ కార్యమును ప్రయత్న పూర్వకముగా చేయుము. ఇప్పుడు ఆనందముతో ఇంటికి మరలుము (31).

బ్రహ్మ ఇట్లు పలికెను-

గొప్ప లీలలను ప్రకటించు వాడు జగన్నాథుడు అగు ఆ శివుడిట్లు పలికి మిన్నకుండెను. అపుడా పర్వత రాజు శంభునితో స్నేహపూర్వకముగా నిట్లనెను (32).

హిమవంతుడిట్లు పలికెను-

ఓ జగత్ప్రభో! పరమేశ్వరా! నేను ఈనాడు నిన్ను పూజించితిని. ఈ ప్రదేశమునకు నేను నిన్ను ఈనాడు స్వాగతము చెప్పుచున్నాను. నా ప్రదేశమునందున్న నిన్ను నేను ఏమి కోరెదను? (33) ఓ మహేశ్వరా! మహాయత్నముతో గొప్ప తపస్సు చేసిన దేవతలకు కూడ దర్శనము నీయని నీవు స్వయముగా ఇచటకు వచ్చితివి (34). నా కంటె గొప్ప పుణ్యాత్ముడు మరియొకడు ఉండబోడు. ఏలయన, నీవు నాశిఖరముపై తపస్సు కొరకు విచ్చేసితివి (35). ఓ పరమేశ్వరా! నీవు గణములతో కూడి ఇచటకు వచ్చి నన్ను అనుగ్రహించుటచే, నేను దేవేంద్రుని కంటె అధికుడనైతినని భావించుచున్నాను (36).

ఓ దేవదేవా! నీవు స్వతంత్రుడవు. ఇచట నిర్విఘ్నముగా గొప్ప తపస్సును చేసుకొనుము. అట్టి సేవను నేను నీకు చేయగలను. హే ప్రభో! నేను నీకు సర్వదా దాసుడను (37).

బ్రహ్మ ఇట్లు పలికెను-

పర్వత రాజు ఇట్లు పలికి వెంటనే తన గృహమునకు వచ్చి ఆ వృత్తాంతమును తన ప్రియురాలికి మిక్కిలి ఆదరముతో వివరించి చెప్పెను (38). ఓ నారదా! ఆ పర్వత రాజు తనతో వచ్చిన సేవకులను, ఇతర గణములను అందరినీ పిలిచి వారితో నిశ్చయముగా నిట్లు చెప్పెను (39).

హిమవంతుడిట్లు పలికెను-

ఈనాటినుండి ఏవ్వరైననూ నా శాసనముచే ఈ గంగావతరణమనే నా శిఖరమునకు వచ్చుట నిషేధింపబడినది. నేను సత్యమును పలుకుచున్నాను (40). అచటకు ఎవరైననూ వెళ్లినచో, అట్టి పరమదుర్మార్గుని తీవ్రముగా దండించగలను. నేను సత్యమును పలుకుచున్నాను (41). ఓ మహర్షీ ! ఆ పర్వతరాజు ఈ తీరున తన గణములన్నింటినీ శాసించి, శివుని ఏకాంతమునకు మంచి ఏర్పాటును చేసెను. ఆ వివరములను చెప్పెదను. నీవు వినుము (42).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందలి పార్వతీ ఖండలో శివశైలసమాగమ వర్ణనమనే పదకొండవ అధ్యాయము ముగిసినది (11).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


25 Mar 2021

No comments:

Post a Comment