మైత్రేయ మహర్షి బోధనలు - 8
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 8 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 6. బృందజీవనము 🌻
బృంద జీవనమునకు సహకారము, పరస్పర గౌరవము, ఏకాభిప్రాయము, సమిష్ఠి శ్రేయస్సు మూల స్తంభములు. ఈ నాలుగు అంశములూ ఎచ్చట ప్రకాశించుచుండునో అచ్చట బృందజీవనము (Group living) సహజీవనముగ సిద్ధించును. బృందమునకు ఒక నాయకుడున్నను, నిర్ణయములు సమిష్టిగా జరుగుట, సమిష్టి నిర్ణయమును నాయకుడు నిర్వహించుట శ్రేయస్కరము. తన తోటివారిని తనతో సమానముగా మన్నించి, గౌరవించి, సంప్రదించి, సమిష్టి నిర్ణయమును మాత్రమే నిర్వర్తించువాడు నిజమైన నాయకుడు. అధికారమును చూపువాడు సంస్కారవంతుడగు నాయకుడు కాడు. ఈ భావమునే రోమన్ రాజ్యాంగ విధానము అనుసరించినది. మరియు గ్రీకు దేశపు ద్రష్టలగు సోక్రటీసు, ప్లాటో ప్రతిపాదించిరి. సమత్వము, సమభావము నాయకుని ముఖ్య లక్షణములు. బృందమందలి సభ్యుల యందు పరస్పరత్వము ఒక కట్టు బాటు.
ఒకరినొకరు ఆదరించుట, సహాయపడుట, విమర్శించు కొనకుండుట పరస్పర ప్రేమానురాగములకు దారి తీయును. ఇది లేనిచో బృందమొక మఠమగును. మఠములయందు యాంత్రిక దినచర్యయే కాని స్ఫూర్తి తరుగుచుండును. ఒకచోట ఉండినను, ఎవరికి వారుగా నుండుట, యాంత్రికముగ కలియుట, యాంత్రికముగ పూజలు చేయుట జరుగుచుండుట చేత కార్యక్రమములు యందు నిస్పృహ తాండవించుచుండును. స్ఫూర్తి అదృశ్యమగు చుండును. బృందములుగ జీవించుటకు చెప్పబడిన సూత్రములు నాలుగు. అవి ఎచ్చట నిర్వర్తింప బడుచున్నవో అచ్చట బృందజీవనము యొక్క రసానుభూతి కలుగును. కావున బృందజీవనము ఆశ్రమ జీవనమే కానక్కరలేదు. కుటుంబము నందేర్పరచు కొనవచ్చును. అన్ని రకముల సంస్థల యందు కూడా బృందజీవనము రసానుభూతి కలిగించును. ఈ సూత్రములతో నిర్వహింపబడు ఆధ్యాత్మిక సంస్థ కాని, ధార్మిక సంస్థ కాని, సాంఘిక సంస్థ కాని, వ్యాపార సంస్థ కాని మానవునకు స్ఫూర్తి, ఆనందము కలిగించుట తథ్యము.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
22 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment