గీతోపనిషత్తు -317


🌹. గీతోపనిషత్తు -317 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 22 -6 📚

🍀 22-6. అభియుక్తుడు - చూడగలిగిన వారికి సమస్తము దైవము. ఇట్టి అపరిమితము, విశాలమగు చింతన ఆవశ్యకమని భగవానుడు బోధించుచున్నాడు. అట్టి అనన్య చింతన గలవానికి అన్నిట, అంతట అనునిత్యము దైవము గోచరించుచునే యుండును. అట్టివాడు పరి ఉపాసకుడు. ఉపాసనమందు పూర్ణస్థాయికి చేరినవాడు. ఈ విధముగ సాధన చేయువాడు నిత్యము ఈశ్వరునితో కూడి యుండును. అభియుక్తుడై యుండును. విభక్తుడు కాక యుండును. అట్లు అభియుక్తుడైన వాడు దైవమువలెనే పూర్ణుడగును. 🍀

22. అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహా మ్యహమ్ ||

తాత్పర్యము : అనన్యచింతనము, పరిఉపాసనము, నిత్య అభియుక్తత ఏ జనులైతే నిర్వర్తింతురో అట్టివారి యోగ క్షేమము లను నేను వహించుచున్నాను.

వివరణము : పూజలు చేయువారు కొంత తడవు దైవముతో కూడి యుండుట జరుగవచ్చును. అట్లే హోమము చేయువారు, స్తోత్రము చేయువారు, ధ్యానము చేయువారు, స్మరణ చేయువారు, కీర్తన చేయువారు ఆయా సమయము లందు దైవముతో కూడి యుండవచ్చును. ఇతర సమయములలో అట్టి కూడిక యుండదు.

ఎప్పుడునూ కూడి యుండు వానికి, అపుడపుడు కూడి యుండు వానికి వ్యత్యాసము ఏనుగునకు దోమకు గల వ్యత్యాసము వలె యుండును. ఈ శ్లోకమున సాధన అనుక్షణమై యున్నది. అనునిత్యమై యున్నది. నిరంతరమై యున్నది. ఇట్టి నిరంతర అభియుక్తి వలన జీవుడు దైవము నందిమిడి పోవును. దైవము జీవుని యందు పరిపూర్ణముగ నిండిపోవును. అట్టి యోగము పూర్ణమగు క్షేమము నిచ్చును. వశిష్ఠాది బ్రహ్మరులు ఇట్టి యోగము నందే శాశ్వతముగ నిలచి యున్నారు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


05 Feb 2022

No comments:

Post a Comment