శ్రీ శివ మహా పురాణము - 515


🌹 . శ్రీ శివ మహా పురాణము - 515 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 44

🌻. మేన యొక్క మంకు పట్టు - 1 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను-

తరువాత హిమవంతుని ప్రియురాలు, సాధ్వియగు మేన సంజ్ఞను పొంది మిక్కిలి సంక్షోభమును పొందినదై రోదించి ఆ వివాహమును తిరస్కరించెను (1). ఆమె మిక్కిలి దుఃఖమును పొందినదై ముందుగా తన కుమారులను అనేక పర్యాయములు నిందించి, తరువాత తన కుమార్తెతో పరుష వచనములను పలికెను (2).

మేన ఇట్లు పలికెను-

ఓ మునీ! శివాదేవి శివుని వరించగలదు అని పూర్వము నీవు చెప్పితివి. తరువాత హిమవంతునకు కర్తవ్యమును బోధించి, ఆయనను పూజ కొరకు కూర్చుండ బెట్టితివి (3). దాని వలన విపరీతము, ఆనర్థకరము అగు ఫలము లభించినది. ఇది వాస్తవము. ఓ మునీ! దుష్ట బుద్ధీ! అభాగ్యురాలనగు నేను నీచీ అన్ని విధములుగా మోసగింప బడితిని (4).

తరువాత ఆమె మునులకు కూడా చేయ శక్యము కాని తపస్సును చేసినది. దానికి ఈ దుఃఖమును కలిగించు ఫలము లభించినది. చూడుము (5). నేనేమి చేయుదును? ఎచటకు వెళ్లెదను? నా దుఃఖమును ఎవరు పోగెట్టెదరు? నాకులము, జీవితము, సర్వము నాశమును పొందినవి (6).

ఆ దివ్యర్షులు ఎక్కడకు వెళ్లిరి? నేను వారి గెడ్డములను ఊడపెరికెదను. తపస్సు చేసుకొనే ఆ వసిష్ఠపత్ని దుష్టురాలు గనుకనే స్వయముగా వచ్చి వివాహమును నిశ్చయించినది (7). కొందరి ఆపరాధము చేత నేనీనాడు సర్వమును పోగొట్టుకొంటిని. ఇట్లు పలికి ఆమె కుమార్తెను చూచి పరుషవాక్యములను పలికెను (8).

ఓ అమ్మాయీ! దుష్టురాలా! నీవు నాకు దుఃఖమును కలిగించు పనిని ఏల చేసితివి? నీవు స్వయముగా బంగారము నిచ్చి ఇత్తడిని తెచ్చితివి (9). నీవు చందనమును పారద్రోసి బురదను పూసుకుంటివి. హంసను విడిచి పెట్టి చేతి యందలి పంజరములో కాకిని భద్రము చేసితివి (10).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


05 Feb 2022

No comments:

Post a Comment