సిద్దేశ్వరయానం - 51 Siddeshwarayanam - 51

🌹 సిద్దేశ్వరయానం - 51 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 16వ శతాబ్దం 🏵


భక్తి భరితమైన వేదనకు, అతని చిరకాల కఠోర తపస్సుకు కాళీ దేవి కనికరించి, దయామయి అయిన ఆజగజ్జనని అతనిముందు సాక్షాత్కరించింది. "బిడ్డా! నీ కఠోరమైన తపస్సుకు నేను కదలివచ్చాను. పూర్వజన్మలలోనూ నీవు నా భక్తుడవు. ఎప్పుడూ నిన్ను అనుగ్రహిస్తునే ఉన్నాను. రెండు జన్మల క్రింద నీవు మహాసిద్ధుడవు. నీవు సుఖ భోగములను త్యజించి క్రూర తపస్సు చేసిన సాధనలు కి ఆనాడు నా అనుగ్రహాన్ని సాధించావు. అప్పుడు నీవు తపస్సు చేసిన చోటు కూడా ఇదే. నాటి నీ భౌతిక శరీరం నీ ఆజ్ఞ వల్ల నీ శిష్యులు ఈ గుహలో ఖననం చేశారు.

నా సంకల్పం వల్ల నీ జీవు డిక్కడికి ఆకర్షించబడ్డాడు. మధ్యలో వచ్చిన జన్మలు నీ అంత రాంతరాలలో ఉన్న సుఖ భోగ కాంక్షలు తీరటానికి సరిపోయింది. ఈ జన్మలో మళ్ళీ ఇక్కడకు వచ్చి ఆనాటి నీ సమాధి మీదనే నీవు కూర్చోని జపం చేశావు. కాలవశాన వచ్చిన మార్పుల వల్ల ఆ చిహ్నము లేవీ పైకి కన్పించక పోవడం వల్ల నీకు తెలియలేదు. నేనే, నీకు స్వప్నంలో మంత్రాన్ని ఇచ్చాను. నేనే, నిన్ను ఇక్కడకు రప్పించాను. నీ చేత తపస్సు చేయించాను. నీకు దివ్య శక్తులను ప్రసాదిస్తున్నాను. ఈ శరీరంలో నీవు మూడు వందల సంవత్సరాలు జీవిస్తావు నీకు తోడుగా నేను ఎప్పుడు ఉంటాను.” అని కాళీదేవి పలికింది.

ఆ యోగి "అమ్మా! నీ అనుగ్రహం వల్ల నేను ధన్యుడనయినాను. ఎప్పుడూ నీ ఉపకరణంగా ఉంటూ నీవు సంకల్పించిన పనులను చేసే సేవకునిగా నన్ను నియమించు నీవు నాతో ఎప్పుడూ ఉంటానన్నావు. భౌతికంగా కూడా అది జరిగేలా చెయ్యి అన్నాడు.

కాళీదేవి నవ్వి "ఓయీ! చిత్రమైన కోరిక కోరావు. ఇది కలియుగం. నేను నీ వెంట దివ్యాకృతితో ఉండడం ఉచితంకాదు. కానీ నీ వంటి భక్తుని కోరికను కాదనలేను. చిన్న విగ్రహ రూపంలో నీతో ఉంటా. ఆ విగ్రహంలో నీకు కన్పిస్తాను, మాట్లాడుతాను. నీ బుద్ధిని ప్రచోదిస్తూ ఉంటాను. అయితే ఈ విగ్రహం అన్ని విగ్రహాల వంటిది కాదు. పసిబిడ్డ పెరిగి పెద్దదయినట్లే ఇది కూడా పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. ఇది జీవత్ విగ్రహం అనడానికి నిరూపణగా దీనికి ఉఛ్వాస నిశ్వాసలుంటాయి. నాడీ స్పందన ఉంటుంది.

ఇక్కడ నుండి నా విగ్రహంతో నీవు బయలుదేరి దేశ సంచారం చెయ్యి ఎందరో యోగులు, సిద్ధులు నీకు తటస్థిస్తుంటారు. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రజలను మలుస్తూ యోగసాధనలలో తపస్సాధనలలో మరింత ముందుకు పోయేలా చేస్తూ నీవు పురోగమించు. ఈ విగ్రహం పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. ఇప్పటి మనుష్య ప్రమాణం వచ్చిన తరువాత దానినొకచోట స్థాపించి ఆలయాన్ని నిర్మిద్దువుగాని. ఎప్పుడు ఏమి చేయ వలసినదీ నేను నిర్దేశిస్తుంటాను” అతని ముందు తేజస్వంతమైన ఒక చిన్న విగ్రహం అవతరించింది.

ఆ విగ్రహంతో హిమాలయాల నుండి బయలుదేరి యావద్భారత దేశము సంచరించాడు కాళీయోగి. ఉత్తరాపథంలో బృందావనంలో కొంత ఎక్కువకాలం ఉండవలసి వచ్చింది. అక్కడి రాధాకృష్ణ భక్తులైన రూపగోస్వామి, సనాతనగోస్వామి, మొదలైన ప్రేమయోగులతో అనుబంధం పెరిగింది. ఆధామంతో తనకున్న పూర్వజన్మ బంధాలు గుర్తుకువచ్చినవి. ఒకసారి హితహరివంశమహరాజ్ అనే రాధాభక్తుడు తన ఆశ్రమానికి ఆహ్వానించి తాను రచించిన రాధాసుధానిధి అనే గ్రంధం వినిపించాడు. తనను రాధాసఖిగా భావించుకొని అతడు చేసిన ఆ రచన తననెంతో ఆకర్షించింది. సంస్కృతంలో అంతటి రసవంతమైన రచన భక్తి ప్రేమామృతాన్ని వర్ణించే రచన మరొక్కటి లేదని అనిపించింది. అతడు కాళీయోగిని కాళీ రూపంగానే భావించేవాడు. కాళి కూడా రాధాసఖులలో ఒకరని వాదించేవాడు. ఆ రసిక భక్తునితో గడిపిన కాలం మరచిపోలేనిది.

ఇక రూపగోస్వామితో మైత్రి చాలా గాఢమైనది. కాళీతంత్రంలో నుండి ఇతడుదాహరించిన ఒక సూత్రం అతనికి బాగా నచ్చింది. ఉచ్ఛ్వాస నిశ్వాసముల గమనాగమనములను కండ్లుమూసుకొని ఏకాగ్రతగా చూడటమే కాలమును జయించే కాళీసాధన అని ఆ వాక్యం. గోస్వామి కృష్ణభక్తికి సంబంధించిన ఒక గ్రంధం రచిస్తూ రాత్రులు కొంతకాలం ఈ సాధన చేశాడు. ఆ సాధన ఫలితంగా ఒక కాళీసిద్ధుడతనికి సాక్షాత్కరించాడు. గోస్వామి యందు ఆదరం చూపించి కాళీ కృష్ణులు ఒక్కటే అని చెప్పి దివ్యానుభూతులను, కొన్ని శక్తులను ప్రసాదించాడు. ఆకాశ సంచార శక్తిగల ఆ సిద్ధుడే తర్వాత రామకృష్ణపరమహంసగా జన్మించాడు. ఆ కాళీ సిద్ధుడు ఇతని విగ్రహంలోని కాళీదేవిని పూజించడమే గాక జన్మ మారిన తర్వాత రామకృష్ణునిగా కూడా ఇతని చివరి రోజులలో వచ్చి దర్శించి అమ్మను అర్చించి వెళ్ళాడు.

( సశేషం )

🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment