🌹 సిద్దేశ్వరయానం - 76 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 రత్న ప్రభ - 3 🏵
రత్నప్రభ వాళ్ళమ్మతో కలిసి స్వామి వారివెంట తీర్ధయాత్రలకు వెళ్ళింది. ఆయా క్షేత్రాలలో తాము ఎన్నివందల సంవత్సరాల క్రింద ఉన్నది. పూర్వజన్మ విశేషాలు ఆ దేవతా మహిమవల్ల జరిగిన అద్భుతాలు స్వామివారు తెలియజేసేవారు. వారు మాటాడుతున్నప్పుడల్లా ఆ సమయాలలో తానుకూడా వారితో ఉన్నట్లు అనిపించేది. ఈ విధంగా దీర్ఘప్రయాణాలు చేసి చివరకు కామాఖ్య చేరుకొన్నారు. కామాఖ్య కాళి గురించి కాళీపురాణంలోని విశేషాలు స్వామివారు చెపుతుంటే దిగ్భ్రాంతి కలిగింది.
ఆ ఊరిలో ఉండగా సంవత్సరాని కొకసారి జరిగే మహోత్సవములు వచ్చినవి. నాగ భూమి నుండి దిగంబర సాధువులెందరో ఆ కార్యక్రమాలలో పాల్గొనటానికి వచ్చారు. ఒకపూట అద్భుతమైన ఖడ్గ చాలన ప్రదర్శన జరిగింది. నిప్పులలో దూకేవారు, నారసాలు గుచ్చుకొనేవారు, కొరడాలతో కొట్టుకొనేవారు చిత్ర విచిత్ర తీవ్ర సాధకులక్కడ కనిపించారు. దీర్ఘకాలం ఉపవాసాలుండి, ఎండలో పంచాగ్ని మధ్యంలో నిల్చుని, శీతకాలంలో గొంతు లోతు చన్నీళ్ళలో నిల్చొని కఠోర నియమాలతో ప్రాచీనులు తపస్సుచేస్తే – ఈ మార్గంలో శరీరాన్ని హింసిస్తూ సూదులతో పొడుచుకొంటూ కత్తులతో గుచ్చుకొంటూ, కర్రతో, కొరడాతో బాదుకొంటూ తామస మంత్రాలు చేస్తుంటే ఆ మంత్ర దేవతలు తొందరగా అనుగ్రహిస్తారని స్వామివారు తమ ప్రసంగాలలో తెలియజేశారు.
అక్కడి ఉత్సవాలలో ప్రధానమైనరోజు స్వామివారు ఒక ఎర్రని గుడ్డలో చిన్న యంత్రం పెట్టియిచ్చి దానిని రాత్రి తలక్రింద పెట్టుకొని నిద్రించమని చెప్పారు. కామాఖ్యలో పరమేశ్వరి యోనిపూజించబడుతుంది. ఆ శిలాఖండం నుండి - ఆ దేవి రజస్వలయైన దానికి గుర్తుగా రక్తం స్రవిస్తూ ఉంటుంది. ఆ వస్త్ర ఖండాలను మహాప్రసాదంగా తీసుకొని పూజలో పెట్టుకొంటారు. ఆ వస్త్ర ఖండంలో కాళీయంత్రం ఉంచి యిచ్చారు స్వామివారు.
రాత్రి ఉపవాసం ఉండి భూశయనం చేసి కాళీదేవిని స్మరిస్తూ కండ్లు మూసుకొని పడుకొన్నది రత్నప్రభ. అప్పటికి మొదటిజాముదాటి రెండవజాము ప్రవేశించింది. నిద్రలో ఉన్నదో లేక మెలకువగా ఉన్నదో తెలియని స్థితిలో ఉన్నట్లుండి శరీరంలో నుండి బయటకు వచ్చినట్లు అనిపించింది. చూస్తే తాను ఆకాశంలో ఉంది. శరీరం క్రింద కనిపిస్తున్నది. గగనయానం చేస్తూ నీలిమబ్బుల మధ్య ఒక గుహలో ప్రవేశించింది. సుదీర్ఘమైన ఈ అంధకార కందరంలో వెళ్ళి వెళ్ళి చివరకు బయటకు వస్తే ఒక కాంతి పుంజం. ఆ తేజోమధ్యంలో కాళి - కాలభైరవుడు కనిపిస్తున్నారు. చిత్రం! ఇద్దరూ చాలా సుందరంగా ప్రేమమూర్తులుగా భాసిస్తున్నారు.
కాళీదేవి భైరవునితో ఇలా అంది "భైరవస్వామీ! ఈ బాలిక బృందావనంలో రాధాదేవి చెలికత్తెయైన ఇందులేఖ యొక్క అంశ. మనోరమ అనే పేరుతో ఉండి నా భక్తుడైన ఒక సిద్ధునితో అనుబంధం కలిగి భువనేశ్వరారణ్యంలోని నామందిరంలో కొంతకాలం మంత్రసాధన చేసింది. ఆ మంత్రమునే మళ్ళీ మీరిప్పుడు నా భక్తురాలికి ప్రసాదించండి. నాలో రాధాదేవి అంశయైన శ్యామకాళి మీలో కృష్ణుని అంశయైన కృష్ణభైరవుడు పూర్ణత్వ ప్రాభవం పొందటం జరిగింది. కనుక రాధాకృష్ణ భక్తురాలైన ఈ జీవి మీ అనుగ్రహానికి అర్హురాలు." కాళీ ప్రియుడైన కృష్ణ భైరవుడు రత్నప్రభకు కాళీమంత్రాన్ని ఉపదేశించాడు.
రత్నప్రభ అత్యంత వినమ్రమూర్తియై ఇద్దరికి పాదనమస్కారం చేసి ఆ మంత్రాన్ని జపించటం మొదలుపెట్టింది. ప్రారంభించిన కాసేపటికి ఆజ్ఞాచక్రంలో కదలిక వచ్చింది. మూసిన తలుపులు తెరుచుకొన్నట్లు అక్కడ సంచలనం కలిగి దివ్యదృష్టి లభించింది. వరుసగా తన జన్మపరంపర గోచరిస్తున్నది. బృందావనంలో రాధాదేవి పరివారంలో శ్యామ అనేపేరుతో ఉండి - జనమేజయుని సర్పయాగంలో హోమకుండంలో పడి దహనం కాకుండా రాధాదేవి కరుణవల్ల రక్షించబడిన సిద్ధనాగుడనే నాగజాతి తపస్వికి ఆ ధామంలో సేవచేసింది. రాధా శరీరంలోని రాసేశ్వరి బయటకువెళ్ళి కృష్ణునితో కలిసి దివ్యభూమికలోకి ప్రవేశించిన తర్వాత మిగిలిన ఉశీనర రాజకుమారి రాధ - సిద్ధాశ్రమానికి తపస్సు చేసుకోటానికి వెళ్ళిపోయింది.
అనంతరం శ్యామ సిద్ధనాగునితో ఉంది. రాధాదేవి సంకల్పంవల్ల ప్రపంచంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే ప్రణాళికలో భాగంగా తాను ఎన్నో జన్మలు తీసుకోవలసి వచ్చింది. సిద్ధనాగుడు కూడా పరమేశ్వరి ఇచ్ఛవల్ల జన్మపరంపర పొందటం జరిగింది. అతడు భైరవనాధుడనే సిద్ధునిగా, భానుదేవుడనే రాజయోగిగా ఉన్నప్పుడు ఆయనకు సేవచేసింది. ప్రవరసేనుడనే మహారాజుగా బృందావన ప్రాంతాన్ని పరిపాలించినపుడు ఆ నరపాలుని భార్య నాగావళిగా రాధాదేవిని కొలిచింది. ఆ సిద్ధేశ్వరుడు డెహ్రాడూన్ ప్రాంతంలో జన్మించినపుడు అనూరాధా అనే కాళీసఖిగా ఉండి భౌతికరూపం తీసుకొని ఆయనతో కాపురంచేసి సంతానంకని మళ్ళీ అమ్మ పరివారంలోకి వెళ్ళింది. తరువాత కొంతకాలం హిమాలయాలలో సిద్ధాశ్రమంలో లలితాదేవి ఆలయంలో కింకరిగా హిరణ్య అనేపేరుతో ఉంది. అక్కడ తాంత్రిక సాధనలుచేసి డాకినీ సిద్ధిని పొందింది. హిమాలయాలలో డాకిని అంటే దేవయోని జాతికి చెందిన దివ్యశక్తులు గల అప్సరస వంటిది.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment