గీతోపనిషత్తు -171


🌹. గీతోపనిషత్తు -171 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 14


🍀 14. పూర్ణ జిజ్ఞాస - జీవుల యందలి దైవముతో అనుసంధానము చెందుట యోగము. జీవుడహంకార ప్రజ్ఞ. అతడు త్రిగుణాత్మకుడు. నే నున్నానను ప్రత్యేక భావము కలవాడు. జీవులయందున్న దేవుడు త్రిగుణాతీతుడు. అంతర్యామి. అన్నిటియందు గుణముల కావల ఉండువాడు. కావున సర్వాంతర్యామి. అతడాధారముగ గుణము లేర్పడి, అందుండి ప్రత్యగాత్మగ జీవుడేర్పడు చున్నాడు. నిజమునకు జీవుడు స్థితి మార్పు చెందిన దైవమే. జీవుని పేరు నేను. దైవము పేరు కూడ నేనే. నేనను జీవుడు, నేను అను దైవముతో అనుసంధానము చెందుటకు చేయు ప్రయత్నమే యోగాభ్యాసము. నేనను ప్రత్యేక ప్రజ్ఞ, నేనను అంతర్యామి ప్రజ్ఞతో జతపడవలెను. 🍀

ప్రశాంతాత్మా విగతజీ ర్ర్బహ్మచారిత్రతే స్థితః |
మన స్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః || 14

ప్రశాంతమైన మనస్సు కలవాడై, భయము వీడినవాడై బ్రహ్మ యందు చరించుట స్థిరమగు వ్రతము కలవాడై, సంయమము చెందిన ఇంద్రియములతో కూడిన మనస్సు కలవాడై, 'నా' యందు ఆసక్తి, ప్రేమ కల చిత్తము కలవాడై, మత్పరుడై 'నా'తో ముడిపడిన వాడై ఉండవలెను.

శ్రీకృష్ణుడు అందించిన ఈ ఉపదేశము ధ్యానమున మణి పూస వంటిది. ఇచ్చట 'నేను' అని కృష్ణుడు వాడిన పదము సాధకుని యందు అంతర్యామిగనున్న నేను. అనగ జీవుని యందలి దైవము.

జీవుల యందలి దైవముతో అనుసంధానము చెందుట యోగము. జీవుడహంకార ప్రజ్ఞ. అతడు త్రిగుణాత్మకుడు. నే నున్నానను ప్రత్యేక భావము కలవాడు. జీవులయందున్న దేవుడు త్రిగుణాతీతుడు. అంతర్యామి. అన్నిటియందు గుణముల కావల ఉండువాడు. కావున సర్వాంతర్యామి. అతడాధారముగ గుణము లేర్పడి, అందుండి ప్రత్యగాత్మగ జీవుడేర్పడు చున్నాడు. నిజమునకు జీవుడు స్థితి మార్పు చెందిన దైవమే.

జీవుని పేరు నేను. దైవము పేరు కూడ నేనే. నేనను జీవుడు, నేను అను దైవముతో అనుసంధానము చెందుటకు చేయు ప్రయత్నమే యోగాభ్యాసము. నేనను ప్రత్యేక ప్రజ్ఞ, నేనను అంతర్యామి ప్రజ్ఞతో జతపడవలెను. ఇది అంటు కట్టుట వంటిది. అట్లు భావనతో కట్టివుంచుటచే, క్రమముగ రెండుగ నున్నవి ఒకటిగ నేర్పడగలవు. “యుక్త ఆసి" అని శ్లోకము చెప్పుచున్నది. అనగ కలిపి యుంచవలెనని అర్థము. ఇట్లు చాల కాలము కలిపియుంచుటకు ప్రయత్నము సాగవలెను.

ఈ ప్రయత్నమున శ్రద్ధ, భక్తి దైనందినముగ నున్నచో క్రమముగ ప్రశాంతత చిక్కును. భయము తొలగును. అంతర్యామి యందే చరించు దినచర్య ఆరంభమగును. ఇంద్రియములు మనస్సు అనుకూలము లగును. ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతి యందు దైవమే కర్తయై నిలచును.

మరియొక పద్ధతి ప్రశాంతమగు మనస్సు నేర్పరచుకొనుట, భయమును తొలగించు కొనుట, మనస్సు ఇంద్రియములను మచ్చిక చేసుకొనుట, బ్రహ్మము నందు చరించుట తానుగ స్వప్రయత్నమున నిర్వర్తించుకొనుచు, తన యందలి అంతర్యామితో యోగించుట.

ఇందు మొదటి పద్ధతి భక్తునకు సహజము. అతడు దైవమే ఉపాయమని, అంతట, అన్నిట దైవమునే చూచుచు, దైవ యుక్తుడగు చుండును. జ్ఞాని పురుష ప్రయత్నమున తనను తాను సమకూర్చుకొని దేవునితో యోజించుటకు ప్రయత్నించును. ఇరువురికిని ఫలప్రదాత దైవమే. ప్రతినిత్యము పై తెలిపిన మూడు శ్లోకముల ననుసరించుచు, నిర్ణీత సమయమున ధ్యానము నాచరించుట ప్రధానమని తెలియవలెను.

కేవలము దైవమునందే ఆసక్తి, ప్రేమ కల వారు ఆత్మ సంయమమును సులభముగ బడయుదురు. వారి దినచర్య యంతయు కూడ దైవదర్శనమునే అంతట, అన్నిట చేయుచు నిర్వర్తించుకొను చుందురు. అట్టి వారికి ఆత్మ సంయమము శీఘ్రగతిని సిద్ధించును.

ఇతరములు గోచరించు వారికి సిద్ధించుట కష్టము. చిత్త మెంతవరకు దైవము నాశించునో అంతవరకు యోగము జరుగుచుండును. చిత్త మితర విషయములపై ఆసక్తిని చూపినపుడు యోగ మాగును. కావున పూర్ణ జిజ్ఞాసువులకే ఆత్మ సంయమము సాధ్యమగునని తెలియవలెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


16 Mar 2021

No comments:

Post a Comment