శ్రీ శివ మహా పురాణము - 371
🌹 . శ్రీ శివ మహా పురాణము - 371 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 10
🌻. కుజ గ్రహోత్పత్తి - 1 🌻
నారదుడిట్లు పలికెను -
ఓ విష్ణు శిష్యా! మహాత్మా! విధీ! ప్రభూ! నీవు శివ భక్తులలో శ్రేష్ఠుడవు. ఈ శివలీలను నాకు సంగ్రహముగా ప్రీతితో నీవు చెప్పదగుదువు(1). సతీ విరహముతో కూడి యున్న శివుడు ఏమి చేసెను? శివుడు తపస్సును చేయుటకై హిమవత్పర్వతాగ్ర భాగమునకు ఎప్పుడు వచ్చెను? ఆ చరితమును చెప్పుము (2). శివశివులకు మధ్య జరిగిన సంభాషణ ఎట్టిది? మన్మథుడు నశించిన తీరు ఏది? పార్వతి తపస్సును చేసి మంగళ స్వరూపుడగు శివుని పొందిన విధమెట్టిది? (3) ఓ బ్రహ్మా! ఈ వృత్తాంతమునంపతనూ చెప్పి, ఇతరమగు శివచరితమును కూడ నీవు చెప్పదగుదువు. ఈ శుభ చరితము నాకు మహానందమును కలిగించుచున్నది. (4).
సూతుడిట్లు పలికెను-
నారదుని ఈప్రశ్నను విని, లోకపాలురందరిలో శ్రేష్ఠుడగు బ్రహ్మశివుని పాదపద్మమునలు స్మరించి మిక్కిలి ప్రీతితో ఇట్లనెను (5)
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ దేవర్షీ! నీవు శివభక్తులలో శ్రేష్ఠుడవు. పవిత్రము చేయునది, మంగళములనిచ్చునది, భక్తిని పెంచునది అగు శివుని ఉత్తమకీర్తిని ఇపుడు శ్రధ్ధగా వినుము (6). ప్రియురాలి వియోగముచే దుఃఖితుడై యున్న శంభుడు తన నివాసమగు కైలాసమునకు తిరిగి వచ్చి, ప్రాణముల కంటె అధికముగా తనకు ప్రియురాలైన సతీదేవిని మనస్సులోస్మరించెను(7). ఆయన లోకపు పోకడను అనుకరించువాడై గణములను పిలిచి వారి యెదట ప్రేమను పెంపొందిచు ఆమె గుణములను మిక్కిలి ప్రీతితో వర్ణించెను(8). లీలా పండితుడగు ఆ శివుడు సద్గతినిచ్చు గృహస్థాశ్రమమును విడిచి పెట్టి దిగంబరుడై లోకములనన్నిటినీ తిరుగాడెను(9).
భక్తులకు మంగళమునిచ్చు ఆ శంకరుడు సతీ వియోగముచే దుఃఖితుడై అమెను ఎక్కడను గాన జాలక కైలాస పర్వతమునకు తిరిగి వచ్చెను(10). అయన ప్రయత్నపూర్వకముగా మనస్సును నిగ్రహించి దుఃఖానాశకమగు సమాధిని పొంది నాశరహితమగు ఆత్మ స్వరూపమును దర్శించు చుండెను(11).మూడు గుణములకు అతీతమైన వాడు, వికారములు లేనివాడు, పరబ్రహ్మ స్వరూపుడు, మాయను వశము చేసుకున్నవాడు అగు ఆశివప్రభుడు ఈ తీరున చిరకాలము సమాధియందుడెను (12). ఆయన అనేక సంవత్సరములు ఇట్లు గడిపి తరువాత సమాధి నుండి బయటకు వచ్చెను. అపుడు జరిగిన వృత్తాంతమును మీకు చెప్పెదను (13).
ఆ ప్రభుని లలాట భాగమునుండి శ్రమ వలన చెమట పుట్టి నేలపై బడగా, అది వెంటనే ఒక శిశువాయెను(14). ఓమహార్షీ! ఆ శిశువు నాల్గు భుజములతో, అరుణ వర్ణముతో, సుందరమగు ఆకారముతో, దివ్యకాంతులీనుచూ, శోభాయుక్తమై, ఇతరులు చూడ శక్యము కాని తేజస్సుతో వెలుగొందెను(15).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
16 Mar 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment