భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 251


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 251 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కాశ్యప మహర్షి - 2 🌻


9. ఈ విషయం చాలా చమత్కారంగా ఉంది. మనసును శంకించటం ఎలాగ అంటారు. ఉదాహరణకు ఒక బ్రహ్మరాక్షసుడున్నాడు. వాడు ఒకడిని పట్టుకున్నడనుకోండి. అలా పట్టుకుని అతడి వశంలో ఉండి, ఘడియ ఘడియకూ తనకు ఏదయినా పని చెప్పమని, “నీవు నాకు చేతినిండా పనిచెప్పు, అట్లాగైతే నేను నిన్ను సేవిస్తూ ఉంటాను.

10. నాకు ఎప్పుడయితే పని చెప్పలేకపోతావో అప్పుడు నేను నిన్ను తినేస్తాను.” అని, పని అడగడం మొదలు పెట్టాడు. వీడు ఏం చేస్తాడు! కాశీనుంచి గనగను తెమ్మన్నాడు. అరక్షణంలో పట్టుకొచ్చాడు వాడు. తనవద్ద పదార్తాలులేవు, అగ్నిహోత్రంలేదు, ఉన్నాట్టుండి బ్రహ్మాండమైన భోజనం కల్పించమని అడిగాడు. అంతే, భోజనం వచ్చేసింది! ఏ పని చెప్పినా, వాడు క్షణంలో చేసేస్తున్నాడు!

11. ఈ బ్రహ్మరాక్షసుడికి పని చెప్పకపోతే తనను తినేస్తాడు. ఏమీ తోచలేదు. ఇక వాడికి పనిచెప్పలేక పారిపోతున్నాడు. అలా పోతుంటే ఒక పెద్ద అరణ్యం కనబడింది. “ఇక్కడి చెట్లన్నీ శుభ్రంగా నరికేసెయ్యి, నేలఅంతా చదును చేసెయ్యి అంటే, అర ఘడియలో అలాచేసి వచ్చేసాడు! అక్కడ ఒక పట్టణనిర్మాణం చెయ్యమంటే, అదీ చేసాడు. ఒక పెద్ద చెరువును, నదిని నిర్మించమంటే, క్షణంలో అది అయిపోయింది. మళ్ళీ పనిచెప్పమన్నాడు వాడు! ఇక చేసేది లేక మళ్ళో పారిపోవటం మొదలెట్టాడు.

12. చివరిగా ఆగి అక్కడ పెద్ద తాడిచెట్టు ఉన్నది, నువ్వు ఆ చెట్టును కింది నుంచి పైకి, పైనుంచి కిందికి, మళ్ళీ పైకి, కిందికి ఎక్కిదిగుతూ ఉండు, నేను చెప్పేవరకూ అలాగే చేస్తూఉండు. ఇంకే పనీ చెయ్యకు అన్నాడు. కొంతసేపు అలా చేసిన తరువాత, “బాబోయ్! నన్ను రక్షించు. ఈ తాటిచెట్టు నుంచి నన్ను వదిలిపెట్టు. ఇక నువ్వు స్మరిస్తేనే వస్తాను. నిన్ను చంపను, నీ జోలికిరాను అని వెళ్ళిపోయాడు.

13. అపరిమితమైన శక్తి గల వారికి ఏ పని చెప్పినా, అంతులేని పని చెప్పాలి. అలాగే మనసు కూడా! మనసుకు కూడా ఏ పని చెప్పినా, అది చేసి వెనక్కు వచ్చేస్తుంది. ఆ బ్రహ్మరాక్షసుడి లాంటిదే మనసుకూడా. దానికి సాధ్యం కానిది ఒకటి అప్పగిస్తే, అంతలోనే అది నశిస్తుంది.

14. మనసు నశించాలి కదా! “ఆత్మ ఎక్కడ ఉందో చూచిపెట్టు” అని మనస్సును అడగాలి. అంటే అన్ని రకాల పనులూ చేస్తుంది ఈ మనస్సు. దానికి సాధ్యం కానిది లేదు. “ఆత్మ వస్తువు ఎక్కడ ఉందో వెతికిపెట్టు” అని అన్నరనుకోండి! ఏంచేస్తుంది మనస్సు? దానికి అది దొరకక, విసిగివేసారి ఎక్కడో నశిస్తుంది అది.

15. అంటే, మనస్సు, “హృదయంలోని జ్యోతిని చూడు” అంటే, చూచి ఇవతలికి వస్తుంది ఆ బ్రహ్మరాక్షసుడివలె. అలాగే, “ఒకమాటు శ్రీహరిని ధ్యానం చెయ్యి” అంటే. చేసి, “ధ్యానం అయిపోయింది” అంటుంది. “కాసేపు రుద్రుణ్ణి ధ్యానం చెయ్యి” అంటే, చేసి వచ్చేస్తుంది. చెప్పినపనినల్లా చేసి వచ్చేస్తుంది.

16. అందుకని, దానికి అంతులేని పనిచెప్పాలి. ఇంక దాని అంతు ఆ కార్యమే కనుక్కుంటుంది. అది ఒక్కక్షణమే. అందువల్ల. మనస్సు ఎక్కడ నిల్సుతుందో, అక్కడ దానిని నిలుపమన్నాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


16 Mar 2021

No comments:

Post a Comment