గీతోపనిషత్తు -182
🌹. గీతోపనిషత్తు -182 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 23
🍀 23. ధ్యాన సిద్ధి - మనస్సును పరిశుద్ధము గావించుకొన్న కొలది, అందలి చిత్తము (అనగ చైతన్యము) బుద్ధిలోనికి ప్రవేశించును. బుద్ధి అను వెలుగు చలింపదు. బుద్ధి అనునది స్థిరమగు వెలుగు. మనస్సు ఇంద్రియముల నుండి బాహ్యములోనికి దిగజారు చుండును. అట్టి మనస్సును కూడదీసి బుద్ధిలోనికి ప్రవేశింప జేయుట ప్రధాన కర్తవ్యము. ధ్యాన మార్గమున తత్త్వముతో యోగము చెంది, యోగ స్థితియందు నిలబడుట వలన సంయోగ వియోగ దుఃఖములు కలుగవని తెలుసుకొనుము. ఆ స్థితిని పొందుటయే కర్తవ్యమని తెలియుము. మనస్సును బుద్ధిపై చాల కాలము లగ్నము చేయుట వలన బుద్ధియను వెలుగు నందు స్థిరపడి ఆ వెలుగునకు మూలమైన దానిపై బుద్ధిని లగ్నము చేయుట ధ్యాన మనబడును. హృదయలోకమే నిజమగు బుద్ధిలోకము. హృదయమే నిజమగు తపస్సునకు గుహ. అచ్చట హంస శబ్దము ఎప్పుడును ప్రాణస్పందనముగ సాగుచు నుండును. ఆ శబ్దము ననుసరించుచు వెలుగు మూలములోనికి, చేరి అచ్చట స్థిరపడుట ధ్యానమునకు సిద్ధి. 🍀
తం విద్యా దుఃఖసంయోగ వియోగం యోగసంజితమ్ |
స నిశ్చయేన యోక్తావ్యో యోగో నిర్విష్ చేతసా || 23
పై తెలిపిన విధముగ ధ్యాన మార్గమున తత్త్వముతో యోగము చెంది, యోగ స్థితియందు నిలబడుట వలన సంయోగ వియోగ దుఃఖములు కలుగవని తెలుసుకొనుము. ఆ స్థితిని పొందుటయే కర్తవ్యమని తెలియుము. బుద్ధిని శుద్ధము గావించి, అట్టి బుద్ధిని అది పుట్టిన చోటు యందు లగ్నము చేయుట వలన, అట్లు లగ్నము చేసి అందు స్థిర పడుట వలన యోగ సాధనము పరిపూర్ణమగును. సంయోగ వియోగములు, కలత చెందుట, చలించుట యిట్టి స్థితులన్నియు మనోమయ కోశమున నుండును. అందువలన మనస్సుచే ఆత్మతత్త్వమును పొందగోరుట ఆకాశమునకు నిచ్చెన వేయుట వంటిది.
మనస్సును పరిశుద్ధము గావించుకొన్న కొలది, అందలి చిత్తము (అనగ చైతన్యము) బుద్ధిలోనికి ప్రవేశించును. బుద్ధి అను వెలుగు చలింపదు. బుద్ధి అనునది స్థిరమగు వెలుగు. నూనె దీపము మనస్సు వంటిది. అది గాలికి రెపరెప లాడును. విద్యుద్దీపము బుద్ధి వంటిది. దానిపై వాయు ప్రభావముగాని, నీటి ప్రభావముగాని యుండదు. మనస్సు ఇంద్రియముల నుండి బాహ్యములోనికి దిగజారు చుండును.
అట్టి మనస్సును కూడదీసి బుద్ధిలోనికి ప్రవేశింప జేయుట ప్రధాన కర్తవ్యము. అందులకే యుక్తమగు ఆహార వ్యవహారములు, యుక్తమగు చేష్టలు ముందు సూచింపబడినవి. మితభోజనము, మిత నిద్ర కూడ సూచింపబడినది. పై నియమముల వలన మనస్సునకు కొంత స్థిరత్వ మేర్పడును.
అంతఃర్బహి శుచి, సద్భావములు, లోకహితము, తటస్థమగు మనస్సు కూడ మనస్సునకు సాధుత్వము కలిగించును. లేనిచో ఇంద్రియముల లోనికి దిగజారుచున్న మనస్సు కలిగించు మోహమంతయు సత్య మనిపించును. శీతోష్ణ సుఖదుఃఖములు, మానావమానములు, ఆకలిదప్పులు, దేహ బాధలు మనస్సును పీడించు చుండగ అట్టి మనస్సుతో యోగ సాధనము జరుపుట హాస్యాస్పదము.
పై తెలిపిన సూత్రములను దీర్ఘకాలము దినచర్య యందు స్థిరపడినచో అపుడు మనస్సునకు స్థిరమేర్పడును. అట్టి మనస్సును బుద్ధిపై చాల కాలము లగ్నము చేయుట వలన తాను వెలుగు నందు స్థిరపడును. అట్టివాడు బుద్ధిమంతుడగును. బుద్ధి ప్రధానముగ జీవించును. బుద్ధియను వెలుగునందు స్థిరపడి ఆ వెలుగునకు మూలమైన దానిని ధ్యానము చేయుట, దానిపై బుద్ధిని లగ్నము చేయుట ధ్యాన మనబడును.
హృదయలోకమే నిజమగు బుద్ధిలోకము. హృదయమే నిజమగు తపస్సునకు గుహ. హృదయపు గుహ దేహ భాగమున సింహరాశితో సమన్వయింపబడినది. ఇందు ప్రవేశించినవాడు హింసను మాని హంస యగును. అచ్చట హంస శబ్దము ఎప్పుడును ప్రాణస్పందనముగ సాగుచు నుండును. ఆ శబ్దము ననుసరించుచు వెలుగు మూలములోనికి, నాద మూలములోనికి క్రమముగ ప్రవేశంచును. మూలమును చేరి అచ్చట స్థిరపడుట ధ్యానమునకు సిద్ధి. అట్టి వానికే ఆత్మ సంయమము సత్యము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
08 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment