రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 14
🌻. వజ్రాంగుడు - 2 🌻
ఇంద్రుడు మొదలుగా గల ఆ దేవతల దుస్థ్సితిని గాంచి దితి ఆనందించెను. ఇంద్రుడు, ఇతర దేవతలు తమ కర్మలకు అను రూపమైన దుఃఖమును పొందిరి (20). నిత్యము దేవతల హితమును చేయ గోరు నేను అపుడు శీఘ్రమే చక్కని సామగానమును చేయుచూ అచటకు వచ్చి వజ్రాంగుని చెరనుండి దేవతలను విడిపించితిని(21). శివభక్తుడు, మిక్కిలి పవిత్రమగు అంతఃకరణ గలవాడు, రాగద్వేషములు లేకుండా ప్రసన్నముగా నుండు బుద్ధి గలవాడునగు ఆ వజ్రాంగుడు అపుడా దేవతలను విడిచి పెట్టి ఆదరముతో నిట్లు పలికెను(22)
వజ్రాంగుడిట్లు పలికెను-
ఇంద్రుడు స్వార్థపరుడగు దుష్టుడు. నా తల్లిగారి సంతానమును హింసించినాడు. దానికీ నాడు ఫలమునను భవించినాడు. అతని రాజ్యమును అతడు ఏలు కొనవచ్చును(23). హే బ్రహ్మా! దీనినంతనూ నేను తల్లిగారి ఆజ్ఞచే చేసితిని. నాకు ఏ భువనములనైనా పాలించి భోగించవలెననే ఆశ లేనే లేదు(24). హే విధీ! నీవు వేదవేత్తలలో అగ్రగణ్యుడవు. ఏ ఆత్మతత్త్వ సారము నెరింగి నేను నిత్యానందమును, వికారము లేని ప్రసన్నమగు అంతః కరణమును పొందగలనో, అట్టి తత్త్వసారమును నాకు భోధించుము (25).
ఓ మహర్షీ! నేనా మాటను విని ఇట్లు పలికితిని . జ్ఞానవైరాగ్యాది సాత్త్విక భవనలే తత్త్వసారమని చెప్పబడును. నేను ప్రీతితో ఒక శ్రేష్ఠకన్యను సృష్టించితిని(26). వరాంగియను ఆ కన్యను ఆ దితిపుత్రునకిచ్చి వివాహము చేసి నేను నా ధామమును చేరితిని. నేను మాత్రమే గాక అతని తండ్రియగు కశ్యపుడు కూడ మిక్కిలి సంతసించెను.(27). అపుడా దితిపుత్రుడగు వజ్రాంగుడు రాక్షస భావనలను విడనాడి, సాత్త్విక భావము నాశ్రయించి, విరోధము లేని వాడై సుఖించెను. (28). కాని వరాంగికి హృదయములో సాత్త్విక భావమునెలకొనలేదు. ఆమె కామనతో కూడినదై తన భర్తను శ్రద్ధతో వివిధ పద్ధతులలో సేవించెను.(29).
ఆమె భర్తయగు ఆ వజ్రాంగ మహాప్రభుడు అపుడామె సేవచే సంతసించి వెంటనే ఇట్లు పలికెను(30).
వజ్రాంగుడిట్లు పలికెను-
ఓ ప్రియురాలా! నీ కోరిక యేమి? నీమనస్సులో నేమున్నది? చెప్పుము. ఆమె ఆ మాటను విని భర్తకు నమస్కరించి తన కోరిక అతనితో నిట్లు చెప్పెను(31).
వరాంగి ఇట్లు పలికెను-
ఓ మంచి మొగుడా! నీవు నా పై ప్రసన్నుడవైనచో , మహాబలశాలి, ముల్లోకములను. జయించువాడు, ఇంద్రునకు దుఃఖము నీయగలవాడు అగు కుమారుని నాకు ఇమ్ము(32)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
08 Apr 2021
No comments:
Post a Comment