✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 29
🍀 29. అనన్య స్థితి - ఆత్మతో యుక్తము చెందిన యోగి సర్వము నందును ఆత్మనే దర్శించును. సర్వభూతములను తన యందు దర్శించును. ఆత్మసంయమ యోగమున ఇది ఒక విభూతి. తా నాత్మనని ధ్యానించి దర్శించిన వాడు ప్రపంచము నందన్ని వస్తువుల యందును ఆత్మనే దర్శించును. తా నాత్మతో యోగము చెందియున్నాడు గనుక అన్ని జీవులు కూడ ఆత్మ స్వరూపమే అని తెలియును. ఆత్మ దర్శనునికి సమస్తము నందు తానే గోచరించి అనన్య స్థితి కలుగును. తన నిజస్థితి పూర్ణమగు అద్వైత స్థితి. అనన్య స్థితి. 🍀
సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని |
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః || 29
ఆత్మతో యుక్తము చెందిన యోగి సర్వము నందును ఆత్మనే దర్శించును. సర్వభూతములను తన యందు దర్శించును. ఆత్మసంయమ యోగమున ఇది ఒక విభూతి. తా నాత్మనని ధ్యానించి దర్శించిన వాడు ప్రపంచము నందన్ని వస్తువుల యందును ఆత్మనే దర్శించును. తా నాత్మతో యోగము చెందియున్నాడు గనుక అన్ని జీవులు కూడ ఆత్మ స్వరూపమే అని తెలియును.
చూచువాని యందెల్ల ఆత్మ కనబడుటచే తననే వారియందు దర్శించు చుండును. అట్టి వానికి పరిసరములన్నియు అద్దపు గదివలె గోచరించును. అద్దపు గదిలో ప్రవేశించినవానికి ఎటు చూచినను తానే కనపడును గదా! అట్లే ఆత్మ దర్శనునికి సమస్తము నందు తానే గోచరించి అనన్య స్థితి కలుగును. అంతే గాక సర్వ భూతములు తన యందే ఉన్నట్లు కూడ గోచరించును.
తా నన్నిటి యందు ఉన్నట్లే, తనయందే అన్నియు ఉన్నవని తెలియును. ఇది అత్యుత్తమమగు విభూతి. గీతాచార్యుడగు కృష్ణుని స్థితి ఇదియే. ఇట్టి స్థితియే అర్జునునకు కూడ కలుగవలెనని ఆప్యాయముగ బోధించు చున్నాడు. పురాణ పురుషుడగు శ్రీ కృష్ణుడు మాత్రమే ఇట్టి బోధనను చేయగలవాడు. కనుకనే తరువాతి శ్లోకమున తన నిజస్థితిని వివరించు చున్నాడు. ఈ శ్లోకమందలి అనుభూతి పూర్ణమగు అద్వైత స్థితి. అనన్య స్థితి అని కూడ తెలియనగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
20 Apr 2021
No comments:
Post a Comment