గీతోపనిషత్తు -205


🌹. గీతోపనిషత్తు -205 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 46, 47, Part 1

🍀 45-1. యోగీభవ - తపస్సు చేయువారి కంటెను, జ్ఞానుల కంటెను, ఉత్తమోత్తమ కర్మలు చేయువారి కంటెను యోగి అధికుడు. కావున ఓ అర్జునా! నీవు యోగివి కమ్ము. తపస్సులు చేయువారు, జ్ఞానులు, శ్రేష్ఠమగు కర్మల నాచరించు వారు లోకమునందు అధికులుగ భావింపబడుదురు. కాని వారి యందు సమభావము, సమదర్శనము, సమతుల్యము నుండుట అరుదుగ నుండును. తపఃశక్తి వలన అపుడపుడు సహనము కోల్పోవుట జరుగు చుండును. సమదర్శనము లేనిచో సహన ముండదు. సహనము కోల్పోయినపుడు సంయమ ముండదు. సమభావము కలుగదు. 🍀

తపస్విభ్యో 2 ధికో యోగీ జ్ఞానిభ్యో పిమతో 2 ధికః |
కర్మిభ్య శ్చాధికో యోగీ తస్మా ద్యోగీ భవార్జున || 46

యోగినా మపి సర్వేషాం మద్దతే నాంతరాత్మనా |
శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్తతమో మతః|| 47


తపస్సు చేయువారి కంటెను, జ్ఞానుల కంటెను, ఉత్తమోత్తమ కర్మలు చేయువారి కంటెను యోగి అధికుడు. కావున ఓ అర్జునా! నీవు యోగివి కమ్ము, శ్రీ కృష్ణుడు యోగి యొక్క ఉత్తమ స్థితిని తెలుపుచున్నాడు.

తపస్సులు చేయువారు, జ్ఞానులు, శ్రేష్ఠమగు కర్మల నాచరించు వారు లోకమునందు అధికులుగ భావింపబడుదురు. కాని వారి యందు సమభావము, సమదర్శనము, సమతుల్యము నుండుట అరుదుగ నుండును. తీవ్ర తపస్సులు చేసి దైవానుగ్రహము పొందినవారు కూడ సమదర్శనులు కాక ప్రవర్తించు సన్నివేశములున్నవి. కోపాద్రిక్తతతో శపించిన తపస్విజనులు కలరు. తపస్విజనులు శక్తివంతు లగుదురు.మహిమలు కలిగి యుందురు.

కాని మట్టిని, బంగారమును, పాపిని, పుణ్యుని, ఏనుగును, దోమను, రాజును, బంటును చూచినపుడు సమదృష్టి లేక వైవిధ్యమును చూపుదురు. ప్రత్యేకించి పాపులను చూచునపుడు ఉదాసీనులై యుండలేరు. హీనులను చూచునపుడు నిరసించుట కూడ జరుగును. యోగులు అట్టివారందరి యెడల ఉదాసీనులై యుందురు.

శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు. అతడు తన జీవితమున దుర్వాసుడు, విశ్వామిత్రుడు, కణ్వుడు ఇత్యాది తపస్వి జనులను చూచెను. వారి ప్రవర్తనమున సమదర్శనము లేక వారు శపించినవారిని తాను కాచుట జరిగినది. తపఃశక్తి వలన అపుడపుడు సహనము కోల్పోవుట జరుగుచుండును. సమదర్శనము లేనిచో సహన ముండదు. సహనము కోల్పోయినపుడు సంయమ ముండదు. సమభావము కలుగదు.

యాదవుల ప్రవర్తనకు కలత చెందిన కణ్వ విశ్వామిత్ర మహర్షులు సహనమును కోల్పోయిరి. అట్టి యాదవులతో తన జీవిత మంతయు గడిపినవాడు శ్రీకృష్ణుడు. అతడు యోగేశ్వరుడు. అట్టివారి వృద్ధికై శ్రమించినవాడు వాసుదేవుడు. అతడు యోగీశ్వరుడు.

ఇట్లు యోగులు సమతుల్యమైన ప్రవర్తన కలిగియుందురు. కావున తపస్విజనుల కన్న అధికులు. జ్ఞానులు జ్ఞానుల సాంగత్యమే కోరుదురు. అజ్ఞానుల నడుమ నుండలేరు. అవిద్యను సహించలేరు. అవిద్యావర్తనులను చూచి నపుడు వారికి (జ్ఞానులకు) చులకన భావన కలుగును.

అట్టి వారియందు కూడ ఈశ్వరుడున్నాడని మరతురు. వారు అవిద్య, అశుచిలను సహింపలేరు. శ్రీకృష్ణుడు గోపకులతో కూడి ఎంగిలి ముద్దలను తినెను. పూలమ్ముకొను వానిని శీఘ్రముగ అను గ్రహించెను. పచ్చికబయళ్ళ పై పరుండెను. కాలమును దేశమును బట్టి తానున్న పరిసరములయందు, జీవుల యందు అంతర్యామిని దర్శించు సమబుద్ధి యోగుల కున్నట్లు జ్ఞానుల కుండదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


30 May 2021

No comments:

Post a Comment