శ్రీ శివ మహా పురాణము - 405
🌹 . శ్రీ శివ మహా పురాణము - 405🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 22
🌻. పార్వతీ తపోవర్ణనము - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ దేవర్షీ! నీవు వెళ్లగానే, పార్వతి సంతసించిన మనస్సు గలదై శివుడు తపస్సుచే ప్రసన్నుడగునని తలంచి, తపస్సును చేయుటకు మనస్సులో నిశ్చయము చేసుకొనెను (1). అపుడామె జయ, విజయ, అను చెలికత్తెలనిద్దరినీ తోడ్కొని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారిచే తల్లిదండ్రులను అడిగించెను (2). ఆమె ముందుగా పర్వత రాజు, తన తండ్రి అగు హిమవంతుని వద్దకు వెళ్లి, వినయముతో గూడినదై ప్రణమిల్లి ఇట్లు అడిగించెను (3).
సఖురాండ్రిద్దరు ఇట్లు పలికిరి-
ఓ హిమవంతుడా! నీ కుమారై మనసులోని మాటను ఇపుడు మేము చెప్పెదము. ఆమె తన దేహమునకు సౌందర్యమునకు (4), మరియు నీ ఈ కులమునకు సార్ధక్యమును కలిగింప గోరుచున్నది. ఈ శివుడు తపస్సునకు మాత్రమే లొంగును. తపస్సు చేయనిచో, ఆయన దర్శనము నీయడు (5). ఓ పర్వత రాజా! కావున నీవిపుడు అనుమతిని ఇమ్ము. పార్వతి నీ ప్రేమ పూర్వకమగు ఆజ్ఞను బడసి అడవికి వెళ్లి తపస్సు చేయును గాక! (6).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ మహర్షీ! పార్వతి యొక్క సఖురాండ్రిద్దరు ఈ తీరున కోరగా, అపుడా పర్వతరాజు చక్కగా ఆలోచించి ఇట్లు పలికను (7).
హిమవంతుడిట్లు పలికెను-
ఈ ప్రస్తావము నాకు సమ్మతమే. కాని మేనకకు సమ్మతము కావలయును గదా! భవిష్యత్తులో ఇటులనే జరిగినచో, ఇంతకంటె ఇత్తమమగు విషయమేమి గలదు? (8) ఈమె తపస్సు చేసినచో, నా కులము సార్థకమగుననుటలో సందేహము లేదు. కావున ఈమె తల్లికి సమ్మతమైనచో, అంతకంటె గొప్ప శుభము మరి యేది గలదు? (9)
బ్రహ్మ ఇట్లు పలికెను-
హిమవంతుని ఈ మాటలను విని ఆ సఖురాండ్రిద్దరు ఆమెతో గూడి తల్లి అనుమతిని పొందుటకై ఆమె వద్దకు వెళ్లిరి (10). ఓ నారదా! వారిద్దరు పార్వతియొక్క తల్లి వద్దకు వెళ్లి ఆమెకు చేతులు జోడించి నమస్కరించి ఆదరముతో నిట్లనిరి (11).
సఖురాండ్రిద్దరు ఇట్లు పలికిరి-
ఓ తల్లీ! నీవు నీ కుమారై యొక్క మనస్సులోని మాటను వినుము. ఓ దేవీ! నీకు నమస్కారము. ఆమె మాటను ప్రసన్నమగు మసస్సుతో విని నీవు ఆచరించ తగుదువు (12). నీ కుమారై శివుని కొరకై తపస్సును చేయగోరుచున్నది. ఆమె పరమ తపస్సును చేయుటకు తండ్రిగారి అనుమతి లభించినది. ఇపుడామె నీ అనుమతిని గోరుచున్నది. (13). ఓ పతివ్రతా! ఈమె తన సౌందర్యమును సఫలము చేయగోరుచున్నది. నీవు అనుమతినిచ్చినచో, ఆమె ఈ ఆకాంక్షను సత్యము చేయుటకై తపస్సును చేయగలదు (14).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
30 May 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment