గీతోపనిషత్తు -221


🌹. గీతోపనిషత్తు -221 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 9

🍀 8. తత్త్వ దర్శనము - పరమ పురుషుడు పురాతనుడు. లోకముల నెల్లపుడు శాసించువాడు. అతడే కవి. అనగా సృష్టించు వాడు. అతడు అణువుకన్న సూక్ష్మమైనవాడు. సర్వమునకు ఆధారమైనవాడు. చింతింప శక్యము కాని రూపము, స్వరూపము కలవాడు. అతడు చీకటి కావలివాడు. చీకటి కావల ఆదిత్యునివలె వెలుగుచుండెడి వాడు. అట్టివానిగ అతనిని స్మరింపుము. వేదఋషులు ఈ పరమగు పురుషుని 'తత్' అని పిలిచిరి. అనగా 'అది' అనిరి. అదియే ఇదిగా ఏర్పడినదనియు, కనుక ఇది నిజమునకు అదియే యని ఉపనిషత్తులు పదే పదే తెలుపుచున్నవి. దానినే దర్శించు చుండుట తత్త్వదర్శనము. దానినే చింతించుచుండుట తత్త్వ చింతనము. దానిగూర్చియే గోష్ఠిచేయుట తత్త్వ విచారము. 🍀

కవిం పురాణ మనుశాసితార మణోరణీయాంస మనుస్మరేద్య: |
సర్వస్య ధాతార మచింత్యరూప మాదిత్యవర్ణం తమసః పరస్తాత్ || 9


తాత్పర్యము :

పై తెలిపిన పరమ పురుషుడు పురాతనుడు. లోకముల నెల్లపుడు శాసించువాడు. అతడే కవి. అనగా సృష్టించు వాడు. అతడు అణువుకన్న సూక్ష్మమైనవాడు. సర్వమునకు ఆధారమైనవాడు. చింతింప శక్యము కాని రూపము, స్వరూపము కలవాడు. అతడు చీకటి కావలివాడు. చీకటి కావల ఆదిత్యునివలె వెలుగుచుండెడి వాడు. అట్టివానిగ అతనిని స్మరింపుము.

వివరణము :

పరమ పురుషుని ఆవిష్కరించు శ్లోకమిది. అట్టి పరమపురుషుడు రూపమున కతీతమగు వెలుగు. ఏ నామము లేనివాడు. చీకటిచే క్రమ్మనివాడు. అజ్ఞానమను చీకటి కందని వాడు. సమస్త సృష్టికి అతడే ఆధారము. అయినప్పటికిని అణువందును కూడ యిమిడి యున్నాడు. అతని నుండే సమస్త సృష్టి వ్యక్తమగుచుండును. అతనిలోనికే సమస్త సృష్టి లయమగు చుండును. అతనివలననే సృష్టి నిలచి యుండును.

లయమందు సమస్తము అతని యందు ఇమిడియుండి, సృష్టియందు వెలువడి, స్థితి యందు పూర్ణమై ప్రకటింపబడి యుండును. అతనికన్న పురాతనుడు లేడు. అతడే సనాతనుడు. అందుండియే కాలము, సంకల్పము, శక్తి, ప్రకృతి, మహత్తు ఇత్యాదివన్నియు జనించును. సమస్తమునకు మూలమైన వానిని, గోచరించుచున్న సమస్తము నందు దర్శించుట ఈ శ్లోకమున తెలుపబడిన సాధన. “అనుస్మరేత్”అని శ్లోకము శాసించుచున్నది. అనుస్మరణము, అనుచింతనము అని తెలుపుటలో ఎడతెగక స్మరించమని, ఎడతెగక చింతనము చేయుమని సూచన.

ఈ పరమ పురుషుడు స్త్రీయు కాదు, పురుషుడు కాదు. రెండున్నూ మిళితమైన తత్త్వము. కనుక వేదఋషులు ఈ పరమగు పురుషుని 'తత్' అని పిలిచిరి. అనగా 'అది' అనిరి. అదియే ఇదిగా ఏర్పడినదనియు, కనుక ఇది నిజమునకు అదియే యని ఉపనిషత్తులు పదే పదే తెలుపుచున్నవి. దానినే దర్శించు చుండుట తత్త్వదర్శనము. దానినే చింతించుచుండుట తత్త్వ చింతనము. దానిగూర్చియే గోష్ఠిచేయుట తత్త్వ విచారము.

దాని యందు అన్నియు ఇమిడియుండును. అది శైవము కాదు, వైష్ణవము కాదు, శాక్తేయము కాదు, క్రైస్తవము కాదు, ఇస్లాము కాదు. మరి యే మతము కాదు. మతములు, సిద్ధాంతములు అన్నియు అందిమిడిపోవును. అట్టి తత్త్వమును ధ్యానించ మని బోధించు భగవద్గీత నిశ్చయముగా మతాతీతమైన గ్రంథము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


03 Jul 2021

No comments:

Post a Comment