🌹 . శ్రీ శివ మహా పురాణము - 421🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 24
🌻. దేవతలు శివునితో మొరపెట్టుకొనుట - 6 🌻
ఆ పార్వతి నారదుని ఉపదేశమును పొంది కఠినమగు తపస్సును చేయుచున్నది. స్థావర జంగమ ప్రాణులతో గూడిన ముల్లోకములు ఆమె యొక్కతేజస్సుచే వ్యాప్తమై యున్నవి (53). ఓ పరమేశ్వరా! నీవు ఆ పార్వతికి వరమునిచ్చుటకు వెళ్లుము. ఓ స్వామీ ! దేవతలమగు మా దుఃఖమును పోగొట్టి సుఖములనిమ్ము (54).
ఓ శంకరా! దేవతలకు నాకు హృదయములో నీ వివాహమును చూడవలెననే ఉత్సాహము అధికముగా గలదు. కావున నీవు యథా యోగ్యముగా చేయుము (55). ఓ పరత్పరా! నీవు రతికి ఇచ్చిన వరమును నెరవేర్చే సమయము ఆసన్నమైనది. నీ ప్రతిజ్ఞను సఫలము చేయుము (56).
బ్రహ్మ ఇట్లు పలికెను-
విష్ణువు, దేవతలు, మహర్షులు ఇట్లు పలికి శివునకు నమస్కరించి అనేక స్తోత్రములతో చక్కగా స్తుతించి, వారందరు ఆయన ఎదుట నిలబడిరి (57). అపుడు భక్తులకు వశుడై ఉండే శంకరుడు కూడా దేవతల మాటలను విని నవ్వెను. వేద మర్యాదను రక్షించు శివుడు వెంటనే వారికి ఇట్లు బదులిడెను (58).
శంకరుడిట్లు పలికెను-
ఓ హరీ! బ్రహ్మా! దేవతలారా! అందరు అదరముతో వినుడు. నేను వివేకముతో కూడియున్న యథోచితమగు ప్రత్యేక వచనమును చెప్పెదను (59). మానవులు వివాహమాడుట యోగ్యమగు కర్మ కాదు. వివాహము దృఢమగు బంధము. అది పెద్ద సంకెల అని చెప్పవచ్చును (60).
లోకములో చెడు సంగములనేకములు గలవు. వాటిలో అన్నింటి కంటె అధికమైనది స్త్రీలతోడి సంగము. మానవుడు బంధములనన్నింటినీ విడిపించుకొనగలడు. కాని స్త్రీసంగము నుండి విడిపించుకొనలేడు (61). ఇనుప సంకెళ్లతోగాని, చెక్కల సంకెలతో గాని దృఢముగా బంధింపబడిన వ్యక్తి విడిపించుకొనగలడు. కాని స్త్రీ అను పాశముచే బంధింపబడిన వ్యక్తి ఏనాటికైనను విముక్తుడు కాలేడు (62).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
03 Jul 2021
No comments:
Post a Comment