గీతోపనిషత్తు -226


🌹. గీతోపనిషత్తు -226 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 11

🍀 10. ప్రణవ నాదము - అక్షరమనగా క్షరము కానిది. నాశము లేనిది. శాశ్వతమైనది. అక్షరమనగా అక్ష+ర, అనగా అక్షముగా కొని రాబడినది. మూలము నుండి నవావరణ సృష్టిగ కొనువచ్చునది. అనగా ఓంకారము. దానినే 'ప్రణవ'మని కూడ అందురు. దాని యందే భూత భవిష్యత్ వర్తమాన కాలములున్నవి. అదియే తానుగ వ్యాకోచ సంకోచములు చెందుచు శాశ్వతమై యున్నది. దానిని వేదవిదులు 'ఓం' అను నాదముగ గుర్తించిరి. త్రికాలము లకు, త్రిలోకములకు మూలమగు అనాహత నాదముగ గుర్తించిరి. 🍀

యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః |
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే || 11


తాత్పర్యము :

అక్షరమని దేనిని గూర్చి వేదవిదులు పలుకు చున్నారో, దేనియందు యమ నియమాది నియమముల నభ్య సించుచు, ఇంద్రియ వాంఛలను విసర్జించి యతులు ప్రవేశించు చున్నారో, దేనియందు ఇచ్ఛతో జిజ్ఞాసువులు బ్రహ్మచర్యమున చరించు చున్నారో ఆ పదమును (స్థితిని) గూర్చి నీకు సంగ్రహముగ తెలి పెదను.

వివరణము :

అక్షరమనగా క్షరము కానిది. నాశము లేనిది. శాశ్వతమైనది. అక్షరమనగా అక్ష+ర, అనగా అక్షముగా కొని రాబడినది. మూలము నుండి నవావరణ సృష్టిగ కొనువచ్చునది. అనగా ఓంకారము. దానినే 'ప్రణవ'మని కూడ అందురు. దాని యందే భూత భవిష్యత్ వర్తమాన కాలములున్నవి.

మూలమే అక్షముగ అనేకానేకమైన ప్రకృతి స్థితులను ఏర్పరచుకొనుచు సృష్టిగ వ్యక్తమై, స్థితియందుండి మరల తిరోగమనము చెందుచు, సృష్టియందు లయమైన పిదప కూడ ఉండునటు వంటిది. అదియే తానుగ వ్యాకోచ సంకోచములు చెందుచు శాశ్వతమై యున్నది.

దానిని వేదవిదులు 'ఓం' అను నాదముగ గుర్తించిరి. త్రికాలము లకు, త్రిలోకములకు మూలమగు అనాహత నాదముగ గుర్తించిరి. వేదవిదులు దీనియందాసక్తిగొని, దానితో అనుసంధానము చెంది సమస్తమును దర్శించి, వివరించిరి. వేదవిదులు అనగా వేదము తెలిసిన వారని అర్థము.

వేదమనగా ఓంకారము. ఓంకారము ననుభూతి చెందుటవలన సర్వమును విదితమగును. అది నశించని నాదము. కనుకనే వేద సంప్రదాయమున ప్రధానముగ ఓంకారమును శిశుప్రాయము నుండి పరిచయము చేయుదురు. నిత్యము మనయందు జరుగుచున్న నాదమును అంతరంగమున గుర్తించి, దానితో కూడియుండుట ప్రణవనాద ఉపాసనము. యతులు, అనగా తమను తాము యమించుకొనినవారు. ధర్మమునకు కట్టుబడి యుండువారు.

త్రికరణశుద్ధి, అహింస, అపరిగ్రహము, బాహ్యాంతర శుచి, శాస్త్ర అధ్యయనము, స్వా అధ్యయనము పాటించుచు, తమను తాము ఈశ్వరునకు సమర్పణము చేసుకొనువారు. మరియు బ్రహ్మము నందు ప్రవేశించి వసించుట కిచ్చగించువారు.

బ్రహ్మచర్య మనగా బ్రహ్మమునందు ప్రవేశించి, అందే చరించుచు, అందే వసించుట. అట్లు వేదవిదులు దేనిని గూర్చి భాషింతురో, యతులు రాగరహితులై దేనియందు వసింతురో, బ్రహ్మచారులు ఎందు స్థిరపడుట కిచ్చగింతురో, అట్టి పరమపదమును చేరు విధానమును తెలుపబోవుచున్నానని భగవానుడు ఈ శ్లోకమున పలికెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


13 Jul 2021

No comments:

Post a Comment