శ్రీ శివ మహా పురాణము - 426


🌹 . శ్రీ శివ మహా పురాణము - 426🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 25

🌻. సప్తర్షులు పార్వతిని పరీక్షించుట - 3 🌻

ఆ బ్రహ్మణులిట్లు పలుకగా ఆ పార్వతీ దేవి వారి యెదుట పరమ రహస్యమే అయిననూ సత్యము నిట్లు పలికెను.(22)

పార్వతి ఇట్లు పలికెను -

మునివరులారా! నా మాటను ప్రీతితో మనస్సును లగ్నము చేసి వినుడు . నేను నా బుద్ధితో ఆలోచించి నిశ్చయించిన నా విచారము చెప్పెదను (23)

అసంభవమగు నా మాటలను విని మీరు పరిహాసము చెసెదరు. ఓ విప్రులారా! మీ ఎదుట వర్ణించుటకు సంకోచము అగుచున్నది. నేనేమి చేయుదును? (24)

ఈ నా మనస్సు నియంత్రింప సంభవము కానిది. నావశము లేదు. అసంభవమగు కర్మలనపేక్షించుచున్నది ఈ నా మనస్సు నీటిపై ఎత్తైన మహా ప్రాసాదమును నిర్మింపగోరుచున్నది.(25)

రుద్రుడు నాకు భర్త కావలననే కొర్కెను మనస్సులో నిడుకొని, దేవర్షియగు నారదుని అనుమతిని పొంది తీవ్రమగు తపస్సును చేయుచున్నాను.(26)

రెక్కలు లేని నా మనస్సును అనే పక్షి హఠాత్తుగా ఆకాశమునందు ఎగురుచున్నది. కరుణా సముద్రుడగు శంకరస్వామి దాని యాశను పరిపూర్ణము చేయును గాక ! (27)

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆమె యొక్క ఈ మాటలను విని ఆ మహర్షులు నవ్వి ఆ పార్వతిని ప్రీతితో ఆదరించి (మనస్సులో) మాయమాటలను ఇట్లు పలికిరి(28)

ఋషులు ఇట్లు పలికిరి-

వ్యర్థముగా తాను పండితుడనను ధారణ గలవాడు, క్రూరమగు మనస్సు గలవాడు అగు ఆ దేవర్సి యొక్క చరిత్ర నీకు తెలియదు. ఓ పార్వతీ! నీవు సహజముగా బుద్ధిమంతురాలవే (29)

నారదుడు మోసపు మాటలను చెప్పి ఇతరుల మనస్సులను కల్లోల పెట్టును. అతని మాటలను విన్నవారికి అన్ని విధమలుగా హాని కలుగును (30)

మేము నీకు క్రమముగా బోధించెదము. నీవు మంచి బుద్ధితో ఈ చక్కని వృత్తాంతమును విని ప్రీతితో దానిని తెలుసుకొని మనస్సులో నిశ్చయించుము (31) బ్రహ్మపుత్రుడగు దక్షుడు తండ్రి ఆజ్ఞచే తన భార్య యందు పదివేల పుత్రులను గని, ఆ ప్రియపుత్రులను తపస్సు చేయుడని నియోగించెను. (32)


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


13 Jul 2021

No comments:

Post a Comment