మైత్రేయ మహర్షి బోధనలు - 6


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 6 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 4. సృజనాత్మకత 🌻


ఒక కుటుంబము, సంఘము, దేశము మరియు దేశముల కూటమి తమకై చేయు ప్రయత్నమునకు గల గమ్యము ఒకటే. జీవన పరిస్థితులను మెరుగుపరచుకొనుట మరియు ప్రశాంతతను అనుభవించుట, జీవితమును మెరుగుపరుచు కొనుటకు పరిమితులు లేవు. కుటుంబపరముగా కాని సంఘపరముగ కాని ప్రతి విషయమ నందు, ప్రతి రోజు మెరుగుపరుచుకొనుటకు ప్రయత్నము చేయుచుండ వలెను. సంకల్పములయందు పరిణామమునకు ఉన్నత భావములను శోధించుచుండవలెను. భాషా పరిణామమునకు ఉన్నత గ్రంథములను చదువుచుండవలెను. క్రియా రూపమున ఉన్న తత్వమునకు తోటి జీవులతో సహకరించుట నేర్చుకొను చుండవలెను. ఈ విధముగ ప్రయత్నముచేయు సాధకుడు సృజనాత్మక శక్తిని పొందును.

సృజనాత్మకశక్తి కారణముగ క్రమశః నవజీవనము సాధ్యపడును. గానుగెద్దు జీవితమునుండి చైతన్యము ఊర్ధ్వగతి పొందుచు చక్రభ్రమణమున ఆరోహణము చేయగలుగును. నవజీవనము సంఘమున ప్రారంభములో కొంత క్రొత్తగనున్నను కాలక్రమమున అది ఇతరజీవులకు కూడ దారి నేర్పరచును. సృజనాత్మక జీవనము కష్టతరమని భయపడవలదు. వెనుకంజ వేయవలదు. కొత్తదారి మొదటిలో కొంత ఇబ్బందిగనున్నను వాడుకచే సౌమ్యమగును. దారి- సంఘ శ్రేయస్సు, అభివృద్ధి గమ్యములుగ గలది కావున ఈ దారిన నడుచువారు పరిణితి చెందుట తధ్యము. నశించుట జరుగదు. నవజీవనమునకు సృజనాత్మకశక్తి ఎంత అవసరమో, శాస్త్రీయముగ సృజించిన భావములను వివేకముతో, పట్టుదలతో, ధైర్యముతో, మౌనముతో, ఓర్పుతో నిర్వర్తించుట కూడ అంతే ముఖ్యము. ఈ గుణములతో కూడని సంకల్పములు అవతరణ చెందవు. ఇట్లు సృజనాత్మక శక్తిని పై గుణములతో అవతరింప చేయుట వలన సాధకుడు అంతర్ముఖ ఆనందమును పొందుచు ముందుకు సాగిపోగలడు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


18 Sep 2021

No comments:

Post a Comment