🌹 త్రిపురారహస్య జ్ఞానఖండసారము - 1🌹
✍️. పోలూరి హనుమజ్జానకీరామశర్మ
📚. ప్రసాద్ భరద్వాజ
పూర్వము సరస్వతీనదీతీరమున సుమంతుఁడను బ్రాహ్మణుఁడు భార్యా సహితుఁడై వసించుచుండెను. అతఁడు దుర్గాపూజోపాసనాపరాయణుఁడు. భార్యను పేరుతో పిలువరాదను నిషేధముండుటవలన, అతఁడు భార్యను "అయి" అని పిలుచుచుండెడివాఁడు. వారి కొక కుమారుఁడు కలిగెను. వాని పేరు అలర్కుఁడు. వాఁడును తల్లిని ''ఐ'' ''ఐ'' అని పిలుచుచుండెడివాఁడు. ఆ బాలునకు పూర్వకర్మవశమున అయిదేండ్లకే పెద్దజబ్బు చేసెను. ఆవ్యాధిచేత ఆబాలుఁడు బాధ పడుచు తల్లిని ''ఐ'' ''ఐ'' అని నిరంతరము స్మరించుచు మరణించెను.
అతఁడు పిమ్మట హారితాయనవఁశమున జన్మించి సుమేధుఁడు అను పేరుతో విలసిల్లెను. అతఁడు భగవంతుఁడైన పరశురాముని జేరి సేవించుచు ఒకనాఁడిట్లు అడిగెను "భగవానుఁడా! సంసారతాపముచేత తప్తులై దీనులైయున్న మానవులు మొదలుగా జీవలకు పరమశ్రేయస్సును కలిగించుటకు శ్రేష్ఠమైన సాధన మేమి? అది నేను వినఁదగినదైనచో చెప్పుము.'' అప్పుడాయన చిఱునవ్వుతో ''కాలక్రమమున చెప్పెదను లెమ్ము'' అని అనెను. తరువాత పదునాఱువత్సరములు గడచెను. పిమ్మట సుమేధుఁడు వెనుక తాను అడిగినవిషయమును జ్ఞప్తికి తెచ్చి దానిని చెప్పుమని పరశురాముని ప్రార్థించెను. అప్పుడు ఆయన తనకు దత్తగురువు చెప్పనవిషయమును స్మరించెను. త్రిపురాదేవియొక్కరహస్యమును శివుఁడు విష్ణువునకు ఉపదేశించెను. విష్ణుదేవుఁడు తనయంశమున జన్మించినదత్తాత్రేయునకు దానిని బోధించెను. దత్తగురువు దానిని భార్గవునకు ఉపదేశించుచు, "దీనిని ఇతరులకు బోధింపకుము, హారితాయనుఁడైన సుమేధుఁడు భక్తితో శిష్యుఁడై నిన్ను సేవించును. అతఁడు దీనిని నీవలన విని గ్రంథముగా రచించును'' అని చెప్పెను. ఆ విషయమును స్మరించి పరశురాముఁడు సుమేధుని చూచి, ''వత్సా! సర్వము కాలవశమున కలుగుచుండును రేపు పుష్యనక్షత్రమున ఆవిషయమును బోధించుటకు ఉపక్రమింతును'' అని చెప్పెను.
పిమ్మట వారు సాయంకాలమున సంధ్యాకాలజపమును గావించి స్వాత్మశక్తిని ధ్యానించుచు రాత్రి సుఖముగా నిద్రించిరి. మఱునాఁడు ఉదయము సుమేధుఁడు శుభముహూర్తమున ఆహ్ణికవిధులను నిర్వర్తించి సుఖాసీనుఁడై యున్న గురువును చేరి సాష్టాంగదండప్రణామము గావించి లేచి అంజలి గావించి వినమ్రుఁడై నిలిచియుండెను. పరశురాముఁడు ఎదుటనున్న హేమపీఠముపై పుష్పములను దోసిటితో నుంచి శ్రీబాలాత్రిపురసుందరియొక్క మూఁడువిధములుగా నున్న రూపమును మంత్రతంత్రచర్యాక్రమమును ముద్రాదులు ఆచారక్రమము మొదలగునని యన్నియు సుమేధునకు ఉపదేశించి, ''వత్సా! ఇది పరమ బ్రహ్మము. దీనిని జాగుచేయక సాధింపుము పిమ్మట నీకు త్వరలోనే పూర్ణపదము నొసంగెదను'' అని చెప్పెను. అంతట హారితాయనుఁడు ఆయనకు మూఁడుపర్యాయములు ప్రదక్షిణము గావించి నమస్కరించి సెలవుగైకొని శ్రీశైలమునకు పోయెను.
శ్రీశైలమునందు సుమేధుడు భ్రమరాంబాదేవియొక్క సన్నిధియందు చక్కనికుటీరమును నిర్మించుకొని అందు ఫలములే ఆహారముగా ఇంద్రియములను మనస్సును నియమించుకొని మొదట తొమ్మిదినెలలు తరువాత అయిదునెలలు పిదప మూఁడునెలలు భక్తి శ్రద్ధలతో గురువు చెప్పినట్లుగా శ్రీబాలాంబికను ధ్యానించుచుండెను. పిమ్మట ఒకనాఁడు రాత్రి స్వప్నమునందు అక్షమాలాపుస్తకాభయ వరదపాణియై నాలుగు భుజములతో మూఁడునేత్రములతో చంద్రకళావిలసితమైన ముకుటముతో పదియేండ్లువయస్సుగల కుమారీరూపమున మహాసౌందర్యముతో శ్రీబాలాంబిక సాక్షాత్కరించెను. స్వప్నమునందే హారితాయనుఁడు ఆమెకు సాష్టాంగదండప్రణామము గావించి లేచి అంజిలించి విచిత్రార్థపదమనోహరమై ఛందోబద్ధమైన స్తోత్రముతో ఆమెను స్తుతించి ఆనందపారవశ్యమున కన్నులు అశ్రువులతో నిండఁగా ఏమియు మాటాడలేక చూడలేక ఊరక నిలిచియుండెను. పరమేశ్వరి ''వత్సా'' అని మధురముగా పిలిచి వానిమూర్ధమునందు హస్తము నుంచెను. ఆ కరస్పర్శచేత అతఁడు బ్రహ్మానందమయుఁడయ్యెను. అప్పుడామహాదేవి, ''వత్సా! నీవు కోరినసిద్ధి లభించినది. ఇంక గురువునొద్దకు పొమ్ము. జాగుసేయకుము'' అని పలికి అంతర్ధానము నొందెను.
సుమేధుఁడు వెంటనే మేల్కొని ''ఇది యేమి'' అని స్వప్నమునుగూర్చి మాటిమాటికి ఆలోచించుచు పరమసుందరమైన యాదేవీమూర్తిని అమృతము వంటి ఆమెమాటలను స్మరించుచు వేళయగుటచే స్నానమొనరించుటకై నదియొద్దకు పోయెను. అక్కడ కూడ ఆ స్వప్నవృత్తాంతమునే తలంచుచు ఆహ్ణికక్రియలను కూడ మఱచి అతఁడు ఇట్లు చింతింపఁజొచ్చెను. ''ఇది సత్యమో అసత్యమో తెలియుట లేదు. గరువునొద్దకుపోయి దీనినిగూర్చి ఏమి చెప్పుదును? స్వప్నము భ్రాంతిరూపము. కావున దానిని బుద్ధిమంతులు విశ్వసింపరు. కాని జగదీశ్వరియే సాక్షాత్కరించి చెప్పినమాటలయందు శ్రద్ధ వహింపక ఖలుఁడనై గురువునొద్దకు ఎట్లు పోకుందును? అహో! కాలగతి ఎంత విషమముగా నున్నది? ఎట్లయినను ఆమె స్వప్నమందు కాక జాగ్రద్దశయందే ప్రత్యక్షమగువఱకు ఇచ్చటనే తపస్సు చేయుచు నుందును.ఈవిషయమున ఆదేవి నన్ను క్షమించునుగాక'' ఇట్లు అతఁడు నిశ్చయించుకొన్నంతనే, ''వత్సా! ఆవచనమునందు అవిశ్వాసమును విడువుము, ఆ మాట అసత్యముకాదు.నిజమే'' అని మధురముగా ఆశ రీరవాణి విన్పించెను. అతఁడు ఆశ్చర్యముతో అన్నివైపులను చూచెను. ఎవ్వరును అతనికి కన్పింపలేదు. ఆమాటలు ఆకాశమునుండి విన్పించె నని గ్రహించి అతఁడు భక్తితో దేవి నుద్దేశించి సాష్టాంగముగ ప్రణమిల్లి లేచి ప్రసన్నచిత్తుడై గురువునొద్దకు బయలుదేరెను.
సుమేధుఁడు మలయపర్వతమున కరిగి పరశురాముని సందర్శించి పాదాభివందనము గావించి జరిగిన వృత్తాంతమును చెప్పెను. ఆయన మిగుల సంతోషించి, ''వత్సా! ఆ త్రిపురాదేవి నీయెడల ప్రసన్నురాలై స్వప్నమున దర్శన మొసంగినది. నీవు ధన్యుఁడవు. అక్కడ జరిగినవృత్తాంత మంతయు నేను యోగదృష్టితో చూచితిని. ఇంక నీవు జ్ఞానసంపన్నుఁడవు కాఁగలవు'' అని చెప్పి యొకశుభసమయమున సాంగోపాంగముగ సుమేధునకు శ్రీవిద్యను ఉపదేశించి దీక్ష నొసంగెను. పిమ్మట శివప్రోక్తమైనది, భగవంతుడైన దత్తాత్రేయునివలన తాను విన్నది, తంత్రసారము, ఇతిహాసములలో శ్రేష్ఠమైనదియునగు త్రిపురా రహస్యమును ఉపదేశించెను. పిదప సుమేధునితో ఆయన ఇట్లు చెప్పెను. ''వత్సా! దీనిని ప్రయత్నపూర్వకముగా రహస్యముగా నుంచి రక్షింపుము. గురుదేవుల యాజ్ఞచే నేను నీకు దీని నొసంగతిని. నాస్తికులయొద్ద భక్తి హీనులయొద్ద దీనిని గూర్చి ప్రసంగింపకుము. త్రిపురామహేశ్వరిని ఆరాధించి ఆమె యనుగ్రహమును పొంది దీనిని గ్రంథముగా రచించి అర్హులైన శిష్యులకు అందింపుము. మా గురుదేవులయాజ్ఞ ఇట్లున్నది. అది అసత్యము కాదు.''
అంతట సుమేధుఁడు భార్గవునకు ప్రణమిల్లి ఆశీస్సులను పొంది ఆయనకు ప్రదక్షిణము కావించి అటనుండి బయలు దేరి శ్రీసుందరేశ్వరుని పత్నియైన మీనాక్షీదేవి వెలసియున్న హాలాస్యపురమున కేగెను. అచ్చట అతఁడు వేగవతీనదీసమీపమున సువర్ణపద్మినీతీరమునందు యమములతో నియమములతో శ్రీత్రిపురామహేశ్వరిని ధ్యానించుచు గొప్పతపస్సును చేయఁజొచ్చెను. అట్లు అయిదు సంవత్సరములు గడచెను. పిమ్మట ఒకనాఁడు అతఁడు ధ్యాననిష్ఠుఁడై యుండఁగా చిత్తమునందు మంగళప్రదుఁడైన యొకమహాపురుషుఁడు కోచరించెను. ఆయన శరీరమునిండ భస్మము ధరించి కర్పూరమువలె తెల్లగా ప్రకాశించుచు జడలు కల వాఁడై వీణను వాయించుచుండెను. ''ఇదియేమి?'' అని ఆశ్చర్యముతో కనులు తెఱచి ఎదుట సాక్షాత్కరించియున్న నారదమహర్షిని చూచి విస్మితుఁడై లేచి ఆసనము నొసంగి ప్రణమిల్లి కృతాంజలియై సంతోషముతో నిట్లనెను. ''దేవర్షీ! నీకు స్వాగతము, నేను ధ్యానస్థితుఁడనై ఎదుట నున్ననిన్ను గమనింపనైతిని, నా యపరాధమును మన్నింపుము. సత్పురుషులతో సమాగమము గొప్పయభ్యుదయమును కలిగించును. నీవు నాయందు అనుగ్రహమును చూపుటవలన నేను కృతార్థుఁడ నైతిని. నీదర్శనముచేతనే నా కోరిక లన్నియు తీరినవి. అయినను ఒక సందేహము తీరకున్నది. వెలుపల నిలిచియున్ననీవు మనస్సులోపల నా కెట్లు కన్పించితివి? ఇది ఎట్లు జరిగినదో నాకు దయతో చెప్పుము''
నారదమహర్షి పకపక నవ్వుచు ఇట్లనెను. ''నీవు సుమేధుఁడవు, విద్వాంసుఁడవు, ఏమి ప్రశ్న యిది? లోపల ఏమి? వెలుపల ఏమి? దేనికి ఏది వెలుపల నున్నది? దేనికి ఏది లోపల నున్నది? ఇంత చిన్న శరీరమునకు లోపల నన్నెట్లు చూచితివి? అప్పుడు చూచుచున్న నీ వెక్కడ నుంటివి? వెలుపల నైనను నీవు నన్నెట్లు చూచితివి? చక్షరింద్రియము దేహమువలెనే జడము. అది కదలదు అది వెలుపలికి వచ్చి దేనినైనను ఎట్లుచూడఁగలదు? నీవు నన్ను లోపల చూచిన నేమి? వెలుపల చూచిన నేమి? ఈ ప్రశ్నలవలన నీకేమి లాభము? ప్రస్తుత విషయమును వినుము. నే నిప్పుడు బ్రహ్మలోకమునుండి నిన్ను చూచుటకు వచ్చితిని. బ్రహ్మసభయందు ఎల్లరు వినుచుండఁగా మార్కండేయ మహర్షి పరమేష్ఠికి ప్రణమిల్లి ఇట్లు అడిగెను. ''భగవానుడా! నీవు సర్వలోకములకు కర్తవు. కావున నీకు తెలియనిది ఏదియు నుండదు. నేను నీదయవలననే ఈశ్వరుని ఆరాధించి మృత్యువును జయించి చిరంజీవి నైతిని. నేను సకలశాస్త్రములను ఇతిహాస్యములను ఆగమములను పురాణములను చూచితిని. అన్నింటిలో సారమైన దేదోనిశ్చయించి చెప్పుము. ఇది నాకు పెద్ద సందేహముగా ఉన్నది. నేను ఈ విషయమును దేవతలను ఋషులను సిద్ధయోగులను ఎంతమందినో అడిగితిని. వారందఱును తమకు ఇష్టమైనదానిని భక్తి శ్రద్ధాపరవశులై చెప్పుచుండిరి. కాని వారు సర్వము నెఱింగినవారు కారు. మఱి నీవు లోకకర్తవు సర్వజ్ఞుఁడవు. కావున సకలవిజ్ఞానమునకు సార మేదో చెప్పుము.''
మార్కండేయుని మాటలవలన పరమేష్ఠికి త్రిపురాదేవి స్మృతికి వచ్చెను. వెంటనే ఆయన లేచి అపరాశక్తి నుద్దేశించి సాష్టాంగప్రణామము గావించి మార్కండేయునితో ఇట్లనెను. 'వత్సా! నేను చెప్పుదానిని శ్రద్ధతో వినుము. ఈసభాసదు లందఱును విందురు గాక! ఎవరికి ఈవిషయమున శ్రద్ధ కలుగదో వారు ఈలోకమున నిలువఁజాలరు. సకల జగత్తులకు కారణము త్రిపురామహేశ్వరి. ఆమె సకల జగత్తులకు ఆత్మయైన వ్యాపించియున్నది. ఆపరాశక్తి యొక్క ఆదిమధ్యాంతములను నేనే కాదు విష్ణువు మహేశ్వనరుఁడు కూడ నెఱుంగరు. మేము మువ్వురము ఆమెపాదపద్మములయందలి రేణువులము. ఆమె సర్వశ్రేష్ఠురాలు. ఆమెయొక్క మూర్తియే సర్వదేవతామూర్తులలో అగ్రగణ్యము ఆమెను గూర్చి బోధించుసిద్ధాంతమే సర్వవిజ్ఞానమునకుసారము. ఆ త్రిపురాదేవియొక్క రహస్యమును శివుఁడు విష్ణువునకు ఉపదేశించెను. విష్ణుదేవునివలన నేను పొందితిని విష్ణుదేవుఁడు తనయంశవలన మనుష్యలోకమున ఉద్భవించిన దత్తాత్రేయునకు ఆ విజ్ఞానమును అందించెను. అతడు దానిని భార్గవరామునకు ఉపదేశించేను.భార్గవుఁడును గురువుయొక్క ఆజ్ఞచేత సుమేధుఁడను శిష్యునకు బోధించెను. సుమేధుఁడు ఆ విజ్ఞానమును గ్రంథముగా రచింపఁగోరుచు ఇప్పుడు హాలాస్యక్షేత్రమున త్రిపురాదేవిని ఆరాంధించుచున్నాఁడు' ఆయన ఇట్లు చెప్పినంతనే నిన్ను చూడవలయు నని కుతూహలముతో బయలుదేరి వచ్చితిని. నేను ఇచ్చటికి వచ్చుటకుఁగల కారణమును చెప్పితిని. ఇంక తరువాత జరిగినదానిని లేదా జరుగువలసియున్నదానిని నీవు చెప్పుము.''
నారదునిమాటలను విని సుమేధుఁడు ఏమి చెప్పుటకును తోఁచక సిగ్గుపడి ఇట్లనెను. ''మహర్షీ! నీకు నేనేమియు సమాధానము చెప్పలేకున్నాను. ఇంక జరుగవలసిన దేదియో నీవే చెప్పుము. గ్రంథము రచింపు మని నాకు గురువర్యుఁడు ఆజ్ఞ యొసంగినమాట నిజమే ఆయన చెప్పుచున్నప్పుడు త్రిపురారహస్యము అంతయు శ్రద్ధతో వింటిని. కాని మందబుద్ధి నగుటచేత అంతయు మఱచితిని. భగవానుఁడా నీవు నన్ను కరుణింపుము.'' ఇట్లు పలుకుచు సుమేధుఁడు ఆమహర్షికి సాష్టాంగ ప్రణామము గావించెను. నారదమహర్షి చాలసేపు ఆలోచించి బ్రహ్మదేవుని స్మరించెను పరమేష్ఠి వెంటనే అచ్చట ప్రత్యక్షమయ్యెను. వారిరువురును సంభ్రమించుచు లేచి సాష్టాంగప్రణామములు గావించి అర్ఘ్యము ఆసనము నొసంగి పూజించి వినమ్రులై నిలిచియుండిరి. ఆయన నారదునివైపు చూచి, ''వత్సా! నన్నేల స్మరించితివి? ఏమి కావలయునో చెప్పుము'' అని యడిగెను. నారదుఁడు ఇట్లనెను. ''భగవానుడా! నీవు మార్కండేయునితో చెప్పిన మాటలనుబట్టి త్రిపురారహస్యగ్రంథమునకు కవియైన యీసుమేధుని చూచుటకై వచ్చితిని. నీమాటవలన ఇతఁడు కవి యగును గాక! కాని నాకు ఒకసందేహము కలిగినది. ఇతఁడు ఏపుణ్యపరిపాకముచేత త్రిపురారహస్యమునకు ఆచార్యుఁడై ఉపాసకులకు ఎల్లరకును పూజ్యుఁడగుచున్నాడు? ఇది సాధారణమైన పుణ్యము వలన సంభవించినది కాదు. ఇది రహస్యమైనను దయతో చెప్పుము.''
బ్రహ్మదేవుడు ఇట్లు చెప్పెను. ''ఇతడు పూర్వజన్మమున తల్లిని 'ఐ' 'ఐ' అని పిలుచుచుండెడివాఁడు. చనిపోవునప్పడు కూడ ఇతఁడు ఆ యక్షర ముననే ఉచ్చరించుచుండెను. బాలాత్రిపురసుందరీమంత్రమునకు 'ఐమ్' మొదటి బీజాక్షరము, దానిని ఇతఁడు బిందురహితముగా 'ఐ' అని ఉచ్చరించుచుండెను ఆ పుణ్యవిశేషముచేతనే యితనికి అల్పకాలముననే ఈ జన్మమున ఆ మహాదేవి స్వప్నమున దర్శన మొసంగినది. వాగ్భవబీజమును పూర్వజన్మమున ఉచ్చరించు చుండిన హేతువుచేతనే యితఁడు ఈజన్మమున స్వప్నమునందు దర్శనమొసంగిన యాబాలాంబికను విచిత్రములైన పదబంధములతో మనో హరములైన భావములతో ఛందోబద్ధముగ స్తుతింపఁగలిగెను. ఇతఁడు ఆ యక్షరమును ఉచ్చరించునప్పుడు అయిదేండ్ల బాలుఁడు. అందువలన అది దేవీమంత్రము బీజాక్షరము అనుజ్ఞానము ఇతనికిలేదు. అజ్ఞానముతో అబిందుకముగా ఉచ్చరించుచుండిన హేతువుచేత ఈ జన్మమున ఇతఁడు పద్యములతో దేవిని స్తుతింపఁగలిగినను ఆపద్యముల నిర్మాణమునకు మూలమైన ఛందస్సులపరిజ్ఞానము ఇతనికికలుగలేదు. అట్లే ధారణము (Memory) లేదు. కావుననే యితఁడు తాను స్వయముగా రచించినయాస్తోత్రమునే కాక గురువువలన విన్న త్రిపురారహస్యమును కూడ విస్మరించెను. అయినను పూర్వజన్మల పుణ్యఫలముగా ఇప్పుడు గావించుచుండిన తపస్సుచేతను ఇతఁడు త్రిపురారహస్య గ్రంథమునకు కవి యగు నని చెప్పితిని. కావున ఇఁక నుండి ఇతనికి గురువువలన విన్నది, తాను స్వయముగా కన్నది, మాత్రమే కాక భూతభవిష్యద్వర్త మానములలో సంఘటనములు వ్యక్తులయాకృతులు వర్తనములు స్వభావములు ఏవి యైనను స్మరించినంతనే గోచరింపఁగలవు; కావ్యలక్షణములు శాస్త్రవిశేషములు ఆవశ్యకములైన వన్నియు భాసింపఁగలవు. ఇంతవఱుకును త్రిపురారహస్యము గ్రంథముగా రూపొందలేదు. అది ఈతనిచేత గ్రంథముగా నిబద్ధమై హారితాయనసంహితగా ప్రసిద్ధము కాఁగలదు. శ్రేష్ఠమైన యీయితి హాసమును వినువారికి పఠించువారికిని త్రిపురాంబిక ప్రసన్నురా లగును. నారదా! ఇది సర్వవిజ్ఞానమునకు సారము. దీనిని పఠించినఁగాని ఎవని కైనను విజ్ఞానము సమగ్రము కాదు.''
పిమ్మట పరమేష్ఠి సుమేధునితో ఇట్లనెను. ''కుమారా! నామాట వినుము. నీకు సర్వము స్ఫురించును. భార్గవరాముని సేవించి పొందిన మంత్రదీక్షవలన త్రిపురాదేవి స్వప్నమున నీకు దర్శన మొసంగిన సన్నివేశములతో గ్రంథమును ఆరంభింపుము. నీవు రచించుట మొదలు పెట్టినతరువాత విషయ మంతయు నీకు క్రమముగా గోచరించును దినమునకు నాలుగు అధ్యాయములచొప్పున ముప్పది యాఱుదినములలో దీనిని పూర్తిగావింపుము. ఇది మాహాత్మ్యఖండము జ్ఞాన ఖండము చర్యాఖండము అను మూఁఢుఖండములతో పండ్రెండువేల శ్లోకములతో రూపొందును.''
ఇట్లు సుమేధుని ఆదేశించి చతుర్ముఖుఁడు నారదునితో, ''ఈయద్భుతమైన గ్రంథమునకు ఇతఁడు మొదటివక్త. నీవు మొదటి శ్రోతవు'' అని చెప్పి వారిద్దఱి పూజితుఁడై అంతర్ధానము నొందెను. నారదుఁడు సుమేధునిచే పూజితుఁడై వెడలిపోయెను. వారిరువురు వెడలిపోయినంతనే మహాత్ములసాంగత్యము గడచిపోయెనని సుమేధుఁడు కొంచెము కలఁతనొంది వేగవతీనదికి పోయి స్నానసం ధ్యాదివిధుల నిర్వర్తించి శ్రీమీనాక్షీసుందరేశ్వరులను గణపతిని పూజించి గురుదేవుఁడగు భార్గవరాముని పరమగురువులగు దత్తాత్రేయమహావిష్ణుపరమేశ్వరులను స్మరించి స్వర్ణపద్మినీతీరమున గ్రంథరచనమును ఆరంభించెను. ''ఓం నమః కారణానంద హృద్బీజాకాశగాత్రిణీ'' అని మొదలుపెట్టి, ''సా భ##వేత్త్రిపురైవహ్రీమ్'' అని యతఁడు గ్రంథమును ముగించెను. ఓంకారము శివప్రణవమను హ్రీంకారము శక్తి ప్రణవము. శివప్రణవముతో అరంభ##మై శక్తి ప్రణవముతో ముగిసి రెండు ప్రణవముల మధ్యమున నిబద్ధమైయున్న యీగ్రంథము ప్రణావత్మక మయ్యెను.
పిదప నొకనాఁడు నారదమహర్షి సుమేధుని చూడవచ్చెను. సుమేధుఁడు ఆయనకు ఎదురేగి ప్రణమిల్లి అర్ఘపాద్యాదులతో పూజించి చేతులు జోడించి యిట్లనెను. ''దేవర్షీ! నీ యనుగ్రహముచేత సర్వము చక్కఁగా తెలిసికొంటిని. పరమేష్ఠి వచించినట్లు త్రి పురారహస్యమును పూర్తి యొనర్చితిని. నేను నీకు శిష్యుఁడను ఇంక నేను ఏమి చేయవలయునో ఆజ్ఞాపింపుము. మహాత్ముఁడ వైన నీకృపచేతనే కదా నాకు ఈవిజ్ఞానముకలిగినది.'' ఇట్లు పలుకుచు సుమేధఁడు సాష్టాంగముగా ప్రణమిల్లెను. నారదుఁడతనిని లేవఁదీసి గాఢముగ కౌగిలించుకొని ఇట్లనెను. ''హారితాయన! నీవు ధన్యుఁడ వైతివి త్రిపురాపాదభక్తి వలన నీకు ఇట్టి విజ్ఞానసంపత్తి కలిగినది. కావుననే నీవు త్రిపురారహస్యమును రచింపఁగలిగితివి. ఆగ్రంథమును వినుటకే నేను నీదగ్గరకు వచ్చితిని నాకు దానియందు శ్రద్ధ కలదు. కావున నాకు దానిని సమగ్రముగా వినిపింపుము'' ఆమాటలను విని సుమేధుఁడు త్రిపురాదేవిని స్మరించి కన్నులు ఆనందాశ్రువులతో నిండుచుండ గద్గదకంఠముతో ఆమహర్షితో నిట్లనెను, ''మహర్షీ! నీవు బ్రహ్మ పుత్రుఁడవు; సర్వజ్ఞుఁడవు. శిష్యునివంటివాఁడనైన నావలన కూడ నీవు వినఁగోరుచున్నావన్నచో మహాత్ములు పిన్నలయెడ ఎంత వాత్సల్యము కలిగియుందురో వ్యక్త మగుచున్నది. మాత్సర్యరహితులై బాలురనుండి కూడ సుభాషితమును వినఁగోరుచుండుట సజ్జనులకు సహజము. ఇంక అమృతోపమానమైన త్రిపురారహస్యమునుగూర్చి చెప్పవలసిన దేమున్నది? మణిపాత్రయం దున్నను మట్టి పాత్రయం దున్నను ద్రాక్షాఫలమునకు మాధుర్యమున భేదము కలుగదు. కావున బ్రహ్మవచనము ననుసరించి నీయాజ్ఞను శిరసావహించి త్రిపురారహస్యమును మనయిరువురి సంవాదరూపముగా చెప్పుచున్నాను. వినుము.
బ్రహ్మపుత్రుఁడు భృగువు. ఆయనకు చ్యవనుఁడు జన్మించెను. ఆమహర్షివలన ఋచీకుఁడు ఉద్భవించెను. గాధిరాజు తన పుత్రికయైన సత్యవతిని ఋచీకున కొసంగి తనకు పుత్రుఁడు కలుగునట్లు అనుగ్రహింపు మని ప్రార్థించెను. ఆయన తపశ్శక్తి చేత సత్యవతికొఱకు బ్రహ్మతేజఃపూర్ణమైన యొకపాయసమును, ఆమెతల్లికొఱకు క్షాత్రతేజఃపూర్ణమైన మఱియొక పాయసమును నిర్మించెను. సత్యవతి కొసంగకినపాయసము అధికశక్తిమంతమై యుండునని ఆమె తల్లి, గాధిరాజపత్ని, పుత్రికకు తెలియకుండ ఆమెపాయసము తాను గైకొని తన పాయసమును ఆమెకు ఇచ్చెను. ఋచీకుఁడు ఇది యెఱింగి, "నీకు కాలాంతకుఁడైన మహారాజు, మీయమ్మకు బ్రహ్మర్షియు జన్మింతురు" అని సత్యవతికి చెప్పెను. ఆమె భిన్నురాలై తన కుమారుఁడు క్షత్రియస్వభావుఁడు కాకుండునట్లు చేయు మని భర్తను ప్రార్థించెను. ఆయన ప్రసన్నుఁడై, "అట్లయినచో నీకుమారుఁడు శాంతుఁడే అగును. అయినను వానిపుత్రుఁడు సర్వక్షత్రియాంతకుఁడైన మహారాజు కాక తప్పదు" అని పలికెను తరువాత కొంతకాలమువరకు సత్యవతికి జమదగ్ని, ఆమెతల్లికి విశ్వామిత్రఁడును జన్మించిరి. జమదగ్నికి పరశురాముఁడు కలిగెను. పాయసములప్రభావముచేత విశ్వామిత్రుఁడు బ్రహ్మర్షి కాఁగా, పరశురాముఁడు క్షత్రియాంతకుడైన మహారాజయ్యెను. ఆయన శ్రీరామచంద్రునిచే పరాజితుఁడై మిగుల నిర్వేదముతో తిరిగివచ్చుచు మార్గమధ్యమున సంవర్తుని గాంచి, "సంసారదుఃఖపీడితుఁడనైన నాకు దయతో శుభమార్గమును చూపుము" అని ప్రార్థించెను. ఆయన ఆత్మతత్త్వమును సంగ్రహముగా చెప్పి, "ఇది త్రిపురాదేవియొక్క అనుగ్రహముచే తనే చక్కఁగా బోధపడును. నీవు అందులకై గురువపర్యుఁడైన దత్తాత్రేయుని ఆశ్రయింపుము" అని అదేశించెను. వెంటనే భార్గవరా
ముఁడు దత్తాత్రేయుని శరణుఁజొచ్చెను. ఆయన భార్గవునకు త్రిపురామాహత్మ్యమును బోధించి మంత్రదీక్ష నొసంగెను. భార్గవుఁడు పండ్రెండుసంవత్సరములు త్రిపురాదేవి నుపాసించి సిద్ధిని పొందిన తరువాత దత్త గురువు ఆయనకు ఆత్మతత్త్వమును దేవీచర్యావిధానమును ఉపదేశించెను.
ఇట్లు భగవంతుఁడగు దత్తత్రేయుఁడు భార్గవునకు ఉపదేశించినప్రకారమున సుమేధుఁడు నారదమహర్షికి త్రిపురారహస్యమును చెప్పెను. పిమ్మట త్రిపురారహస్యము గురుశిష్యుపరంపరతో లోకమున ప్రసిద్ధమయ్యెను .
పైవృత్తాంతమును గమనించినచో లోకమున నేదియు యాదృచ్ఛికముగా (Accidental) సంభవింప దని, తగినంత కారణసామగ్రి లేకుండ కార్యము పుట్ట దని, (There can be no effect without sufficient cause) స్పష్టమగుచున్నది. ఒకఁడు సామాన్యుఁడై యుండి లక్షలకొలఁది ధనము నార్జించుట, వేఱొకఁడు సామ్రాజ్యమును సంపాదించుట, మఱియొకఁడు ఆచద్రార్కముగా నిలుచునట్టి మహాగ్రంథమును రచించుట మొదలగు సంఘటనము లన్నియు తగినంత కారణము లున్నప్పుడే సంభవించునని యాదృచ్ఛికముగా సంభవింప వని స్పష్టముగా గ్రహింపవలసియున్నది ఇప్పుడు తగినంత సాధన సంపత్తి వారియందు కన్పింపకున్నచో వారు పూర్వజన్మలలో అట్టి సాధనములను సంపాదించియుండి రని యూహింపవలె. నారదాదిమహర్షులు వేలయేండ్లు తపస్సులు చేసిరి. వారిదృష్టితో చూచినప్పుడు సుమేధుఁడు గావించినతపస్సు అల్పమే. కాని అతనికి ఈయున్నతి కలుగుటకు ఈజన్మలో అతఁడు చేసినతపస్సు మాత్రమే కారణము కాదు. అనేక జన్మలపుణ్యమునకు ఫలముగా అతఁడు దేవీభక్తుఁడైన సుమంతునకు అలర్కుఁడుగా జన్మించి అభిందుకమైన బీజాక్షరమును అజ్ఞానముతో నైనను జపించినట్లుగా ఉచ్చరించుచుండెను. మనుష్యజన్మమునకు కారణమైన కర్మయందు పుణ్యముతో పాపము కలసియే యుండును. అందువలన ఒకానొక పాపప్రారబ్ధము ప్రబలమై పుణ్యఫలమును వెనుకకు నెట్టినది. అందువలన అయిందేండ్ల ప్రాయముననే అలర్కుఁడు వ్యాధిచే పీడితుఁడై మరణిఁచెను అంతటితో ఆపాపప్రారబ్ధము క్షీణించి పుణ్యఫలము పైకివచ్చి అతఁడు హారితాయనుఁడుగా జన్మించి భగవంతుఁడైన భార్గవునకు శిష్యుడై, పూర్వజన్మలోని కొఱఁత తీరునట్లుగా, శ్రీవిద్యను యథావధిగా ఉపదేశమును పొంది దేవీప్రసాదమునకు పాత్రుఁడయ్యెను. "యోగి అనేకజన్మలలో సంసిద్ధుఁడై పిమ్మట పరమగతిని పొందును" అని గీతయందు భగవంతుఁడు చెప్పనసూక్తికి సుమేధుని వృత్తాంతము చక్కని దృష్టాంతముగా నున్నది. అంతే కాదు. అర్థమైనను కాకున్నను రామాయణాదులైన ఉత్తమగ్రంథములను వినుచు పఠించుచున్నచో ఆ గ్రంథములోని యక్షరసంపుటియొక్క ప్రభావముచేతనే మహాప్రభావము కలుగునని గ్రహింపవలసియున్నది. సుందరకాండపారాయణము మొదలగునని యిట్టివే.
ఈజన్మలో కలుగుచున్న ఫలసిద్దికి ఈజన్మలో చేసినసాధనములే కారణము కాదు అనుటకు పరశురామవిశ్వామిత్రుల వృత్తాంతములు కూడ దృష్టాంతములే. పరశురాముడు శివుని అరాధించి ధనుర్విద్యయందు పారంగతుఁడై క్షత్రియనిర్మూలనము గావించి మహారాజై తుదకు మహాయోగి యయ్యెను. దీనికంతకును ఋచికమహర్షి తపశ్శక్తిచే నిర్మించిన పాయసముయొక్క ప్రభావమే ప్రధానకారణము. పరశురాముఁడు కావించిన విద్యాభ్యాసము నిర్వహించిన యజ్ఞయాగములు దీక్షతో చేసిన దేవీయుపాసనము గురుశుశ్రూష మొదలగునవి యన్నియు ఆ పాయసప్రభావమును అభివ్యక్త మొనరించుటకే (Manifest) సాధనము లయ్యెను. అట్లే విశ్వామిత్రునకు బ్రహ్మర్షిత్వము కలుగుటకు కూడ పాయసప్రభావమే ప్రధానకారణము. ఆయన కావించిన తపస్సంతయు ఆ ప్రభావమునకు సిద్ధి కలిగించుటలో అనుషంగికమైన కారణమే (Attendant cause) అయినది అచట స్పష్టము. ఆపాయసముయొక్క ప్రభావమే లేకున్నచో కేవలమైన తపస్సుచేత ఆయన బ్రహర్షియగుట దుర్ఘటము. ఇది జ్ఞానఖండమున గండశైలాఖ్యనమునందలి తంగణునివృత్తాంతమువలన కూడ వ్యక్త మగుచున్నది.
మార్కండేయమహర్షి బ్రహ్మలోకమునకు పోయి సర్వవిజ్ఞానమునకు సారమేది అని అనేకులను అడుగుట, వారందఱును తమకు అభిమతములైన సిద్ధాంతములను భిన్నభిన్నముగా చెప్పుట, ఆయనకు ఆవిషయమున నిశ్చయము కుదురక బ్రహ్మదేవుని ప్రశ్నించుట గమనింపఁదగియున్నది. బ్రహ్మలోకమునకు పోయినను ఆత్మతత్త్వమున అందఱకును నిశ్చితమైన జ్ఞానము ఉండ దనుట స్పష్టము. ఈ లోకమున ఆత్మసాక్షాత్కారము నొందినవారు ఇక్కడనే ముక్తులగుదురు. వారు ఏలోకమునకును పోరు. ఈలోకమున ఆత్మజ్ఞానమును పొందక ఉపాసనలు తపస్సులు చేసినవారు బ్రహ్మలోకమునకు పోవుదురు. సకల విజ్ఞానమునకు సార మేది? అని వారిని ప్రశ్నించినచో వా రంతకుపూర్వము ఏయే ఉపాసనలు శ్రేష్ఠములని నిశ్చయించుకొని సాధించిరో అయుపాసనావిషయములనే సర్వశ్రేష్ఠములనుగా వర్ణించి చెప్పుదురు. అందువలన మార్కండేయునకు నిశ్చయము ఏర్పడక బ్రహ్మదేవునే అడిగెను. జ్ఞానఖండమున విద్యాగీతయందు కూడ ఇట్టి సదర్భమే యున్నది.
పై వృత్తాంతము ననుసరించి హారితాయనుఁడు ముప్పదియాఱుదినములలో దినమునకు నాలుగధ్యాయముల చొప్పున మొత్తము నూటనలువదినాలుగు అధ్యాయములు రచించెననుట స్పష్టము. ఇప్పుడు లభ్యమగుచున్న గ్రంథమునందు మహాత్మ్యఖండమున ఎనుబదియధ్యాయములు 6687 శ్లోకము లున్నవి. జ్ఞానఖంéడమున ఇరివదిరెండు అధ్యాయములలో 2163 శ్లోకము లున్నవి. చర్యాఖండము కన్పించుటలేదు. దానియందు నలువదిరెండు అధ్యాయములు 3150 శ్లోకములను ఉండవలె. మాహాత్మ్యఖండమును సాంఖ్యయోగశాస్త్రాచార్యులు పండిత శ్రీ ముకుందలాలశాస్త్రిమహోదయులు సంశోధింపఁగా సాహిత్యాచార్యులు పండిత శ్రీ నారాయణశాస్త్రీఖిస్తే మహాశయలు భూమికతో అధ్యాయానుక్రమణికతో క్రి.శ. 1932లో వారణాసి చౌఖాంబా సంస్కృతప్రకాశనాలయమున కాశీసంస్కృత పుస్తకమాలయందు పురాణతిహాసవిభాగమున ప్రథమపుష్పమునుగా ప్రకటించిరి. శ్రీఖిస్తేమహాశయులు భూమికయందు, "మొదటినుండి నలువదియధ్యాయముల వఱకునుగల చర్యాఖండము ఒకానొక శ్రీవిద్యోపాసకుని గృహమునందున్న దని వింటిని. కాని ఇంతవఱకును నేను దానిని చూచుట తటస్థింపలేదు" అని చెప్పిరి. పరిశోధకులు ప్రయత్నించినచో అది లభ్యము కావచ్చును. ఈమాహాత్మ్యఖండములోని ప్రధానకథలు సంక్షిప్తక్రమమున బ్రహ్మాండపురాణములోని యుత్తరఖండమునందలి లలితోపాఖ్యానమునందు లక్ష్మీతంత్రమునందు చెప్పబఁడి యన్నవని శ్రీవిద్యావిశేషముల త్రిపురోపనిషత్తునందు నిరూపింపఁబడిన వనిచెప్పుచు శ్రీఖిస్తేమహాశయులు ఈగ్రంథముయొక్క ప్రసిద్ధిని గూర్చి ఇట్లు చెప్పిరి. "ప్రాచీనగ్రంథములయందు ఈత్రిపురారహస్యము ఎచ్చటనైనను పేర్కొనఁబడియున్న దేమో అని అన్వేషించుచు నేను ఎచ్చటను ఇట్టిప్రస్తావమును కాంచనైతిని. బ్రహ్మసూత్రములందు "అపిచస్మర్యతే" అనుసూత్రమునకు శ్రీశంకర భగవత్పాదులవారు రచించిన భాష్యమును, "సంవర్తుఁడు మొదలగువారియందు నగ్నముగా చరించుట మొదలైన వర్తనము కన్పించుచుండుటవలన ఆశ్రమకర్మలను అపేక్షింపనివారు కూడ మహగోయోగులై యుండవచ్చు నని ఇతిహాసము నందు స్మరింపబడుచున్నది'' అని సంవర్తుని విషయము పేర్కొనఁబడియున్నది. సంవర్తుఁడు అట్లు నగ్నుఁడుగా కన్పించుట త్రిపురారహస్యమునందే ప్రస్తావింపఁబడియున్నది. గ్రంథమును పేర్కొన కున్నను అందలికథను ప్రస్తావించుటచే భగవత్పాదులవారు త్రిపురారహస్యమును ప్రామాణికగ్రంథమునుగా అంగీకరించిరని తోఁచుచున్నది"
జ్ఞానఖండమునకు మహర్షితుల్యుఁడైన శ్రీనివాసపండితుఁడు తాత్పర్యదీపిక యనువ్యాఖ్యను కలియుగవత్సరముల 4932లో (కి.శ. 1831) సమగ్రముగా రచించెను. ఆయన దక్షిణదేశమున మహాపుష్కర గ్రామనివాసియైన వైద్యనాథదీక్షితునికుమారుండు. ఈవ్యాఖ్యానమతో జ్ఞానఖండమును సంశోధించి కాశికారాజకీయపాఠశాలాప్రధానాధ్యాక్షులు శ్రీ గోపినాథకవిరాజమహోదయులు విపులమైన యుపోద్ఘాతముతో 1925లో ''ప్రిన్స్ ఆఫ్ వేల్స్ సరస్వతీభవన్ సీరీస్'' అను పుస్తకమాలయందు నాలుగుభాగములుగా ప్రకటించిరి. శ్రీనివాసపండితుడు తక్కిన రెండుఖండములకు తాత్పర్యదీపికను రచించెనో లేదో తెలియదు.
దేవికి త్రిపుర అనుపేరు ఎట్లు కలిగిన దనువిషయము గ్రంథమునందు ఎక్కడను స్పష్టముగ వివరింపబడలేదు. విద్యాగీతసందర్భమున శ్రీనివాసపండితుడు ''త్రిపురసుందరరూపమును నిర్వచించుచు, జాగ్రద్దశ స్వప్నము సుషుప్తి అనుమూడుపురములందు విలసిల్లుచు సర్వజనులకు అభిలషణీయ మగుటచే దేవియొక్క రూపము త్రిపురసుందర మగుచున్నది. (త్రిషు పురేషు ధామసు జాగ్రత్స్వప్న సుషుప్తి రూపేషు సుందరం సర్వస్పృహణీయత్వాత్)'' అని వివరించెను. అనంగా ఆ మూఁడుదశలకు సాక్షిగా మనయుందున్నయాత్మచైతన్యమే త్రిపుర సుందరి యని స్పష్టమగుచున్నది. బాల్యము ¸°వనము మొదలగువాని వలనే జాగ్రత్స్వప్న సుషుప్తులు కూడ కాలవశమున వ్యవహారమునందు ఏర్పడుచున్నదశలు. వీనిని పురములనుగా చెప్పుట ప్రసిద్ధముగా లేదు. శరీరములను పురములనుగా చెప్పుట ప్రసిద్ధముగా నున్నది. భగవంతుండు గీతయందు శరీరమును నవద్వారములుగల పురమునుగా చెప్పెను. (నవద్వారపురే దేహీ నైవ కుర్వన్ న కారయన్) జనులచే పూరింపబడుప్రదేశములు పురములు (జనైః పూర్యన్తే ఇతి పురాణి). అట్లే సుఖదుఃకాదులచేత పూరింపండుచున్న శరీరములను కూడ పురము లని చెప్పవచ్చును. కావున స్థూలసూక్ష్మకారణ శరీరములు అను పురములు ఏయాత్మశక్తికి కలవో ఆయాత్మశక్తియే త్రిపుర అని చెప్పుట సమంజసము. (త్రీణి పురాణి యస్యాః సా త్రిపురా). రాజు తనపురము లలో ఎన్నింటియందు పర్యటించుచున్నను అతని స్వరూపస్వభావములందు మార్పు ఎట్లు ఉండదో, అట్లే ఈ మూడుశరీరములందు వ్యాపించియున్న యాత్మశక్తియైన త్రిపుర ఏకరూపముగనే యుండును.
మఱి త్రిపురాశక్తి జీవులశరీరములందు మాత్రమే వ్యాపించియున్నదా? ఆ దేవి విశ్వాత్మిక కదా! హారితాయనునకు త్రిపురాశబ్దమును ఇట్లు పరిమితమైన యర్థమున గ్రహించుట ఇష్టము కాదు. బాలాంబిక స్వప్నమున దర్శనమొసంగినప్పుడు ఆయన ఆమెను స్తుతించుచు త్రిపురాశబ్దమును ఇట్లు సంక్షిప్తముగా నిర్వచించెను. ''మూఁడు మూఁడు క్రమములచేత ఉల్లాసమును పొందుచున్న వస్తువుయొక్క పూర్వస్థితిగ నీవు ఎందువలన అగుచున్నావో అందువలన బ్రహ్మాదులకు పరమమైన యాశ్రయ మగుచు లోకమునందు త్రిపుర అని చెప్పబఁడితివి. ''
శ్లో|| లోకే త్రిత్రిక్రమోల్లాసివస్తుపూర్వస్థితి ర్యతః |
త్రిపురేతి తతః ప్రోక్తా బ్రహ్మాదీనాం పరాశ్రయా|| 62
మాహాత్మ్యఖండము - ప్రథమాధ్యాయము.
దీనిని ఇట్లు గ్రహింపవచ్చును. వస్తు వనఁగా ఆత్మ అది సృష్టికి ఉన్ముఖమయినప్పుడు మొదట ఏర్పుడుస్థితి వస్తుపూర్వస్థితి. ఆత్మయందు దానియొక్క శక్తియైనమాయ దానికన్న భిన్నముగా నున్నట్లు గోచరించుటయే ఆత్మయొక్క పూర్వస్థితి లేక ప్రథమస్థితి. ఆ మాయాశక్తి సృష్ట్యారంభదశయందు మూఁడు మూఁడుగా పదార్థములను భాసింపఁజేసి వానియందు వర్తించుచున్నట్లుగా క్రీడించుచుండును. అందువలన ఆమాయాశక్తి వస్తుపూర్వస్థితియు త్రిత్రిక్రమోల్లాసినియు అగుచున్నది. త్రిత్రిక్రమోల్లాసిని యుగుటచే ఆమె త్రిపుర యనిచెప్పఁబడుచున్నది. క్రమ మనఁగా ప్రసరణము లేక ప్రవేశము. ''జగత్తును సృష్టించి ఆత్మ దానియందు తానే ప్రవేశించెను'' (తత్సృష్వా తదేవానుప్రావిశత్) అని శ్రుతి చెప్పుచున్నది. మూఁడేసిగా పదార్థములు భాసించుచుండుట వ్యష్టిగా (Individually) సమష్టిగా (Universally) అనేకవిధములుగా నున్నది వ్యష్టియందు జీవులలో స్థూలసూక్ష్మకారణశరీరములు ఎట్లున్నవో అట్లే సమష్టియందు విరాట్టుయొక్క శరీరము హిరణ్యగర్భశరీరము అవ్యాకృతశరీరము కలవు. తరువాత బ్రహ్మవిష్ణుమహేశ్వరులయొక్క సరస్వతీలక్ష్మీ పార్వతులయొక్క శరీరములు కూడ ఏర్పడుచున్నవి. మాహాత్మ్యఖండములో త్రిపురాదేవి వీరిని సృష్టించి విశ్వ పరిపాలనకై (Administration of the Universe) అధికారపదవులయందు నిలుపుట వర్ణింపఁబడియున్నది. కావున సృష్టిని క్రీడామాత్రముగ జరుపుచున్న యాపరాశక్తి మొదట మూఁడేసి మూఁడేసి పదార్థములను భాసింపఁజేసి అవి పురములుగా వానియందు విహరించుచు ఉల్లాసమును పొందుచు త్రిత్రికరమోల్లాసినియై త్రిపుర యని లోకమున కీర్తింపఁబడుచున్నది. దీనిని సంస్కృతమున ఇట్లు వివరింపవచ్చును. ''వస్తునః ఆత్మనః పూర్వా ప్రథమా స్థితిః వస్తుపూర్వస్థితిః ఆత్మనః సృష్ట్యున్ముఖత్వే తదభిన్నాయాః మాయాయాః అభివ్యక్తిః ప్రథమాస్థితిః సా చ త్రిత్రిక్రమోల్లాసినీ - త్రిభిః త్రిభిః క్రమైః స్థూలసూక్ష్మ కారణ శరీరేషు విరాడ్ఢిరణ్యగర్భావ్యాకృతమూర్తిషు బ్రహ్మవిష్ణుమహేశ్వర వాణీలక్ష్మీ పార్వతీరూపేషు చ క్రమైః క్రమణౖః ప్రసరణౖః ఉల్లసతీతి త్రిత్రిక్రమోల్లాసినీ| త్రిత్రిక్రమోల్లాసినీ చ అసౌ వస్తుపూర్వస్థితి శ్చ త్రిత్రిక్రమోల్లాసి వస్తు వూర్వస్థితిః యతః త్వం త్రిత్రిక్రమోల్లాసివస్తువూర్వస్థితిః అసి తతః బ్రహ్మాదీనాం పరాశ్రయా త్రిపురా ఇతి లోకే ప్రకీర్తతా''
ఆత్రిపురాదేవికి సంబంధించినవిజ్ఞాన మంతయు రహస్యమే. గురువులు యోగ్యులైన శిష్యులకు ఏకాంతమునందు బోధించునది రహస్యము. విజ్ఞానము, నేఁటి శాస్త్రపరిజ్ఞానమువలె సర్వజనులకు లభ్యము కావలయును గాని రహస్యముగా నుంచుట యేమి? గురువులు కొందఱకు ఆ విజ్ఞానమును బోధించి మఱి కొందఱను అజ్ఞానములో ఉంచుట పక్షపాతము కాదా? విద్యాగ్రహణమునకు శిష్యునియందు అధికారము లేక అర్హత (Qualification) ముఖ్యము. అది నేఁఁడు కూడ విజ్ఞానవిషయములందు అవలంబింపఁబడుచునే యున్నది. ఎన్నో యేండ్లు విద్యాభ్యాస మొనర్చి ఎన్నో పరీక్షలలో ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకే ఈనాఁడు కూడ ఉన్నతశాస్త్రబోధనకక్ష్యలలో(M.Sc, M.s. etc) ప్రవేశము లభించుచున్నది సామాన్యవిద్యార్థులకు ప్రవేశము నొసంగరు. ఎందువలన? ఆవిజ్ఞానమును చక్కఁగా గ్రహింపఁగలిగిన సామర్థ్యము వారికి ఉండదు. ఎవరైనను చాల కుతూహలముతో మాకు ఆశాస్త్రబోధనకక్ష్యలలో (Post Graduate classes of sciences) ప్రవేశమును కలిగింపుఁ డన్నచో, దానికి తగినయర్హతను ముందుగా సంపాదించుకొనుఁ డనియే చెప్పుచున్నారు. అట్లు అర్హతను సంపాదించుకొన్నవారిని ఆకక్ష్యలలో చేర్చుకొని బోధించుచునే యున్నారు. ఆ కక్ష్యలలో కూడ కొందఱు విద్యార్థులు ప్రత్యేకముగా ఆచార్యులను కలిసికొని (Meeting the professors privately) ఆయాశాస్త్రములలోని విశేషములను తెలిసికొనుచుండుటయు ప్రసిద్ధమే. మఱి తక్కిన విద్యార్థులకు ఆ విశేషములను బోధింప నక్కఱ లేదా? వారికిని కుతూహలము గ్రహింపగలిగిన సామర్థ్యము కలిగినప్పుడు బోధింతురు. విద్యార్థియొక్క అర్హతనుబట్టి బోధించుట గురువునకు ముఖ్యలక్షణము. అట్లు గాక అన్నివిషయములను అందుఱకును బోధించుటవలన కొందఱకు ఆ విశేషములు బోదపడక నిరుత్సాహము నిర్వేదము కలుగవచ్చును లేదా తప్పుగా అర్థము చేసికొన్నచో జ్ఞానఖండములోని కువలునివృత్తాంతమునందువలె భంగపాటు కలుగవచ్చును. కావుననే పరశురామునకు కూడ సంవర్తుఁడు కాని దత్తాత్రేయుఁడు కాని అడిగినసందేహములకు వెంటనే సమాధానమును చెప్పలేదు. పండ్రెండేండ్లు త్రిపురాదేవి నుపాసించిన తరువాత దత్తాత్రేయుఁడు పరశురామునకు ఆత్మజ్ఞానమును సవిశేషముగా నుపదేశించెను. అట్లే పరశురాముఁడు కూడ సుమేధునకు పదునాఱుసంవత్సరములు శుశ్రూష చేసినతరువాత బాలామంత్రము నుపదేశించి, దానియుందు సిద్ధిని పొందినతరువాతనే త్రిపురారహస్యమును ఉపదేశించెను.
ఈగ్రంథమును భగవాన్ శ్రీరమణమహర్షులవారు సాధకులకు అత్యంతోపకారకమైనదానినిగా ప్రశంసించుచు ఇందలి కథలను విషయములను తఱచుగా ప్రస్తావించుచుండిరి. కుర్తాళమున శ్రీసిద్ధేశ్వరీపీఠమునకు ప్రథమపీఠాధిపతులైన జగద్గురువులు శ్రీశ్రీశ్రీవిమలానందభారతీస్వామివారు కూడ ఈగ్రంథములోని విషయములను మిక్కిలి ఆదరముతో శిష్యులకు బోధించుచుండిరి. మావియ్యంకులు విమలానందభారతీ పత్రికాసంపాదకులు శ్రీకారుమంచి కొండలరావుగారు చిరకాలము శ్రీస్వామివారియొద్ద శుశ్రూష గావించిరి. వారు ఈగ్రంథమునుగూర్చి ప్రస్తావించుచు, ''త్రిపురారహస్యము భగవద్గీతకన్నను సాధకులకు మిగుల సులభము ఉపయోగకరము లని తోఁచుచున్నది'' అని చెప్పిరి. రెండు గ్రంథముల పద్ధతిని పరిశీలించినచో ఈమాట నిజమే యనిపించును. అర్జునుఁడు ఎన్నో ప్రశ్నలను అడుగగా భగవంతుఁ డెన్నో విషయములను వివరించెను. ఆయన ఉపనిషత్తులు అను గోవులనుండి పాలను పితికినట్లుగా తత్త్వవిషయములను పెక్కింటిని గ్రహించి అద్భుతముగా బోధించెను. కాని వానిని విన్న తనువాత అర్జునుఁడు వానినిగూర్చి మననము నిదిధ్యాసనము గావింపలేదు వెంటనే అతఁడు యుద్ధము చేయవలసివచ్చెను. పిమ్మట ధర్మజుని పట్టాభిషేకము అశ్వమేధము మొదలగునవి సంభవించెను. ఆ కార్యములవేగముచేత వానియందునిమగ్నుఁడై శ్రీకృష్ణుఁడు చెప్పినవిషయములను ఇంచుమించుగా విస్మరించెను. అట్లు కాక ఆ విషయములనుగూర్చి మననము నిదిధ్యాసనము కావించుటకు అవకాశము కలిగియున్నచో అతనికి అనేకసందేహములు కలిగి మరల శ్రీకృష్ణుని ప్రశ్నించియుండెడివాఁడు. ఒకసారి విన్నంతమాత్రమున తత్త్వము నిస్సందేహముగా బోధపడుట దుర్ఘట మని సూచించుచు భగవంతుఁడు, ''తత్త్వమును దర్శించినజ్ఞానులు నీకు జ్ఞానమును ఉపదేశింపఁగలరు'' (ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వ దర్శినః) అని అర్జునునకు చెప్పెను. అనఁగా తాను చెప్పిన విషయములను విన్న తనువాత అర్జునుఁడు ఆవిషయములనుగూర్చి గాఢముగా చింతన మొనర్చి పెద్దలవలన సందేహములను తీర్చుకొనుచు సునిశ్చితముగా తత్త్వమును తెలిసికొనవలయు నని (వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః) ఆయనయభిప్రాయము. కాని అర్జునున కది కుదురలేదు. ఆతఁడావిషయములను మఱచిపోయి మరల బోధింపు మని శ్రీకృష్ణుని ప్రార్థించెను. అప్పు డాయన మరల తత్త్వమును సంగ్రహముగా బోధించెను. ఈసంవాదము అనుగీత అనుపేరుతో ప్రసిద్ధమై యున్నది. ఇది రెండవసారి అర్జుఁనుడు గావించినశ్రవణము. తరువాత శ్రీకృష్ణుఁడు ద్వారకకు వెడలిపోయెను. అర్జునుఁడు మనననిదిధ్యాసనములను గావించియుండవచ్చును. కాని అతఁడు ఏవిధముగా చింతనము గావించెనో, ఎట్టిసందేహములు కలిగెనో ఆసందేహములకు ఏమి సమాధానములను పొందెనో గ్రంథములలో కన్పించుట లేదు. మఱి భార్గవరామునివృత్తాంతము ఇందులకు భిన్నముగా నున్నది. అర్జునునకు కలిగిని విషాదముకన్నను భార్గవునకు కలిగిననిర్వేదము మిగలు తీవ్రమైనది. తనకు ఇష్టులైన బంధువులు గురువులు మిత్రులు యుద్ధమున నశింతు రేమో అనుభావనవలననే (Imagination) అతనికి విషాదము కలిగెను. అది అప్పటికి ఊహమాత్రమే. పరశురామునివిషయము అట్టిది కాదు. శ్రీరామునివలన ఆయన చిరకాలము తపస్సుచేసి ఆర్జించినపుణ్యలోకము లన్నియు క్షణకాలమున దగ్ధములైనవి. అంతే కాదు ''నన్ను మించిన వీరుఁడెవ్వంఁడును ఈలోకమున లేఁడు'' అనుగాఢమైన యభిమానము కూడ, పిడుగుపడినప్పుడు కొండవలె, బగ్నమయ్యెను. అప్పుడాయనకు కలిగిననిర్వేదము దుఃఖము ఇంత యని చెప్పుటకు వీలులేనిది. ఆపరితాపమును తొలఁగించి శాంతిని కలిగింపు మని ఆయన సంవర్తుని ప్రార్థించెను, సంవర్తుఁ డతనిని దత్తగురువునొద్దకు పంపెను. చిత్తశాంతికి సాధనమైన జ్ఞానము కావలయునన్నచో త్రిపురాదేవి నుసాసింపు మని దత్తగురువు చెప్పెను. అప్పుడు పండ్రెండుసంవత్సరములు త్రిపురాదేవి నుపాసించి మరల గురువునొద్దకు వచ్చి ఎన్నో విషయములను ప్రశ్నించెను. ఆవిషయములనువిని పరశురాముఁడు వానిని గూర్చి మననము గావించి అప్పుడు కలిగిన సందేహములను మరల అడిగెను. అర్జునునకువలె ఆయనకు మనననిదిధ్యాసనములకు ప్రతిబంధకములైన కార్యములు ఏమియును లేవు. ఆయన సకలవ్యవహారములను వదలి గురుశుశ్రూష చేయుచు విన్నదానిని వెంటనే మననము చేయుచు నిశ్చితమైనజ్ఞానమును పొందెను. హేమచూడుడు మొదలగువారి వృత్తాంతములయందు కూడ ఆత్మజ్ఞానమునకై ప్రత్నించుచున్నవారికి సాధనదశలో ఎన్ని విధములైన సందేహములు కలుగవచ్చునో వానిని గురువులు ఎట్లు తొలఁగించి నివ్చితమైనజ్ఞానమును కలిగింతురో మిగుల స్పష్టముగ వర్ణింపబడియున్నది. అందువలన ఈగ్రంథము విశిష్టముగా నున్నది.
ఏమైనను యోగవాశిష్ఠము మొదలైన గ్రంథములకు కలిగినంత ప్రచారము దీనికి కలుగ లేదు. సామాన్యులు కేవలము శ్రవణమననములకు ఉపయోగించు గ్రంథములను ఆదరించునట్లు మంత్రము తంత్రము ఉపాసనలు మొదలగువానిని గూర్చి చెప్పునట్టి గ్రంథములను ఆదరింపఁజాలరు. తాంత్రికపూజవిధానములందు ఆసక్తి కలవారు అఱుదుగా నుందురు. అట్టివారు గురుశుశ్రూషవలననే ఆవిషయములను గ్రహించుచుందురు. ఈకారణముచేతనే ఈగ్రంథములో కూడ జ్ఞానకండమున కున్న ప్రచారము తక్కినఖండములకు లేదు. చర్యాంఖండము అదృశ్యమే అయినది. మాహాత్మ్యఖండము వ్యాఖ్యకు నోచుకొలేదు. జ్ఞానఖండము మాత్రమే వ్యాఖ్యతో రెండుమూఁడు ముద్రణముల నొందినది. హారితాయనుడు మధురలో ఈగ్రంథమును రచించియుండుటవలన, పరశురాముఁడును మలయపర్వతనివాసి యగుటవలన ఈగ్రంథమునకు దక్షిణదేశమున ప్రచారముండుట సహజము. కావుననే ద్రవిడదేశీయుఁడైన శ్రీనివాసండితుఁడు దీనికి వ్యాఖ్య రచించెను. తమిళ మళయాళ కర్ణాటభాషలలో దీనికి అనువాదము లున్నవేమో తెలియదు. శ్రీరమణమహర్షులవారు దీనిని ఆదరించుటవలన శ్రీరమనానందసరస్వతీస్వామిగా ప్రసిద్ధులైన శ్రీమునగాల వేంకటరామయ్యగారు జ్ఞానఖండమునకు గావించినయాంగ్లానువాదమును శ్రీరమణాశ్రమమువారు 1959లో ప్రకటించిరి. అది తరువాత అనేకముద్రణముల నొందినది. ఇటీవల మఱియొక ఆంగ్లానువాదము ప్రకటింపఁబడినదని వింటిని. దానిని నేను చూడలేదు. శ్రీరమణ మహర్షిభక్తులలో ముఖ్యులు తత్త్వజ్ఞులు పండితులు ''కృష్ణభిక్షు'' అను పేరుతో ప్రసిద్ధులును కీర్తి శేషులును అయిన శ్రీఓరుగంటి వేంకటకృష్ణయ్యగారు B.A, B.L. జ్ఞానఖండమును ప్రతిశ్లోకానువాదమును తెనుఁగువచనమున రచించిరి. శ్రీవేదమాతృదంపతులయాదేశమున విద్యాప్రవీణ. భాషాప్రవీణ శ్రీబొద్దనవల్లి వీరభధ్రశర్మగారు విషయములు సుబోధకముగా తేటతెల్లముగా నుండురీతిని పై యనువాదమును సంస్కరించి ''సత్యవాణీప్రతిభ'' (సికింద్రాబాద్) అనుపత్రికయందు ధారావాహికగా ప్రకటించిరి. ఇంకను మఱియొక యనువాదము తెలుఁగున ప్రకటింపఁబడె నని వింటిని.
కీర్తి శేషులు తర్కవేదాంత విద్యాధ్యాపన పారీణులు, పూజ్యపాదులు బ్రహ్మశ్రీ చావలి లక్ష్మీకాంతశాస్త్రిగారి యొద్ద ప్రస్థానత్రయ భాష్యములను శాంతి పాఠపురస్సరముగా శ్రవణ మొనరించితిని. వారియనుగ్రహమున కలిగిన కొంచెము విజ్ఞానముతో ఈరచనకు పూనుకొంటిని. పెద్దలు ఈ సాహసమును మన్నింతురుగాక!
తత్త్వశాస్త్రగ్రంథములు కేవలము అనువాదముచేత సుబోధములు కావు. అందువలన నెల్లూరులోని శ్రీరమణసత్సంగమువారు ఈగ్రంథముయొక్క తాత్పర్యము సులభముగా బోధపడునట్లు తెలుఁగున రచింపు మని కోరిరి. ఇది యనువాదము కాదు. మూలములోనిసారమును వివరించుచు తాత్పర్యదీపికలోని విశేషములను ఇందు అచ్చటచ్చట చేర్చితిని. అట్లే ఆవశ్యక మని తోఁచినప్పుడు క్రొత్త దృష్టాంతములను కూడ నొసంగితిని పూర్వగ్రంథస్వరూపము తెలియుటకై మాహాత్మ్యఖండములోనిసారమును సంగ్రహముగా పీఠికయందు సమకూర్చితిని. విషయము సులభగముగా బోధపడుటకై పునరుక్తులను ఉపేక్షించితిని. రచనమున భ్రమప్రమాదములు సహజము. అట్టివానిని పెద్దలు తెలిపినచో సవరించుకొందును. నా కీయవకాశము నొసంగిన నెల్లూరు శ్రీరమనసత్సంగము వారికి, నిరంతరము ఈరచనమునకు నన్ను ప్రోత్సహించుచున్న పూజ్యులు మిత్రులునైన శ్రీ బిరదవోలు శ్రీరంగనాథముగారికి, దీనిని ప్రకటించుచున్న శ్రీరమణాశ్రమము (తిరువణ్ణామలై) వారికిని మిగుల కృతజ్ఞఁడను.
''బ్రహ్మవిద్యాలంకార'' తర్కవేదాంత విశారద ''మహోపాధ్యాయ'' ''గురుకుల సర్వోపద్రష్ట'' ఇత్యాది బిరుదవిరాజితులు బ్రహ్మశ్రీ ముదిగొండ వేంకటరామశాస్త్రిగారు అడిగినంతనే శ్రమయనుకొనక గ్రంథముపై దయతో అభిప్రాయనము నొసంగిరి. వారికి మిగులఁ గృతజ్ఞతతో అనేక ప్రణామము లర్పించుచున్నాను.
నెల్లూరు, సుధీవిధేయుఁడు
దుందుభి కార్తీకశుద్ధ ద్వితీయ పోలూరి హనుమజ్జానకీరామశర్మ
బుధవారము 17-11-1982.
No comments:
Post a Comment