✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
కామమునకు అధిపతి మన్మథుడు. ఈ మన్మథుని చేతిలో ఐదు బాణములు వుంటాయి. పంచపుష్పబాణుడు అంటారు వీటినే. పంచచామరములు.
ఆ పంచపుష్పబాణుడు ఏం చేస్తాడంటే, ఆ పుష్పబాణాలను ప్రయోగిస్తాడు. అవి కామప్రేరణ కలుగుతుంది. కోర్కె కలుగుతుందన్నమాట! ఆ కోర్కె ప్రభావం చేత, గుణ ధర్మాలు కలుగుతాయి.
గుణ ధర్మాల చేత విషయవాసనలు ప్రకోపిస్తాయి, ఆ ప్రలోభం చేత సుఖదుఃఖ ప్రలోభితులు కలుగుతుంది. ఆ సుఖదుఃఖ స్మృతుల ప్రభావం చేత, వాసనాబలం ప్రేరితమై తత్ రీతిగా మానవుడు జీవిస్తూ వుంటాడు.
ఇది జీవభావంలో వున్నటువంటి ప్రతిబంధకం. ఈ ప్రతిబంధకాన్ని పోగొట్టాలి అంటే, అనురాగం అనేటటువంటి స్థితినుంచీ ప్రేమ అనేటటువంటి స్థితికి మారాలి.
ఈశ్వరానుగ్రహం లేకుండా ఏ మానవుడు ఈ ప్రేమ అన్న స్థితిని తెలుసుకోలేడు. ఎవరికైతే ఈ నిర్వాణానుభవం లేదో, వారికి ప్రేమ మృగతృష్ణ వంటిది. అంటే అర్థం ఏమిటి?
ఎండమావిలో నీరు ఎంత సత్యమో, జీవభావంలో ప్రేమ అంత సత్యము. ఆత్మభావనలో, నిర్వాణ సుఖంలో, నిర్వాణానందంలో ఏ స్థితి అయితే కదలక, మెదలక స్థిరంగా, సమంగా ద్వంద్వ ప్రవృత్తులకు లోబడకుండా వుంటుందో, దాని పేరే ‘ప్రేమ’. ఈ ‘ప్రేమ’ చాలా విలువైనది. ఈ ప్రేమ చాలా రకాల విశాల భావనలతో, విస్తృత అర్థంతో ప్రయోగించబడుతోంది ఈ తత్త్వజ్ఞానంలో. ఈ ‘ప్రేమ’ అనేటటువంటి లక్షణమే లేకుండా నవగ్రహాలు సూర్యుని చుట్టూ తిరగలేవు.
ఈ సౌర కుటంబం విశ్వంలో... తన స్థానంలో తాను నిలబడలేదు. విశ్వమంతా వ్యాపకమై దాని దాని స్థానములలో, వాటి వాటి పనులను నిర్వహించే కూడా ఈ ప్రేమ వల్లనే!! కాబట్టి ఈ ప్రేమ విశ్వజనీనమైనది, విశ్వవ్యాపకమైనది.
వ్యాపక ధర్మంతో కూడినటువంటి ‘ప్రేమ’ అనేటువంటి లక్షణాన్ని జీవభావంలోకి వచ్చేటప్పటికి ‘నేనొక వస్తువును ప్రేమించాను’ అనే అభిమానయుతమైనటవంటి అహంకార మమకార మిశ్రితంగా మానవుడు వినియోగించుకుంటున్నాడు. తత్ ప్రభావం చేత అది ప్రతిబంధకమై, అనురాగమై మమకారాన్ని బలవత్తరంగా ప్రేరేపిస్తుంది.
తత్ ప్రభావం చేత ఆ వస్తువు కనబడకపోయినా, ఆ మనిషి కనబడకపోయినా, లేదా తత్ స్మృతి ప్రభావం చేత అయినా సరే, నీవు దుఃఖాన్ని పొందుతావు. ఈ రకంగా ప్రతిబంధకమై కూర్చొంటుంది అనురాగము. కాబట్టి మానవులందరూ తప్పక ప్రయత్నించి ఈ అనురాగ బంధ విముక్తులవ్వాలి.
తప్పనిసరిగా ప్రేమ భావంతో మానవులందరూ సమత్వభావంతో వ్యవహరించాలి. వైరం లేకుండా వుండాలి, ద్వేషం లేకుండా వుండాలి. రాగద్వేషాలు అనే ద్వంద్వ ప్రకృతి నుంచీ విముక్తులవ్వాలి. ఈ ప్రేమ రాగద్వేషములకు అతీతమై వుంటుంది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment