🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 17 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. శ్రేయో మార్గము - ప్రేయో మార్గములు స్వధర్మము-పరధర్మము - 5 🌻
మానవులకు శ్రేయోమార్గము, ప్రేయోమార్గము అను ఈ రెండును అనుసరింపదగినవిగానే తోచును. ఈ రెంటిలో కల భేదమును సామాన్య మానవుడు గుర్తింపలేకున్నాడు.
ధీరుడగు విద్వాంసుడు ప్రేయస్సుకంటే శ్రేయస్సే శ్రేష్టమైనదని తలంచి దానినే అనుసరించును. మందబుద్ధికలవాడు ధనమును, గృహారామ క్షేత్రాదులను సంపాదించి వానిని కాపాడుట యనెడి యోగక్షేమాత్మకమైన ప్రేయోమార్గమునే శ్రేష్టమైనదానినిగా తలంచి ఆ మార్గమునే అనుసరించును.
సాధారణముగా మానవులలో అధికసంఖ్యాకులు ధనసంపాదనకు దాని రక్షణను గొప్పగా భావించి తమ జీవితములను గడుపుచున్నారు. వారు పరమును గురించి ఆలోచింపరు. వారు శాశ్వత సుఖమునిచ్చు శ్రేయోమార్గమునకు దూరముగా నుందురు.
మన గురించి బాగా చెప్పాడు ఇక్కడ. చూడండి. కృతయుగకాలంలోనే జీవులందరూ కలియుగంలో ఎలా వుంటారనేది ఈ ఉపనిషత్తులో చక్కగా బోధించాడు.
ఇవ్వాళ మనందరి జీవితాలను గమనిస్తే వెనక్కి తిరిగి ఏం కనబడుతున్నదీ అంటే ఐహికమైనటువంటి, ఇహలోక సంబంధమైనటువంటి, పరిణామము చెందేటటువంటివి, వాటిని మాత్రమే శాశ్వతమని తలంచుచున్నాము. మనం ఎవరినైనా ఒక ప్రశ్న వేశామనుకోండి , నాయనా! నువ్వు నీ జీవితంలో ఎప్పటికి స్థిరపడతావు? అని అడుగుతాం. యవ్వనంలోకి ప్రవేశించిన వారందరినీ కూడా మనం అడిగే ప్రశ్న ఏమిటంటే, నీ జీవితంలో నువ్వు ఎప్పటికి స్థిరపడతావు?
ఏమిటి స్థిరపడటమంటే అని తిరిగి ప్రశ్నిస్తే వివాహం చేసుకోవడం, రెండు ఇల్లు కట్టడం, మూడు పిల్లల్ని కనడం, నాలుగు వస్తు సముదాయాన్ని సమీకరించుకోవడం , అయిదు వారసులందరికీ , వచ్చే మూడు నాలుగు తరాలకు సరిపడా ధనార్జన చేయడం - ఇవన్నీ కలిపి మనం స్థిరపడటం క్రింద లెక్కేసుకోవడం మొదలుపెట్టాం. ఇదంతా ప్రేయోమార్గము.
మానవుడికి ఎన్ని చెప్పుల జతలు వుండాలి అసలు అని ఆలోచిస్తే ఒక జత సరిపోతుంది కదా. మహా అయితే రెండు జతలు సరిపోతాయి కదా. కాని ఇవ్వాళ ఎవరింట్లో చూసినా కూడా ఒక చెప్పుల షాపు వుంటుంది.
ప్రయోజనమేముంది? ప్రయోజనం లేదు కదా. అలాగే ప్రతి వస్తు సముదాయమునకు ఒక పేద్ద షాపు maintain చేయడం అలవాటు చేసుకున్నాం.
తద్వారా ఏమైంది? ఆ యా వస్తువులను సరియైనటువంటి పద్ధతిలో వుంచలేము, క్రమమైన మార్గములో వాటిని శుద్ధి చేయలేము, శుద్ధి చేసిన వాటిని మరల తిరిగి వుంచలేము, వాటిని సరిగా సర్దుకోలేము, వాటిని సరిగా ఏర్పాటు చేసుకోలేము, ఆ వస్తువులని ఏర్పాటు చేసుకోలేక, ఆ వస్తువులను సరిగా సరిదిద్దుకోలేక సతమతమైపోతూ వాటిల్లో సుఖంగా వున్నానని భ్రమ చెందుతున్నాడనమాట.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment