కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 20

Image may contain: one or more people and people standing, text that says "Nachiketa and Other Stories"
🌹 . కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 20 🌹
. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
. ప్రసాద్ భరద్వాజ
. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 8 

నచికేతా! ప్రపంచములో ఎక్కువమందిని ఆకర్షించునటువంటిన్ని, ఎక్కువమంది కోరుకొనునటువంటిన్ని పుత్ర-పౌత్రులను, ప్రియమును కలుగజేయు స్త్రీలను, ధన కనక వస్తు వాహనములను, ఎన్నింటినో నీకిచ్చెదనని నిన్ను మాటిమాటికి ప్రలోభపెట్టినను నీవు వాటినన్నిటిని వదలిపెట్టితివి. నీ బుద్ధి చాతుర్యమునకు ఆశ్చర్యపడుచుంటిని.
అధిక సంఖ్యాకులగు సామాన్య మానవులు ధన కనక వస్తు వాహనములను సంపాదించవలెననెడి వ్యామోహములో పడి దుఃఖముల పాలగుచున్నారు. నీవు వానిని కోరవైతివి. వానిలోనుండు దోషములను గుర్తించిన నీ జన్మ ధన్యము. సంసారిక సుఖములకు లోబడని నీ వంటివారే ఆత్మ జ్ఞానమునకు అర్హులు.

ఇతరత్రములైనటువంటి జగద్వ్యాపారములకు సంబంధించినటువంటి వాటి యందు ఆసక్తి ఎవరికైతే వుందో, ఆ మోహం ఎవరికైతే వుందో వారికి ఈ ఆత్మ విషయైక జ్ఞానమునందు ఆసక్తి కలుగదు. అంటే అర్ధం ఏమిటటా? ప్రతి జీవికి కూడా, జీవులందరికీ కూడా, సామాన్యధర్మం ఏమిటంటే వారివారి ఇంద్రియములు ఇంద్రియ విషయములందు ఆసక్తి కలిగి ప్రవర్తించుట. ఇది సామాన్య విషయం. 

కాని మానవుడికి ఒక్కడికే ఈ ఇంద్రియాలను జయించ గలిగేటటువంటి సమర్ధత ఉంది. ఎట్లా? అంటే అవి కోరినటువంటివాటిని వాటికి అందివ్వనివ్వకుండా, అందనీయకుండా, అందించకుండా, నిరసిస్తూ తగుమాత్రముగా - దీనికి ఒక ఉపమానం చెప్తారు.
ఒక సింహాన్ని స్వాధీనపరచు కోవాలనుకోండి. ఎట్లా స్వాధీనపరచుకుంటావు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ఇంద్రియములు ఎటువంటివట? ఆ సింహము వంటివట. వాటిని స్వాధీనపరచుకోవాలి అంటే ఒక జూలో గానీ, ఒక సర్కస్ లో గానీ వాటిని స్వాధీనపరచుకుంటారు. 
సింహాలని, పులులని ఇలాంటి క్రూరమృగాలని కూడా స్వాధీనపరచుకుంటారు. ఎట్లా స్వాధీనపరచుకుంటారట? వాటిని పూర్తిగా ఆకలికి గురిచేస్తారు. అవి ఆకలితో నకనకనకలాడేట్లు చేస్తారు. చేసి, కొద్దిపాటి ఆహారాన్ని పెడతారు. ఎందుకనిట అంటే పూర్తిగా ఆహారం పెట్టకపోతే చనిపోతాయి. 

కాబట్టి కొద్దిపాటి ఆహారం పెడతారు. ఆ కొద్దిపాటి ఆహారంతో వాటికి సంతృప్తి కలుగదు. తీవ్రమైన అసంతృప్తి కూడా కలుగుతుంది. అట్లా తీవ్రమైన అసంతృప్తికి లోనైనప్పుడు వాటికి శిక్షణనిస్తారు. అంటే ఒక స్టూల్ ఎక్కి ఏనుగు కూర్చోవాలి. ఒక స్టూల్ ఎక్కి సింహం కూర్చోవాలి. ఒక రింగ్ లో నించి పులి దూకాలి. అట్లా దూకేటట్లుగా వాటిని కొడతారు. 

వాటికి సంజ్ఞారూపకంగా సూచిస్తాడు. వాటికి మార్గ నిర్దేశం చేస్తాడు. అట్లా శిక్షణకి అవి లొంగితేనే వాటికి ఆహారం పెడుతాడు. 

ఈ రకంగా ఒక యమనియమాదులతో కూడినటువంటి శిక్షణకు లోనయ్యేట్లుగా ఇంద్రియములను మనం స్వాధీనపరచుకోవాలి. అందువల్లనే యమనియమాలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. 

ఆ రకంగా ఇంద్రియాలను స్వాధీనపరచుకోవాల్సిన అవసరం వుంది. అట్లా ఎవరైతే ఇంద్రియములను స్వాధీనపరచుకున్నారో, ఆ ఇంద్రియ జయం, జితేంద్రియత్వం కలిగిందో, వాళ్ళు సంసారసుఖము నుంచి బయటపడతారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹 🌹 

No comments:

Post a Comment