32. గీతోపనిషత్తు - ప్రసాదము - ప్రసాదమనగా మనో నిర్మలత్వము




🌹 32. గీతోపనిషత్తు - ప్రసాదము - ప్రసాదమనగా మనో నిర్మలత్వము. మనో నిర్మలత్వమును పొందుటకు మనస్సు స్వాధీనము కావలెను. మనస్సు స్వాధీనమగుటకు రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించవలెను. దానికి మార్గం “నిర్వర్తించుచున్న కార్యము నందు కర్తవ్యమునే దర్శింపుము. 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚.  గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 64  📚

రాగద్వేష వియుకైస్తు విషయా నింద్రియై శ్చరన్ |
ఆత్మవశ్యై ర్విధేయాత్మా ప్రసాద మధిగచ్ఛతి || 64

ప్రసాదమనగా మనో నిర్మలత్వము. మనో నిర్మలత్వమును పొందుటకు మనస్సు స్వాధీనము కావలెను. మనస్సు స్వాధీనమగుటకు రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించవలెను.

ద్వంద్వముల నధిగమించిన మనస్సుతో ఇంద్రియముల నుండి ప్రవర్తించు మానవుడు మనో నిర్మలత్వమును పొందుచున్నాడు. ప్రసాద స్వీకరణము అనగా సాధారణముగ కట్టె పొంగళి, చక్రపొంగళి, చిత్రాన్నము ఇత్యాది ఆహార పదార్థములను పూజాది కార్యక్రమములు జరిగిన తరువాత భుజించుట అని భావింతురు.

కేవలము భుజించుటే అయినచో అది భోజనమగును. భోజనమునకు, ప్రసాద స్వీకరణకు వ్యత్యాసము కలదు. నిర్మలమైన మనస్సు గలవాని ప్రసాద స్వీకరణము విశిష్టముగ నుండును. అతడు రుచియందు రాగముగాని, రుచి లేకపోవుట యందు ద్వేషము గాని భావింపక, రుచియందు యుక్తుడై యుండక ప్రశాంతము, నిర్మలము అగు మనస్సుతో అందించిన ప్రసాద మును బ్రహ్మమని భావన చేయుచు, బ్రహ్మమునకు సమర్పణగా ఇంద్రియముల ద్వారమున గైకొనును. ఇట్లే మిగిలిన ఇంద్రియ వ్యాపారము లందు కూడ ప్రవర్తించును. ఇట్లు ప్రవర్తించువాని మనో నిర్మలత్వము ఇంద్రియార్థముల కారణమున చెడదు. ప్రశాంతత చెదరదు.

అట్లుకాక ప్రసాదములో ఉప్పెక్కువయిన దనియు, కార మెక్కువైనదనియు, పోపు తక్కువైనదనియు ప్రసంగించువారు నిర్మలచిత్తులు కాలేరు. కారణమేమన ఇంద్రియార్థముల యందు గల రాగ ద్వేషములు. ఇట్టి రాగ ద్వేషములు సన్నివేశములయందు, ఇతర జీవులయందు, కర్తవ్యముల యందు, కార్యముల యందు గోచరింప జేయువాడు ప్రశాంతతను పొందలేడు. మనో నిర్మ లత్వము ఎండమావివలె మురిపించునుగాని అనుభూతికి అందదు.

భగవానుడు మనో నిర్మలత్వమును పొందుటకు ఒక ఉపాయమును సూటిగా సూచించు చున్నాడు. అది యేమన “నిర్వర్తించుచున్న కార్యము నందు కర్తవ్యమునే దర్శింపుము. రాగ ద్వేపములను ప్రతిబింబింప కుండును." "రాగద్వేష వియుకై:" అని తెలుపుట ఇందులకే. అట్టివానికే మనసు స్వాధీనము కాగలదు. అట్టివాడు కర్మల యందున్నను నిర్మలత్వము కోల్పోవును. చేయు పనులలో కర్తవ్యము నుండి కామ ముద్భవించినచో అది రాగద్వేషములకు, కామక్రోధములకు, లోభమోహములకు, ఈర్ష్య అసూయలకు దారితీయును. అట్టివానికి మనస్సు వశము కాదు. జీవితమను ప్రసాదమును అనుభవించలేడు.

ప్రసాదమును అనుభవించు వాడే దేహమును గూడ ఒక రాజు ప్రాసాదముగ అనుభవింపగలడు. పై శ్లోకమున రాగద్వేష విముక్తుడగుట, అట్టి మనస్సుతో ఇంద్రియ ద్వారమున కర్మలను నిర్వర్తించుట, తత్కారణముగ మనస్సు స్వాధీనమగుట, అట్టి స్వాధీనమైన మనస్సు నిర్మలత్వమును, శాంతిని పొందుట సోపానములుగ తెలుపబడినది. ఇది ఉత్కృష్టమైన సాధనాంశము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

19 Sep 2020



No comments:

Post a Comment