రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
50. అధ్యాయము - 5
🌻. సంధ్య యొక్క చరిత్ర - 2 🌻
బ్రహ్మో వాచ |
అహం స్వతనయాం సంధ్యాం దృష్ట్వా పూర్వమథాత్మనః | కామాయాశు మనోsకార్షం త్యక్తా శివ భయాచ్చ సా || 14
సంధ్యా యాశ్చలితం చిత్తం కామబాణ విలోడితమ్ | ఋషీణామపి సంరుద్ధ మానసానాం మహాత్మనామ్ || 15
భర్గస్య వచనం శ్రుత్వా సోపహాసం చ మాం ప్రతి | ఆత్మనశ్చలితత్వం వై హ్యమర్యాదమృషీన్ ప్రతి || 16
కామస్య తా దృశం భావం మునిమోహకరం ముహుః | దృష్ట్వా సంధ్యా స్వయం తత్రోపయమా యాతి దుఃఖితా || 17
బ్రహ్మ ఇట్లు పలికెను -
పూర్వము నేను నాకుమార్తె యగు సంధ్యను చూచి వెంటనే ఆమెను కామించితిని. కాని శివుని భయము వలన అధర్మమును వీడితిని (14).
మన్మథుడు బాణములచే ప్రహారము చేయగా, సంధ్య యొక్క మనస్సు చలించెను. మనోనిగ్రహము గలవారు, మహాత్ములునగు ఋషులకు కూడ మనో వికారము కలిగెను (15).
శివడు నాతో పరిహాస పూర్వకముగా పలికిన మాటలను సంధ్య విన్నది. తాను పొందిన మనోవికారమును, ఋషుల విషయములో జరిగిన అమర్యాదను కన్నది (16).
మునులకు కూడా మోహమును కలిగించే కాముని సామర్థ్యమును పరిశీలించినది. ఆమె మిక్కిలి దుఃఖితురాలై అచట నుండి వెళ్లిపోయెను (17).
తతస్తు బ్రహ్మణా శప్తే మదనే చ మయా మునే | అంతర్భూతే మయి శివే గతే చాపి నిజాస్పదే || 18
అమర్ష వశమా పన్నా సా సంధ్యా మునిసత్తమ | మమ పుత్రీ విచార్యైవం తదా ధ్యాన పరాsభవత్ || 19
ధ్యాయంతీ క్షణమేవాశు పూర్వం వృత్తం మనస్వినీ | ఇదం విమమృశే సంధ్యా తస్మిన్ కాలే యథోచితమ్ || 20
ఓ మహర్షీ! నేను మన్మథుని శపించి అంతర్ధానమైతిని. శివుడు తన ధామకు వెళ్లెను (18).
ఓ మహర్షీ! ఆ సంధ్య జరిగిన వృత్తాంతమును సహించలేక పోయెను. నా కుమారైయగు సంధ్య అపుడు ఇట్లు తలపోసి, ధ్యానమగ్నురాలు అయెను (19).
అభిమానవతియగు ఆ సంధ్య జరిగిన వృత్తాంతమును ధ్యానము చేయు చున్నదై, ఆ కాలమునకు ఉచితమగు విధానములో, ఇట్లు విమర్శ చేసుకొనెను (20).
సంధ్యో వాచ |
ఉత్పన్న మాత్రాం మాం దృష్ట్వా యువతిం మదనేరితః | అకార్షీత్సాను రాగోsయమభిలాషం పితా మమ || 21
పశ్యతాం మానసానాం చ మునీనాం భావితాత్మనామ్ | దృష్ట్వై వ మామమర్యాదం సకామమభవన్మనః || 22
మమాపి మథితం చిత్తం మదనేన దురాత్మనా | యేన దృష్ట్వా మునీన్ సర్వాంశ్చ లితం మన్మనో భృశమ్ || 23
ఫలమేతస్య పాపస్య మదనస్స్వయమాప్తవాన్ | యస్తం శశాప కుపితః శంభోరగ్రే పితామహః || 24
సంధ్య ఇట్లు పలికెను -
నేను యువతిగా జన్మించిన మరుక్షణములో, మన్మథునిచే ప్రేరితుడైన నా తండ్రి నన్ను మన్మథ వికారముతో కామించెను (21).
మానసపుత్రులు, అంతః కరణ శుద్ధి గల మునులు చూచుచుండగా ఆయన నన్ను మర్యాద లేని విధముగా చూచి, మనస్సులో కామనను పొందినాడు (22).
దుర్మార్గుడగు మన్మథుడు నా మనస్సును కూడ కల్లోల పెట్టగా , ఆ మునుల నందరినీ చూచుచున్న నా మనస్సు మిక్లిలి చలించెను (23).
ఈ పాపమునుకు ఫలమును మన్మథుడు పొందినాడు. శంభుని యెదుట పితామహుడు కోపించి వానిని శపించినాడు (24).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
19 Sep 2020
No comments:
Post a Comment