కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 109


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 109 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము -39
🌻

అటువంటి ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని, ఉత్తమమైనటువంటి సాధనను, శ్రవణ మనన నిధి ధ్యాసల ద్వారా ప్రవృత్తి మార్గం నుండి నివృత్తి మార్గంలోకి మరలించుకోవడం ద్వారా బాహ్య విషయ వస్తు వ్యవహార సంగత్వ దోషాన్ని పరిత్యజించడం ద్వారా, నిమిత్తమాత్రపు వ్యవహారం ద్వారా, సామాన్య వ్యవహారం ద్వారా, తనను తాను నియమించుకుంటూ, సాధన చతుష్టయ సంపత్తి ద్వారా, నిత్యానిత్యవస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరాగము, శమాది షట్క సంపత్తి...

అంటే శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము, ముముక్షత్వము, తీవ్ర మోక్షేచ్ఛ, తీవ్ర వైరాగ్యము... వీటిని పొందవలసినటువంటి అవసరము మానవులకు ఎంతైనా ఉన్నది. ఈ సమస్తమూ కూడా నివృత్తి మార్గంలోనే సాధ్యమౌతుంది. సత్వగుణంతోనే సాధ్యమౌతుంది. చాలా మంది ఈ సత్వగుణం అనేదాని దగ్గర విశ్రాంతి తీసుకుంటారు. ఎంతకాలం తీసుకుంటారయ్యా? ఎన్ని జన్మలపాటైనా విశ్రాంతి తీసుకోవచ్చు. ఎందుకని అంటే? అది సహనంతో ఉంటుంది, శాంతంతో ఉంటుంది, ఓర్పుతో ఉంటుంది.

అన్ని దైవీ లక్షణాలు ఆ సత్వగుణంతో ముడిపడి ఉంటాయి. దయ, క్షమ, త్యాగం ఇలాంటి లక్షణాలన్నీ దానితో ముడిపడి ఉంటాయి. కానీ స్వస్వరూప ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందక పోయినట్లయితే, ఈ సత్వగుణం కూడా బంధహేతువే, బంధ కారణమే! ఎందుకని అంటే, జనన మరణ చక్రంలోకి పట్టుకెళ్తుంది కాబట్టి.

పునః మరలా శరీరాన్ని ధరింప చేస్తుంది కాబట్టి. ఎప్పటికైనా సరే ఈ సత్వగుణాన్ని కూడా అధిగమించాలి. గుణాతీత స్థితిలో నిలబడి ఉండాలి. గుణాలకు సాక్షిగా ఉండాలి.

‘గుణత్రయాతీతః’ - ఎట్లా అయితే, ‘శరీర త్రయ విలక్షణః’ - ఆత్మ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అట్లాగే ‘గుణత్రయాతీతః’ - మూడు గుణాలను దాటినటువంటి స్థితిలో, మూడు గుణాలు స్వాధీనమైనటువంటి స్థితిలో, గుణమాలిన్యము లేనటువంటి స్థితిలో, స్వస్వరూప ఆత్మసాక్షాత్కార జ్ఞాన స్థితిలో, ప్రత్యగాత్మ స్థితిలో, అంతర్యామి స్థితిలో, బుద్ధి గుహయందు, స్వప్రకాశంతో, స్వరూపజ్ఞానంతో సహజంగా నిలకడ చెంది, తనను తాను తెలుసుకున్న వాడై, సరియైనటువంటి ఆత్మనిష్ఠ యందు నిలకడ చెందాలి.

ఈ ఉత్తమ లక్ష్యాన్ని పొందాలి అంటే, రాచబాటను తెలియజేసింది. నివృత్తి మార్గం ద్వారా మనస్సునుండి బుద్ధికి, బుద్ధినుండి మహతత్వానికి, మహతత్వం నుంచి అవ్యక్తానికి, అవ్యక్తం నుంచి ప్రత్యగాత్మకు చేసేటటువంటి అంతర్ముఖ ప్రయాణాన్ని, మానవులు పూర్తి చేయాలి. అలా పూర్తి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మాత్రమే ఈ ఆత్మదర్శనాన్ని పొందగలుగుతున్నారు.

అలా లేకపోయినట్లయితే, ఈ నివృత్తి మార్గంలో కనుక నువ్వు ఉత్తమ లక్ష్యాన్ని స్వీకరించి, శ్రవణ, మనన, నిధి ధ్యాసల ద్వారా, ఈ స్థిరమైనటువంటి స్థితిని గనుక నువ్వు పొందకపోయినట్లయితే, ఇది సాధ్యం కాదు. కాబట్టి, తప్పక అందరూ ఈ ఆత్మదర్శనాన్ని పొందేదిశగా పరిణామం చెందవలసినటువంటి అవసరం ఈ జన్మలోనే ఉంది. ఎప్పుడో చేద్దాంలే, ఎప్పుడో చూద్దాంలే, అదే రాకపోతుందా? వచ్చినప్పుడు అదే వస్తుందిలే, కాలంలో అవే వస్తాయిలే, ‘కాలేన ఆత్మని విందతి’ - అనేటటువంటిది వాయిదా పద్ధతి తమోగుణం సంబంధమైన వాయిదా పద్ధతి.

ఇప్పుడే ఈ జన్మలోనే, ఈ క్షణమందే, ఈ స్థితియందే, ఇప్పటికిప్పుడే ‘నేను పొందాలి’ అనేటటువంటి తీవ్రమోక్షేచ్ఛ, తీవ్ర వైరాగ్యం ఎవరికైతే ఉంటుందో, వారు మాత్రమే ఈ నివృత్తి మార్గంలో త్వరత్వరగా ప్రయాణం చేయగలుగుతారు. అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేయగలుగుతారు.

చాలామంది ప్రయత్నం చేస్తారు కాని, సత్వగుణానికి చేరగానే ‘కాలేన విందతి’ అని ఊరుకుంటారు. అలా ఊరుకునేవారు చాలామంది ఉన్నారు. ఇది పెద్ద విమానాశ్రయం లాంటిది, విమానాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ వీడు ఎప్పటికీ విమానాశ్రయంలో వుంటాడు, ఏ విమానము ఎక్కడు, ఎక్కడికి ప్రయాణం పూర్తి చేయడు. అందువల్ల ఏమైపోయింది? శ్రవణం చేశాడు, మననం కూడా చేశాడు, కానీ నిధిధ్యాసలను పూర్తి చేయలేదు. అతని దగ్గర అన్నీ మంచి లక్షణాలున్నాయి. ఏ చెడు లక్షణాలు ఎత్తి చూపడానికి ఏం కనపడవు.

అందరి కంటే ఓర్పు కలిగినవాడు, సహనం కలిగినవాడు, అందరితో పోలిస్తే జ్ఞానం ఉన్నవాడు, వివేకం ఉన్నవాడు, శాస్త్రములన్నీ బాగా చదివాడు, మంత్రములన్నీ బాగా తెలుసుకున్నాడు, ఉపదేశాలన్నీ బాగా పొందాడు, మహానుభావుల సేవనం కూడా చేశాడు, కానీ లక్ష్యశుద్ధి ఇప్పుడే, ఈ జన్మలోనే, ఇక్కడే, ఈ సందర్భంలోనే ‘నేను వెంటనే వెనువెంటనే ఆత్మసాక్షాత్కార జ్ఞానము’ పొందక నిలువజాలను అనేటటువంటి తీవ్రమోక్షేచ్ఛ లోపించడం చేత, ఆ స్థానంలో వాయిదా పద్ధతి వచ్చేసింది. సరే నేను చేయాల్సింది చేసేశాను, ఇక వచ్చేది ఎప్పటికైనా ఈశ్వరానుగ్రహం చేత అదే వస్తుందిలే అనుకుంటాడు.

అలా అనడం వలన ఏమైపోయింది? ఆ వాయిదా వాయిదా అలాగే ఉండిపోయి, ఆ జన్మాంతరమూ, అలాగే అవశేషంగా మిగిలిపోయి, ఆ అసంతృప్తి చేత పునః జనన మరణ చక్రంలో, మరలా తల్లి గర్భాన్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం వచ్చింది. - విద్యా సాగర్ స్వామి

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


21 Nov 2020

No comments:

Post a Comment