✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 19. ద్వంద్వాతీత స్థితి - యాదృచ్ఛికముగా లభించుదానికి సంతృప్తి చెందువాడు, మత్సరము లేనివాడు, సమబుద్ధి కలవాడు, ద్వంద్వములకు అతీతుడు నిర్వర్తించు కర్మలు అతనిని బంధింపవు. 🍀
📚. 4. జ్ఞానయోగము - 22 📚
యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః |
సమః సిద్ధావసిద్ధే చ కృత్వాసి న నిబధ్యతే || 22
యాదృచ్ఛికముగా లభించుదానికి సంతృప్తి చెందువాడు, మత్సరము లేనివాడు, సమబుద్ధి కలవాడు, ద్వంద్వములకు అతీతుడు నిర్వర్తించు కర్మలు అతనిని బంధింపవు.
ముందు తెలిపిన ఎనిమిది గుణములకును మరి నాలుగు గుణములను దైవము కర్మలంటని మార్గమున పేర్కొనుచున్నాడు. పై తెలిపిన నాలుగు గుణములను గూర్చి ప్రత్యేకించి వివరింప పనిలేదు. ఒక సోపాన క్రమమున దైవము కర్మమును గూర్చిన జ్ఞానము వివరించు చున్నాడు.
కర్మము నిర్వర్తించుచున్ననూ, బంధనమున పడకుండుటకు అనుసరించవలసిన సూత్రములను వివరించుచున్నాడు. ఈ శ్లోకముతో ఆ సూత్రములు పండ్రెండుగా తెలియును.
1. కోరికలేమి, 2. నిస్సంకల్పము, 3. కర్మఫల సంగత్యాగము, 4. నిత్యతృప్తి, 5. నిరాశ్రయత, 6. నిరాశ, 7. అపరిగ్రహము, 8. యతచిత్తము, 9.దొరికిన దానితో సంతోషము, 10. మాత్సర్యము లేకుండుట, 11. సమబుద్ధి, 12. ద్వంద్వాతీత స్థితి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
21 Nov 2020
No comments:
Post a Comment