🌹 . శ్రీ శివ మహా పురాణము - 278 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
66. అధ్యాయము - 21
🌻. సతీ శివుల విహారము - 1 🌻
నారదుడిట్లు పలికెను -
తండ్రీ! సర్వజ్ఞుడవు, పుణ్యాత్ముడవు అగు నీ వాక్కు పవిత్రమైనది. మేము మహాద్భుతము, శుభకరమునగు ఉమాపరమేశ్వరుల చరితమును వింటిమి (1). మోహములనన్నింటినీ పోగొట్టునది, పరమ జ్ఞానముతో సంపన్నమైనది, మంగలములకు నిలయము, ఉత్తమమునగు వారి వివాహ వృత్తాంతమును చక్కగా వింటిమి (2).
శివాశివుల శుభచరితమును ఇంకనూ తెలుసు కొనవలెనని నాకు కోరిక గలదు. ఓ మహాప్రాజ్ఞా! కావున, సాటిలేని దయను చూపి శీఘ్రమే ఆ చరితమును వర్ణించుము (3).
బ్రహ్మ ఇట్లనెను -
ఓ మహర్షీ! హే సౌమ్యా!నీవు నన్ను శివలీలలను వర్ణించుమని ప్రేరేపించుచుంటివి. నీ ఈ సందేహము సహృదయమునకు కలిగే యోగ్యమైన సందేహమే (4). ముల్లోకములకు తల్లి, దక్షునకు కుమార్తె అగు సతీదేవిని వివాహ మాడి, శివుడు తన ధామమునకు ఆనందముగా చేరి ఏమి చేసెనోచెప్పెదను తెలుసుకొనుము (5).
అపుడు శివుడు తన గణములతో గూడి ఆనందముతో తన ధామమును చేరెను. ఓ దేవర్షీ! ఆయన అచట తనకు మిక్కిలి ప్రియమగు వృషభమునుండి క్రిందకు దిగెను (6). ఓ దేవర్షీ! సతీదేవితో గూడి శివుడు లోకాచార ప్రవర్తకుడై తన స్థానమును యధావిధిగా ప్రవేశించి, మిక్కిలి ఆనందించెను (7).
అపుడా ముక్కంటి దేముడు దాక్షాయణిని భార్యగా పొంది తన గణములను నంది మొదలగు వారిని తన పర్వత గుహనుండి బయటకు పంపెను (8). కరుణా సముద్రుడగు ఆ ప్రభువు నంది మొదలగు ఆ గణములతో లోకపు పోకడనను సరించి ఇట్లు పలికెను (9).
మహేశ్వరుడిట్లు పలికెను -
ఓ గణములారా! నేను మిమ్ములను ఏ కాలములో స్మరించెదనో, అపుడు నా స్మరణయందు ఆదరము గల మనస్సు గలవారై వెంటనే నా సమీపమునకు రండు (10). వామదేవుడు ఇట్లు పలుకగా, నంది మొదలగు మహావీరులైన ఆ గణములు మహావేగముతో వివిధ స్థానములకు వెళ్లిరి (11).
వారు వెళ్లగానే ఈశ్వరుడు తొందరపాటు గలవాడై ఆ రహస్యస్థానమునందు ఆ దాక్షాయణితో గూడి ఆనందముతో మిక్కిలి రమించెను (12). ఆయన ఒకనాడు వనమునందలి పుష్పములను దెచ్చి, అందమగు మాలను చేసి ఆమెకు హారముగా వేసెను (13).
ఒకప్పుడు తన ముఖమును సతి అద్దములో చూచు కొనుచండగా, శివుడు వెనుకగా వెళ్లి తన ముఖమును కూడ చూచుకొనెను (14). ఒకప్పుడు శివుడు ఆమె యొక్క కుండలములను మెరియునట్లు చేసి చేసి, దగ్గరా కూర్చుండి విడదీసి ఈయగా, ఆమె వాటిని వస్త్రముతో శుభ్రముగా చేసెడిది. అపుడాయన మరల వాటిని కూర్చెడివాడు (15).
ఆమె పాదములు సహజముగా ఎర్రనివి. వాటిపై ఎర్రని లాక్షారసము అలంకరింపబడెను. ఆపై వృషభధ్వజుడు తన మూడవ కంటిలోని అగ్నియొక్క ప్రకాశము వాటిపై పడునట్లు చేసి, వాటి రక్తమను పూర్ణముగా ఇనుమడింప జేసెను (16). శివుడు ఆమె ముఖమును చూచుటకై ఇతరుల యెదుట బిగ్గరగా చెప్పదగిన మాటను కూడా ఆమె చెవిలో చెప్పెడి వాడు (17).
ఆయన కొద్ది దూరము మాత్రమే వెళ్లి జాగ్రత్తగా వెనుకకు మరలివచ్చి, అన్యమనస్కురాలై కూర్చుండి యున్న ఆమె వెనుకకు వచ్చి కనులను మూసెడివాడు (18). వృషభధ్వజుడగు శివుడు తన మాయచే హఠాత్తుగా అదృశ్యుడై ఆమెను కౌగిలించుకొనగా, ఆమె మిక్కిలి భయమును, విస్మయమును పొంది కంగారు పడెను (19).
బంగరు పద్మములను బోలిన ఆమె స్తనద్వయము నందు ఆయన కస్తూరి బొట్టుతో తుమ్మెద ఆకారమును చిత్రించెను (20). శివుడు హఠాత్తుగా ఆమె స్తనయుగము నుండి హారమును తీయుట, మరల హారమును వేయుట అను పనులను చేసి చేతితో ఆమెను పునః పునః స్పృశించెను (21).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
21 Nov 2020
No comments:
Post a Comment