కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 151


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 151 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము - 81 🌻


దైవం బింబము, జీవుడు ప్రతిబింబము. ఈశ్వరుడు బింబము, జీవుడు ప్రతిబింబము. కాబట్టి ప్రతిబింబాన్ని బాధిస్తే ప్రయోజనం లేదు కదా! కాబట్టి భౌతికంగా, స్థూలంగా ఉన్నటువంటి దాని యందు నువ్వు ఎంత ప్రభావశీలంగా ఉన్నప్పటికీ సూక్ష్మమైన, అతి సూక్ష్మమైన, సూక్ష్మతరమైన, సూక్ష్మతమమై,

ఈ భౌతికతలో గ్రాహ్యము కానటువంటి స్థితిలో ఉన్నటువంటి శబ్ద, రూప, గుణ రహితమైనటువంటి, ఆధారభూతమైనటువంటి, సర్వాధిష్టానమైనటువంటి, సర్వులకు ఆశ్రయమైనటువంటి ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో, ఏ పరమాత్మ స్థితి అయితే ఉన్నదో దానిని ఈ ఆంతరిక యజ్ఞ పద్ధతిగా, జ్ఞానయజ్ఞ పద్ధతిగా, తనను తాను లేకుండా చేసుకునే పద్ధతిగా, తనను తాను పోగొట్టుకునేటటువంటి పద్ధతిలో ‘నాహం’ గా మారేటటువంటి పద్ధతిగానే దీనిని తెలుసుకోవాలి.

అలా కాకుండా జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే, జగత్తు వేరే అనేటటువంటి ద్వైత పద్ధతిని ఆశ్రయించినట్లైతే, ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అనే త్రయంలో చిక్కుకున్నవాడవై మరల జనన మరణ రూప భ్రాంతి కలుగుతుంది. సదా జనన మరణ చక్రంలోనే పరిభ్రమిస్తూఉంటావు. కాబట్టి ఈ ద్వైత భ్రాంతిని విడువాలి. కాబట్టి పంచ భ్రమలలో మొట్టమొదటి భ్రమ అయినట్టి “జీవేశ్వరో భిన్నః”- జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే అనే భ్రాంతిని వదలమని ఉపదేశిస్తూ ఉన్నారు. నీ శరీరమందును, నా శరీరమందును, అన్య శరీరములయందును ఏ చైతన్యము సాక్షి రూపముగా నున్నదో, ఆ చైతన్యమే విరాట్‌ శరీరమందును సాక్షి రూపముగా ఉన్నది.

ఇచ్చట వ్యష్టి స్థూల, సూక్ష్మ, కారణ దేహములందు ఏ ప్రత్యగాత్మ విశ్వ తైజస ప్రాజ్ఞ రూపముగా ఉన్నదో, అచట సమిష్టి స్థూల సూక్ష్మ కారణ దేహములందు ఏ పరమాత్మ, విరాట్‌, హిరణ్యగర్భ, అవ్యాకృత రూపముగా ఉన్నదో, అదియు, ఇదియు ఒక్కటే. అనగా పరబ్రహ్మమే భేదము లేదు. అఖండ ఆకాశమునందు భేదము లేనప్పటికి, ఘటము, మఠము, మొదలగు ఉపాధుల చేత భేదము పొందినట్లు, కన్పించుచున్నట్లుగా ఈ అఖండ చైతన్యము, ఉపాధులు మూలముగా భేదము పొందినట్లు కనిపించుచున్నది.

వాస్తవమున భేదము లేకపోయినప్పటికి, ఈ లోకమందు అజ్ఞానులు ఆత్మధర్మమును, అనాత్మయగు శరీరధర్మములందు చూచి, ఆత్మను అనేకముగా తలంచుచున్నారు. ఎవరు ఈ విధముగా ఆత్మను అనేకముగా చూచుచున్నారో వారు మృత్యువు నుండి మృత్యువును పొందుచున్నారు. సర్వ భేద రహితమైనటువంటి అద్వితీయ బ్రహ్మమును ఎఱిగిన వారు, అమృతత్వమును పొందుచున్నారు.)

చాలా ముఖ్యమైనటువంటి అంశాలను ఇక్కడ మనకు అందించే ప్రయత్నము చేస్తున్నారు. దీనినే ఆత్మానాత్మ వివేకము అంటారు. ఏక స్వరూపము ఆత్మ. అనేక స్వరూపము అనాత్మ. ఇది ప్రాథమికమైనటువంటి లక్షణము. ఏదైనా ఒక అంశాన్ని మనం విచారించాలంటే, ఇది ఏకత్వములోకి తీసుకువెళ్తుందా? అనేకత్వములోకి తీసుకు వెళ్తుందా? అనేటటువంటి విచారణని చేయాలి.

ఎప్పుడైతే అది అనేకత్వ స్థితికి దారి తీస్తుందో లేదా అనేకత్వం అనే లక్షణంతో ప్రకాశిస్తోందో, భాసిస్తోందో, లేదు ఆభాసగా ఉన్నదో, అప్పుడు అదంతా అనాత్మ. ఈ ఆత్మానాత్మ విచారణ మానవులందరూ తప్పక చేయాలి. సాధకులు ముఖ్యంగా చేయాలి. సాధన చతుష్టయ సంపత్తి కలవారు, నిరంతరాయంగా ఈ ఆత్మానాత్మ విచారణ చేయాలి. చేసి ఆత్మ వస్తువును ఆశ్రయించాలి.

అనాత్మ వస్తువును త్యజించాలి. ఈ లోకములో రెండు లక్షణములతో వస్తువులు ప్రకాశిస్తున్నాయి. వస్తువులకు ఉనికి ఉన్నది. ఒకటేమో ఆత్మ వస్తువు. రెండవది అనాత్మ వస్తువు. మరి రెండూ ఒకచోటే ఉన్నాయి. వింతైన విషయమేమింటంటే, రెండూ వేరువేరుగా వేర్వేరు ప్రదేశాలలో ఉంటే, సులభంగా గుర్తించవచ్చు. కానీ రెండు వస్తువులు ఒక్కచోటే ఉన్నాయి. దీనికొక ఉదాహరణ చూద్దాము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


03 Jan 2021

No comments:

Post a Comment