గీతోపనిషత్తు -190


🌹. గీతోపనిషత్తు -190 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 31

🍀 31. ఏకాత్మ బుద్ధి - ఎవడు సమస్త భూతముల యందున్న నన్ను దర్శించి సేవించు చున్నాడో, సర్వత్ర అట్లే వర్తించుచున్నాడో, అట్టి యోగి నాయందే వసించును, వర్తించును. ఈ శ్లోకమున “ఏకత్వ మాస్థితః"అనునది ప్రధానము. సర్వ భూతముల యందు స్థితిగొన్న నన్ను భేదబుద్ధిలేక ఎవడు దర్శించి సేవించునో అట్టి యోగి నా యందే వర్తించు చున్నాడు, నాయందే వసించు చున్నాడు అని దైవము పలుకుటలో జీవులు చూపించు భేదబుద్ధిని హెచ్చరిక చేయుచున్నాడు. భేదబుద్ధి తొలగనిదే దైవము కనపడడు. భేదబుద్ధిని విసర్జించిన వానికే అందరియందున్న ఒకే దైవము కనిపించును. ఇది ముమ్మాటికి సత్యము. 🍀

సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వ స్థితః |
సర్వథా వర్తమానో2పి స యోగీ మయి వర్తతే || 31


ఎవడు సమస్త భూతముల యందున్న నన్ను దర్శించి సేవించు చున్నాడో, సర్వత్ర అట్లే వర్తించుచున్నాడో, అట్టి యోగి నాయందే వసించును, వర్తించును. ఈ శ్లోకమున “ఏకత్వ మాస్థితః"అనునది ప్రధానము. సర్వ భూతముల యందు స్థితిగొన్న నన్ను భేదబుద్ధిలేక ఎవడు దర్శించి సేవించునో అట్టి యోగి నాయందే వర్తించు చున్నాడు, నాయందే వసించు చున్నాడు అని దైవము పలుకుటలో జీవులు చూపించు భేదబుద్ధిని హెచ్చరిక చేయుచున్నాడు.

చిన్నవాడని - పెద్దవాడని, ధనవంతుడని - పేదవాడని, అధికారియని - సేవకుడని, పాపియని- పుణ్యుడని, జ్ఞానియని - అజ్ఞానియని, ఉత్తముడని - అధముడని, స్వర్గమని - నరకమని భేదబుద్ది జీవులకున్నది గాని దైవమునకు లేదు. దైవమునది అభేద బుద్ధి. రామకృష్ణాదుల జీవితములలో ఈ అభేదబుద్ధిని దర్శించవచ్చును. భేదబుద్ధి తొలగనిదే దైవము కనపడడు.

భేదబుద్ధిని విసర్జించిన వానికే అందరియందున్న ఒకే దైవము కనిపించును. మతభేదము కల వారెవ్వరును దైవమును చూచినవారు కాదు. ఇది ముమ్మాటికి సత్యము. మనకు యిష్టమైన వానియందు, యిష్టము కాని వానియందు కూడ దైవమున్నాడు. ఈ సత్యము నంగీకరించుకొలది దైవమునకు చేరువగుదుము. దర్శించినకొలది, అట్లే అభేద బుద్ధితో సేవించినకొలది దైవముతో యోగము సంభవించును.

అట్టివాడు అన్ని వ్యవహారముల యందును దైవముతోనే వర్తించుచు, ఆనందము చెందుచు నుండును. అతడే నిజమగు యోగి. అభేద బుద్ధిని ఏకాత్మ బుద్ధి యందురు. ఒకే దైవమును అన్నిట భేదము లేక దర్శించుట ఏకాత్మబుద్ధి. అట్టి ఏకాత్మబుద్ధి కలవాడు ఏ మార్గమునందు వర్తించుచున్న వాడైనను, అతడు యోగస్థితి యందున్నట్లే. “సర్వధా వర్తమానోపి "అనుటలో అతడు వర్తించు మార్గమేదైనను తనకు సమ్మతమే అని అర్థము.

భగవద్భక్తులలో ఉత్తమోత్తములైన వారు కుమ్మరులుగను, వడ్రంగులుగను, మాంసము నమ్ముకొను వారుగను, గోపాలకులుగను, గొట్టెల కాపరులుగను కూడ వర్తించిరి. దైవముతో కూడియున్న వానికి ప్రాపంచిక విలువలతో సంబంధము లేదు. ఇట్టివారు మహెన్నత శీలసంపత్తి కలవారు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


24 Apr 2021

No comments:

Post a Comment