శ్రీ శివ మహా పురాణము - 390



🌹 . శ్రీ శివ మహా పురాణము - 390🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 17

🌻. ఇంద్ర మన్మథ సంవాదము - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ దేవతలు వెళ్లిపోగానే దురాత్ముడగు తారకాసురునిచే మిక్కలి పీడింపబడియున్న ఇంద్రుడు మన్మథుని స్మరించెను (1). వసంతునితో కూడి యుండువాడు, రవీదేవికి ప్రియుడు, గర్విష్ఠి, రతీదేవితో కూడియున్నవాడు, ముల్లోకములను జయించువాడు అగు కామప్రభుడు వెంటనే వచ్చెను (2). వత్సా! తరువాత మహోన్నతమగు మనస్సు గల మన్మథుడు ప్రణమిల్లి ఇంద్రుని ఎదుట అంజలి ఘటించి నిలబడి ఇంద్రునితో నిట్లనెను (3).

మన్మథుడిట్లు పలికెను-

నీకు కలిగిన ఏమి? నన్ను స్మరించుటకు కారణమేమి? ఓ దేవరాజా! విషయమును చెప్పుము. నీవు చెప్పు పనిని చేయుటకు వచ్చితిని (4).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ మన్మథుని ఆ మాటను విని దేవరాజగు ఇంద్రుడు 'బాగున్నది, బాగున్నది' అని స్తుతిస్తూ ప్రేమ పూర్వకముగా నిట్లు పలికెను (5).

ఇంద్రుడిట్లు పలికెను-

ఓ మన్మథా! నాకు పని కలుగగానే నీవు దానిని చేయుటకు సంసిద్ధుడవైతివి. నీ ఈ ఉద్యమశీలత కొనియాడదగినది.నీవు ధన్యుడవు (6). నేను ప్రస్తుతంలో నీ ఎదుట చెప్పబోవు పలుకుల నాలకించుము. నా కర్యము నీ కార్యమే గాని మరియొకటిగాదు (7). నాకు అనేక మంది గొప్ప గొప్ప మిత్రులు గలరు. మన్మథా ! కాని నీవంటి మంచి మిత్రుడు ఎక్కడనూ లేడు (8). కుమారా! నా విజయము కొరకై రెండు నిర్మింపడినవి. ఒకటి ఉత్తమమగు నా వజ్రము. రెండవది నీవు. వజ్రము నిష్ఫలము కావచ్చును. కాని నీవు ఎన్నడునూ నిర్వీర్యుడవు కావు (9).

ఏవడు హితమును చేగూర్చునో, వానికంటె అధిక ప్రీతిపాత్రుడు మరెవ్వరు ఉందురు? కావున, నీవు నామిత్రులలో శ్రేష్ఠుడవు. నా కార్యమును నీవు చేయదగుదువు (10). నాకు కాల ప్రభావముచే అసాధ్యమగు దుఃఖము సంప్రాప్తమైనది. దానిని నీవు తక్క మరియొకరు ఎవరైననూ దూరము చేయజాలరు (11). దుర్భిక్షము నెలకొన్నప్పుడు దాత యొక్క దాతృత్వము, యుద్ధమునందు శూరుని శౌర్యము, ఆపద వచ్చినపుడు మిత్రుని మైత్రి, భర్త అసమర్థుడయినప్పుడు కుల స్త్రీల పాతివ్రత్యము నిగ్గుతేలును (12). కష్టము వచ్చినపుడు వినయము, పరోక్షమునందు వ్యర్థము కాని మంచి స్నేహము నిగ్గుదేలును. వీటి పరీక్షకు మరో మార్గము లేదు. నేను సత్యమును పలికితిని (13)

ఓ మిత్రశ్రేష్ఠా! నాకు ఆపద వచ్చినది. దానిని ఇతరులెవ్వరూ వారించలేరు. ఈనాడు ఇది నీకు పరీక్షకాగలదు (14). ఈ పని కేవలము నా వ్యక్తిగత కార్యము కాదు. దీనియందు దేవతలు, ఇతరులు అందరి క్షేమము ఇమిడియున్నది. దీనిలో సందియము లేదు (15).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

24 Apr 2021

No comments:

Post a Comment