గీతోపనిషత్తు -192


🌹. గీతోపనిషత్తు -192 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚


శ్లోకము 33, 34

🍀 33, 34 . సంశయము - సామాన్య మానవుల మనస్సు ఇంద్రియముల ద్వారమున బాహ్య ప్రపంచమందు లగ్నమై యుండును. ప్రపంచము ఎప్పటికప్పుడు మారుచుండును గనుక, ప్రపంచమున మార్పు సహజము గనుక దాని ప్రభావము మనస్సుపై నిరంతర ముండుటచే మనస్సు అహర్నిశలు చంచలమై యుండును. యోగమునకు అచంచలమగు మనస్సు ప్రధానము. చంచలమగు మనస్సుతో అచంచలము అగు మనస్సును ఎట్లు నిర్మించుట జరుగును అన్నది అర్జునుని మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న మనస్సు కలుగజేయు సంక్షోభము. కావుననే యోగాభ్యాసము ఆవశ్యకమై నిలచినది. 🍀

యో-యం యోగస్యయా ప్రోక్త స్సామ్యేన మధుసూదన |
ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరామ్ || 33

చంచలం హిమనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్ |
తస్యాహం నిగ్రహం మన్యే వాయో రివ సుదుష్కరమ్ || 34

ఓ మధుసూదనా! ఏ యోగమునైతే నీవు సామ్యముగా తెలిపితివో ఆ స్థిరమగు యోగమును మనస్సాంచల్యము చేత నేను తెలుసుకొనజాలకున్నాను. ఓ కృష్ణా! మనసు చాల చంచలమైనది. సంక్షోభములను కలుగజేయుచు నుండును. స్వభావవశమున దాని బలము దాని కున్నది. దానిని నిగ్రహించుట, అచంచలముగ నేర్పరచుట గాలిని పిడికిలిలో పట్టియుంచుటవలె చాల కష్టమని నా కనిపించు చున్నది.

పై రెండు శ్లోకములలో అర్జునుడు నరజాతి ప్రతినిధివలె పరిప్రశ్నము చేసెను. అతడు నరుడు. శ్రీకృష్ణుడు నారాయణుడు. నారాయణునకు ఆత్మవశమున బుద్ధి, బుద్ధివశమున చిత్తము యుండును. కనుక అతడు స్వామి. అది అతని సహజస్థితి. అట్లే నరుల సహజస్థితి చంచలమగు మనస్సున కధీనులై యుండుట.

సామాన్య మానవుల మనస్సు ఇంద్రియముల ద్వారమున బాహ్య ప్రపంచమందు లగ్నమై యుండును. ప్రపంచము ఎప్పటికప్పుడు మారుచుండును గనుక, ప్రపంచమున మార్పు సహజము గనుక దాని ప్రభావము మనస్సుపై నిరంతర ముండుటచే మనస్సు అహర్నిశలు చంచలమై యుండును. యోగమునకు అచంచలమగు మనస్సు ప్రధానము.

చంచలమగు మనస్సుతో అచంచలము అగు మనస్సును ఎట్లు నిర్మించుట జరుగును అన్నది అర్జునుని మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న మనస్సు కలుగజేయు సంక్షోభము. సన్నిశేముల యందు మనస్సు సంక్షోభము కలుగజేయును. ఆ సంక్షోభము నుండి బయల్పడుటెట్లు? అంతియే గాక అభ్యాసవశము చేత మనస్సెప్పుడు పరుగిడుతునే యుండును. దేహాంద్రియాదులను క్షోభ పెట్టును. బలము గలదై ఆంబోతు వలె ప్రవర్తించును.

మనో వేగమును మించిన వేగము లేదు. భావముల పరుగు ఇంతింత అని తెలుపలేము. పట్టశక్యము కాని విధముగ అది చిందులు వేయును. దానిని పట్టుట సాధ్యమా? లేడిని, కుందేలును పట్ట వచ్చును. చురుకైన జంతువును పట్టవచ్చును. పట్టశక్యము కాని మనస్సును పట్టుటెట్లు? పట్టినను, గాలి మూటకట్టినట్లు ఉండును గాని, పట్టు చిక్కదు. కావున శ్రీకృష్ణుడు తెలిపిన యోగము దుష్కరమేగాక అతి దుష్కరమని అర్జునుడు నిశ్చయముగ పలికినాడు. అర్జునుని ఈ ప్రశ్న యోగసాధకు లందరికి వింతయైన విషయమే. కావుననే యోగాభ్యాసము ఆవశ్యకమై నిలచినది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


01 May 2021

No comments:

Post a Comment