శ్రీ శివ మహా పురాణము - 392


🌹 . శ్రీ శివ మహా పురాణము - 392🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 17

🌻. ఇంద్ర మన్మథ సంవాదము - 3 🌻


ఒకప్పుడు దేవతలందరు వానితో యథాశక్తిగా యుద్ధమును చేసిరి. వారి అందరి ఆయుధములు ఆతనియందు వ్యర్థమైనవి (32). వరుణుని పాశము భగ్నమయ్యెను. విష్ణువు సుదర్శన చక్రమును ఆతనిపై ప్రయోగించగా, అది మొక్కవోయి ఆతని కంఠములో పడెను (33). మహాయోగీశ్వరుడగు శంభుని కుమారుని చేతిలో ఈ దుష్టుడు మరణించునని బ్రహ్మ చెప్పెను (34). ఓ మిత్ర శ్రేష్ఠమా! కావును నీవీ పనిని గొప్ప ప్రయత్నమును చేసి సాధించవలెను. ఈ కార్యము సిద్ధించినచో, దేవతలకు మహా సుఖము కలుగును (35).

సర్వలోకములకు సుఖము నీయగలిగే ఈ కర్మను ఆ కారణము చేతనే నేను తప్పక చేయదగియున్నది. నీవు స్నేహ ధర్మమును మనసునందిడుకొని ఇపుడీ పనిని చేయదగుదువు (36). ఆ శంభుడు హిమవత్పర్వతము నందు గొప్ప తపస్సును చేయుచున్నాడు. ఆ ప్రభుడు కామమునకు వశుడు కాడు. ఆయన స్వతంత్రుడగు పరమేశ్వరుడు (37). ఓ కామదేవా! తండ్రి ఆజ్ఞచే పార్వతి తన సఖురాండ్రతో గూడి శివుని సమీపమునందుండి ఆయనను సేవించుచున్నదని నేను వినియుంటిని (38). జితేంద్రియుడగు శివునకు ఆమె యందు గొప్ప ప్రేమ కలుగునట్లు నీవు చేయవలెను. మన్మథా! నీవీ కార్యమును తప్పక సఫలము చేయవలెను (39).

నీవీ కార్యమును చేసి కృతార్థుడవు కమ్ము. దుఃఖమంతయూ నశించగలదు. నీ ప్రతాపము లోకమునందు చిరస్థాయిగా నుండగలదు. దీనికి భిన్నముగా జరిగే అవకాశము లేదు (40).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఇంద్రుడిట్లు పలుకగా, వికసించిన పద్మము వంటి ముఖము గల మన్మథుడు ఇంద్రునితో 'ఈ పనిని నిస్సందేహముగా చేసెదను' అని ప్రేమతో పలికెను (41). శివమాయచే విమోహితుడై ఆ మన్మథుడు ఇంద్రునితో నిట్లు పలికి, తన అంగీకారమును తెలిపి వెంటనే ఆయన వద్ద సెలవు తీసుకొనెను (42). ఆతడు భార్యతో వసంతునితో గూడి ఆనందముతో యోగీశ్వరుడగు శివుడు స్వయముగా గొప్ప తపస్సును చేయుచున్న స్థానమునకు వెళ్లెను (43).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో ఇంద్రమన్మథ సంవాద వర్ణనమనే పదిహేడవ అధ్యాయము ముగిసినది (17).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


01 May 2021

No comments:

Post a Comment