గీతోపనిషత్తు -194


🌹. గీతోపనిషత్తు -194 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚


శ్లోకము 35 - 2

🍀 34. అభ్యాసము - నిత్యానిత్య వస్తువివేకమే వైరాగ్యమునకు మూలము. ఏది నిత్యము, ఏది అనిత్యము అను విచక్షణ లేనపుడు వైరాగ్యమునకు తావు లేదు. తానొకడే నిత్యుడు. దేహముతో పాటు తన కేర్పడినవన్నీ అనిత్యము. తాను నేర్చినది కూడా తనతోపాటు జన్మ జన్మలు అనుసరించు చుండును, జ్ఞానము - అజ్ఞానము, బలము - బలహీనత కూడా వాసనల రూపమున వెంటనంటి వచ్చు చుండును. వైరాగ్యము కొరకై దేనినైననూ విసర్జించుట కృష్ణుడిచ్చిన మార్గము కాదు. విసర్జించుట, నిర్జించుట, బహిష్కరించుట అనునవి విరాగికి వుండవు. అట్లే అంటుకొని యుండుట కూడా వుండదు. వైరాగ్యమునకు రెండు ప్రధానమగు విఘ్నములు కలవు. ఒకటి మమకారము, రెండు అహంకారము. అతడే తానుగ నున్నాడు అని నిశ్చయమైనపుడు యిక తనను గూర్చి భావన జారును. అదియే నిరహంకార స్థితి. 🍀

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ |
అభ్యా సేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్య తే || 35

కేవలము కర్తవ్యములను మాత్రము నిర్వర్తించుచు, సమయము వృధా చేయక విచక్షణా బుద్ధితో జీవించుడని తెలిపినాడు. ఇవి యన్నియు 15, 16, 17, 18, 19వ ధ్యాన యోగము 119 శ్లోకములలో తెలిపినాడు. ఈ మాత్రపు నియమములను పాటించి నచో ప్రాథమికమగు వైరాగ్యమబ్బును. దాని వలన మనస్సు కప్పగంతులు వేయక, చిందులు తొక్కక ఏకోన్ముఖమై యుండును.

కుందేలు నడకగా కాక, తాబేలు నడకగ సాగును. సాధన సిద్ధించును. నిత్యానిత్య వస్తువివేకమే వైరాగ్యమునకు మూలము. ఏది నిత్యము, ఏది అనిత్యము అను విచక్షణ లేనపుడు వైరాగ్యమునకు తావు లేదు. సాధకులకు రెంటియందు ఆసక్తి కలగాపులగముగా నుండును. అతడు నిత్య దినచర్యయందు భాగముగ నిత్యమగు విషయమేమి? అనిత్యమగు విషయమేమి? అని విచారించి తెలుసుకొనుచుండును. తానొకడే నిత్యుడు. దేహముతో పాటు తన కేర్పడినవన్నీ అనిత్యము.

తాను నేర్చినది కూడా తనతోపాటు జన్మ జన్మలు అనుసరించు చుండును, జ్ఞానము - అజ్ఞానము, బలము - బలహీనత కూడా వాసనల రూపమున వెంటనంటి వచ్చు చుండును. అట్లే కళత్ర బాంధవ్యము, సంతానము, బంధు మిత్రులు, పరిచయములు, ఆస్తిపాస్తులు కూడా ఏర్పడుచుండును. ఇది ఏర్పడుటకు కూడా శుభాశుభ వాసనలే కారణము. శుభవాసనలు శ్రేయస్కరమగు సంపర్కముల నిచ్చును.

అశుభ వాసనలు అపాయము కల్గించు సంపర్కముల నిచ్చును. ఇవి అన్నియు మిశ్రమముగా సంస్కారముల రూపమున వెంటనంటి వచ్చుచుండును.

ధనికుడగుట, పేదయగుట, పురుషుడగుట, స్త్రీ యగుట యిత్యాది వన్నియూ కూడ సంస్కారముల కారణముగనే జరుగును. తాను జీవుడని మాత్రము గుర్తుండుట, జీవుడుగా తాను దేవునికి చెందినవాడని కూడా గుర్తుండుట వైరాగ్యమునకు చిహ్నము. ఇతరమగు సంబంధములన్నియు దైవలీలగా భావించి దైవవిలాసమున తన పాత్రను హెచ్చుతగ్గులు లేక పోషించువాడు విరాగి.

వైరాగ్యము కొరకై దేనినైననూ విసర్జించుట కృష్ణుడిచ్చిన మార్గము కాదు. విసర్జించుట, నిర్జించుట, బహిష్కరించుట అనునవి విరాగికి వుండవు. అట్లే అంటుకొని యుండుట కూడా వుండదు. కేవలము ప్రేమపూర్వకమగు జీవ సంబంధమే యుండును. జీవుడు సహజముగ ప్రేమ స్వరూపుడు గనుక, అది ఒక్కటి జ్ఞానమై మిగులును.

ఇట్టి వైరాగ్యము సిద్ధించుటకు నిత్య స్మరణ మార్గమొకటి యున్నది. “నేను జీవుడను. జీవుడుగా దైవ కుమారుడను. అట్లే సమస్త జీవులునూ. వారును దైవమునుండి ఉద్భవించినవారే. జీవులుగా అందరునూ సమానులే. అందరి యందు నేను సోదరభావమును ప్రయత్నింతును. ఇతరమగు విషయములయందు నాకున్నది పాత్ర పోషణమే. దానిని శ్రద్ధ, భక్తి, అనురక్తిలతో నిర్వర్తించెదను.

ఇట్టి జ్ఞానము చర్యలలో నిలబడుటకు నా కాధారము దైవమే. అనిత్యమగు విషయము లందు అనాసక్తి చూపక, అట్లని మమకారపడక జీవించు శౌర్యము కూడ నాకు దైవమే ఈయవలెను.

వైరాగ్యమునకు రెండు ప్రధానమగు విఘ్నములు కలవు. ఒకటి మమకారము, రెండు అహంకారము. పై స్మరణమున మమకారము కల్గిననూ అహంకారము యింకనూ యుండును. అది కలుగుటకు దైవమే నేనై యున్నాను, అతడే నేనుగ నున్నాను అని కూడా భావింపవలెను. శ్వాస రూపమున ఈ సత్యమునే హృదయము పలుకుచున్నది.

దానినే సంస్కృతమున 'సోహమస్మి' అను మంత్రముగ తెలిపిరి. దీనిని నిత్యము అనుష్ఠానము చేయు వానికి అహంకారము తొలగును. అతడే తానుగ నున్నాడు అని నిశ్చయమైనపుడు యిక తనను గూర్చి భావన జారును. అదియే నిరహంకార స్థితి. ఇట్టి వైరాగ్యము భావనాపరముగ నిత్యము పటిష్ఠము గావించుకొనుచూ, ముందు తెలిపిన అభ్యాసమును నిర్వర్తించుచూ యోగసాధకుడు క్రమముగా యోగసిద్ధి దిశకు సాగును. ఈ కారణముగనే అభ్యాసము, వైరాగ్యము రెంటిని సాధనములుగ భగవంతుడు పేర్కొనినాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

06 May 2021

No comments:

Post a Comment