🌹 . శ్రీ శివ మహా పురాణము - 394 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 18
🌻. కాముని విజృంభణము - 2 🌻
ఈ విధముగా మన్మథుడు విజృంభించగా, శృంగారరసము కూడా హావ భావములతో కూడివదై అచట గణములతో గూడియున్న శివుని సమీపమును చేరుకొనెను (17). మనోభవుడగు మన్మథుడు అచట ప్రకటముగా బయటనే నివసించజొచ్చెను. కాని ఆతడు శంభుని ధైర్యమును చెదరగొట్టుటకు ఉపకరించు దుర్బలతను ఆయనలో కనుగొన లేకపోయెను (18). అపుడు యోగిశ్రేష్ఠుడగు ఆ మహాదేవుని యందు దౌర్బల్యమును గానరాక ఆ మన్మథుడు మహా భయమును పొంది మోహితుడాయెను (19). మండే జ్వాలలతో గూడిన అగ్నిని పోలియున్న మూడవ కంటితో గూడియున్న శంకరుడు ధ్యానము నందుండగా, ఆయనను సమీపంచి ఆయన ధ్యానమును చెదరగొట్టగలిగే సామర్థ్యము ఎవరికి గలదు ? (20)
ఇంతలో అచటకు సఖురాండ్రిద్దరితో గూడి పార్వతి అనేక పుష్పములను తీసుకొని శివపూజ కొరకు వెళ్లెను (21). భూమండలములో దేనిని మానవులు గొప్ప సౌందర్యమని వర్ణింతురో, ఆ సౌందర్యమంతయూ మాత్రమే గాక, అంతకంటె అధికమగు సౌందర్యము కూడ పార్వతియందు నిశ్చితముగా గలదు (22). ఆ యా ఋతువులలో పూసిన అందమగు పుష్పములను ధరించిన సమయములో ఆమె సౌందర్యమును వర్ణించుటకు వంద సంవత్సరముల కాలమైననూ చాలదు (23). ఏ క్షణములో ఆ పార్వతి శివుని సమీపమునకు వెళ్లినదో, అదే సమయములో శంకరుడు క్షణకాలము ధ్యానమును వీడి యుండెను (24).
ఆ లొసుగును కనిపెట్టిన మన్మథుడు ముందుగా హర్షణము అనే బాణముతో పార్వతి ప్రక్కన ఉన్న చంద్రశేఖరుని హర్షింపజేసెను (25). ఓ మహర్షీ! అపుడు శృంగార భావములతో గూడిన పార్వతి వసంతునితో బాటు మన్మథునకు సహాయపడు విధముగా శివుని వద్దకు వెళ్లెను (26). అదే సమయములో మన్మథుడు జాగరూకతతో తన ధనస్సును ఎక్కుపెట్టి శూలధారియగు శివునియందు ప్రేమను ఉత్పన్నము చేయుట కొరకై వెనువెంటనే పుష్పబాణమును ప్రయోగించెను (27).
ప్రతి దినము విడువకుండగా ఆమె ఏ తీరున శివుని వద్దకు వచ్చెడిదో, సరిగా అదే విధముగా ఆమె వచ్చి, నమస్కరించి, పూజచేసి ఆయన యెదుట నిలబడెను (28). అచట స్త్రీ స్వభావము వలన మిక్కిలి లజ్జతో పార్వతి నిలబడి యుండగా ఆమె అవయవములలో ప్రకటమగు చున్న శోభను కైలాసపతి యగు శివప్రభుడు చూచెను (29). పూర్వము ఆమెకు బ్రహ్మ ఇచ్చిన వరమును శివుడు స్మరించుకొనెను. ఓ మహర్షీ! అపుడా ప్రభుడు ఆనందముతో ఆమె అంగములను వర్ణించెను (30).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
06 May 2021
No comments:
Post a Comment