గీతోపనిషత్తు -236
🌹. గీతోపనిషత్తు -236 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚
శ్లోకము 18 - 1
🍀 17 - 1. వ్యక్తా వ్యక్తములు - ఉషః కాలమునుండి క్రమముగ వెలుగేర్పడు చుండగ సమస్త జీవులు ఎట్లు మేల్కాంచునో అట్లే సృష్టి ఉషస్సు నందు క్రమముగ సృష్టి, సృష్టిజీవులు ఏర్పడుచు, సృష్టి నిర్మాణ మగుననియు, మరల సాయంకాలము నుండి సృష్టి తిరోధానము చెందుచు అవ్యక్తము లోనికి చనుననియు తెలుపబడినది. 🍀
అవ్యక్తా ద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే
రాత్ర్యాగమే ప్రలీయంతే తతైవావ్యక్త సంజ్ఞకే || 18
తాత్పర్యము : అహస్సు ఆగమము నందు అవ్యక్తము నుండి సమస్తము క్రమముగ వ్యక్తమగునని, అట్లే సాయం సంధ్యా గమనము నుండి ప్రారంభమగు రాత్రికాలమున అంతయు అవ్యక్తము లోనికి పోవుననియు ఈ శ్లోకము తెలియపరుచు చున్నది.
వివరణము : ఉషః కాలమునుండి క్రమముగ వెలుగేర్పడు చుండగ సమస్త జీవులు ఎట్లు మేల్కాంచునో అట్లే సృష్టి ఉషస్సు నందు క్రమముగ సృష్టి, సృష్టిజీవులు ఏర్పడుచు, సృష్టి నిర్మాణ మగుననియు, మరల సాయంకాలమునుండి సృష్టి తిరోధానము చెందుచు అవ్యక్తము లోనికి చనుననియు తెలుపబడినది. మనము కూడ నిద్ర నుండి మేల్కాంచినపుడు క్రమముగ ప్రపంచమున ప్రవేశించుచు, రాత్రియగుసరికి నిద్రలోనికి తిరోగమనము చెందుచు నుందుము. పగటియందు వ్యక్తమై యున్నను, రాత్రియందు అవ్యక్తములోనికి జారిపోవుచుందుము.
మెలకువ వచ్చినది మొదలు క్రమముగ మనయందలి ఎరుక వ్యాప్తి చెందుచు మిట్టమధ్యాహ్నమునకు తారాస్థాయిని చేరును. సాయంత్రము వరకు వ్యక్తముననే వర్తించుచు రాత్రి సమయమున తిరోగమించి నిద్రలోనికి కొనిపోబడును. మన పగలు, మన రాత్రి ఎట్లో బ్రహ్మదేవుని పగలు, రాత్రి అట్లే. కాని పరిమాణము విషయమున దోమకు, ఏనుగుకు గల తేడా యున్నది. పరిమాణమున భేదమున్నను సూత్ర మొక్కటియే.
రాత్రియందు నిద్రాస్థితిలో మనమందరము అవ్యక్తముగనే యున్నాము. మనమెట్లుంటిమో మనకు తెలియదు. మెలకువ వచ్చినది మొదలు మనమున్నామని తెలియుట, మనకు అనేకానేక ఊహలు జనించుట, ఉక్కిరి బిక్కిరిగ కార్యక్రమములు నిర్వర్తించు కొనుట చేయుదుము. మరల రాత్రియందు నిదుర ఆవేశించి, అవ్యక్తములోనికి గొని పోబడినపుడు మనమున్నామని గూడ తెలియదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
07 Aug 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment