శ్రీ శివ మహా పురాణము - 436

🌹 . శ్రీ శివ మహా పురాణము - 436🌹 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴 

అధ్యాయము - 27

🌻. బ్రహ్మచారి శివుని నిందించుట - 2 🌻

బ్రాహ్మణుడిట్లు పలికెను-

మహాదేవుడు వృషభము ధ్వజమునందు గలవాడు, భస్మచే లిప్తమైన దేహము గలవాడు జటలను ధరించువాడు, పెద్దపులి, చర్మమును వస్త్రముగా ధరించువాడు, ఏనుగు చర్మము ఉత్తరీయముగా గలవాడు (12). ఆయన కపాలమును ధరించును. ఆయన శరీరమంతయూ పాములచే చుట్టబడి యుండును ఆయన విషమును ధరించి యుండును. ఆయన తినకూడని పదార్ధములను తినును. వికృతమగు కన్నులుగల ఆయనను చూచినచో భయము కలుగును(13).

ఆయన పుట్టుక గురించి ఎవ్వరికి తెలియదు. ఆయన ఏనాడూ గృహ సుఖములనెరుంగడు. ఆయన దిగంబరుడు పది చేతులు గలవాడు. భూతప్రేతములు సర్వదా ఆయనను చుట్టువారి యుండును. (14). ఆయనను నీవు భర్తగా కోరుటకు కారణమేమి? ఓ దేవీ! నీ జ్ఞానము ఎచ్చటకు పోయినది? నాకీ విషయమును ఆలోచించి చెప్పుము (15). 

నేనాతని భయంకరమగు వ్రతమును గూర్చి పూర్వమే వినియుంటిని. నీకు కూడా వినుట యందు అభిరుచియున్నచో, ఇప్పుడు చెప్పెదను. వినుము(16) దక్షపుత్రి, ప్రతివ్రత యగు సతి వృషభము వాహనముగా గల శివుని పూర్వము దైవవశముచే భర్తగా పొందెను. ఆమె పొందిన భోగము అందరికీ తెలిసినదే(17).

సతీదేవి కపాలమును ధరించువాని భార్యయను కారణముచే దక్షుడామెను తిరస్కరించినాడు. మరియు యజ్ఞములో భాగము ఈయబడే దేవతలలో శంభుని జేర్చలేదు.(18) ఆ అవమానముచే మిక్కిలి కోపమును, దుఃఖమును పొందిన సతీదేవి శంకరుని విడిచిపెట్టి, ప్రియమగు ప్రాణములను కూడ త్యజించెను(19). 

నీవు స్త్రీలలో గొప్పదానవు నీ తండ్రి పర్వతములన్నింటికీ రాజు. నీవు ఉగ్రమగు తపస్సును అట్టి భర్తను పొందవలెననే కోరికతో ఏల చేయుచున్నావు?(20) బంగరు నాణమునిచ్చి నీవు గాజు ముక్కనుపొందగోరుచున్నావు. నీవు స్వచ్ఛమగు చందనమును త్రోసిపుచ్చి బురదను శరీరముపై లేపనము చేయగోరుచున్నావు.(21)

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


07 Aug 2021 

No comments:

Post a Comment