గీతోపనిషత్తు -108
🌹. గీతోపనిషత్తు -108 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్లోకము 39 - 3
🍀 34 - 3. యత యింద్రియత్వము :
శ్రద్ధ, తదేక నిష్ఠతో పాటుగ యమింపబడిన యింద్రియములను గూర్చి దైవము పలికినాడు. ఇంద్రియ నియమము జీవుని బాహ్య ప్రజ్ఞకు సంబంధించినది. శ్రద్ధ, నిష్ఠ అంతర్ముఖ ప్రజ్ఞకు సంబంధించినది. అంతఃకరణములు, బహిఃకరణములు సవ్యముగ నిర్వర్తింప బడుటయే గాక, అన్నిటి నుండియు అఖండమై 'తాను' అను ప్రజ్ఞ ప్రసరించినపుడే జ్ఞానమున కర్హత అని తెలియవలెను. అట్టి అఖండ ప్రజ్ఞ కలవారే పరమశాంతి కర్హులు. శ్రద్ధ, నిష్ఠ, యింద్రియ నిగ్రహము. ఈ మూడు దీక్షలను స్వీకరించువారు జ్ఞానమున నడచి, బంధములను తొలగించు కొనగలరు. 🍀
శ్రద్ధ, తదేక నిష్ఠతో పాటుగ యమింపబడిన యింద్రియములను గూర్చి దైవము పలికినాడు. ఇంద్రియ నియమము జీవుని బాహ్య ప్రజ్ఞకు సంబంధించినది. శ్రద్ధ, నిష్ఠ అంతర్ముఖ ప్రజ్ఞకు
సంబంధించినది.
బాహ్యాంతరము లందు చెదరక యుండవలె నన్నచో అంతర్ముఖముగ శ్రద్ధ, నిష్ఠ యుండవలెను. బహిర్ముఖముగ యింద్రియ వ్యాపారములు తన వశమున నుండవలెను. ఇంద్రియముల యందు కన్ను ముఖ్యమే అయినను వానిని వశము చేసుకొనుటలో స్పర్శ, రుచి ముఖ్యమని దైవము మరియొక చోట తెలిపినాడు.
స్పర్శ, రుచి బాహ్యమును అంటును. చూపు, వినికిడి, వాసన సూక్ష్మముగ అంటును. తిన్నది, ముట్టుకున్నది. స్టూలమై, బాహ్యముతో గట్టి సంబంధ మేర్పరచును. అందువలన తినుట, ముట్టుకొనుట అను విషయమున కొంత నియమముండుట ఉపయోగించును.
చూచుట, వినుట, వాసన చూచుట అను విషయముల యందు కూడ నియమము ప్రధానము. చూచునది, వినునది, వాసన చూచునది, రుచి చూచునది, ముట్టుకొనునది, కావలెనని పించుట సామాన్యము. కావలె ననిపించగనె, అవసర మనిపించును. ఇంద్రియార్థముల విషయమున దైవ మొకటే ప్రశ్న పరిష్కారముగ నిచ్చినాడు.
'అవసరమా?' అని యింద్రియార్థముల విషయమున ప్రశ్నించుకొనుట ముఖ్యము. అవసరము లేనివి చూచుట, వినుట, రుచి చూచుట, ముట్టుకొనుట, వాసన చూచుట చేయు వానికి యింద్రియములు బలిష్టమైన గుఱ్ఱములవలె ఐదు దిశల లోనికి లాగుచు నుండును. ఇక ప్రయాణమెక్కడ? రథము ఐదు ముక్కలుగ చీలును. ఇంద్రియములను గుఱ్ఱములను అవసరమునకే వాడవలెను.
ఈ క్రింది విషయములందు అవసరమా? అను ప్రశ్న వేసుకొను చుండవలెను.
1. ఎచ్చటికైన వెళ్లదలచినపుడు, 2. ఏదైన వినదలచినపుడు, 3. తినదలచినపుడు, 4. ముట్టుకొనవలసి వచ్చినపుడు, 5. వాసన చూడ వలసినపుడు.
అవసరము లేక తినుట, తిరుగుట, వినుట, మాట్లాడుట, చూచుట, ముట్టుకొనుట వలన జీవప్రజ్ఞ బాహ్యమున బంధింపబడి యుండును.
బద్ధుడెట్టి కార్యమును నిర్వర్తించలేడు. పంచేంద్రియములందు బద్ధుడైనవాడు కర్మేంద్రియము లందు కూడ బద్దుడగును. ఇట్లు దశేంద్రియములందు బద్దుడై నశించును. కర్మేంద్రియబద్ధుడు ఈ క్రింది విధముగ ప్రవర్తించుచు నుండును.
1. పని లేక తిరుగుట
2. పని లేక వాగుట
3. అవసరము లేని పనులయందు చేతులను వినియోగించుట.
4. మలమూత్రావయవములను నిస్సత్తువ గావించుట.
పంచేంద్రియములను గుఱ్ఱములు, కర్మేంద్రియములతో కూడిన రథమును అవకతవకగ లాగుటచే జీవుడు బాహ్య ప్రజ్ఞ యందే నశించును. ఇక అంతరంగ మెక్కడ. బహిఃకరణములనే
వినియోగించ లేనివాడు అంతఃకరణములను వినియోగింప జాలడు.
అంతఃకరణములు, బహిఃకరణములు సవ్యముగ నిర్వర్తింపబడుటయే గాక, అన్నిటి నుండియు అఖండమై 'తాను' అను ప్రజ్ఞ ప్రసరించినపుడే జ్ఞానమున కర్హత అని తెలియవలెను. అట్టి అఖండ ప్రజ్ఞ కలవారే పరమశాంతి కర్హులు. ఈ శ్లోకము సాధకులకు అత్యంత ప్రాముఖ్యమగు శ్లోకమగుటచే క్లుప్తముగ మరల వివరింపబడు చున్నది.
జీవుడు బాహ్య ప్రపంచమున పనిచేయుటకు మనసు, పంచేంద్రియములు, పంచ కర్మేంద్రియములు అవసరము. అంత రంగమునుండి చిత్తము, బుద్ధి, అహంకారము పనిచేయును. జీవప్రజ్ఞ ఈ క్రింది విధముగ బాహ్యములోనికి ప్రసరించును.
1. అహంకారము, 2. బుద్ధి, 3. చిత్తము, 4. మనస్సు, 5. జానేంద్రియములు (5), 6. కర్మేంద్రియమలు (5), 6. వాక్కు. మొత్తము 15.
ఒక సంకల్పము కలిగినపుడు ఈ పదునైదు పనిచేయు చుండును. సంకల్పము కర్తవ్యమై యున్నచో దానిని నిర్వర్తించ వలెను. కానిచో విసర్జించవలెను. కర్తవ్యమైనపుడు శ్రద్ధతోను, తదేక
నిష్ఠతోను నిర్వర్తించుటకు అంతఃకరణశుద్ధి ముఖ్యము. అందు వలన శ్రద్ధ, నిష్ఠ అనువాటిని ఆయుధములుగ కర్తవ్య కర్మను జ్ఞానేంద్రియములతోను, కర్మేంద్రియములతోను నిర్వర్తించవలెను.
ఈ శ్లోకమున లింగ శరీరమందలి పదునైదు అంశములు అనుసంధానము చేయుటకు వలసిన దీక్షలను దైవము తెలిపి యున్నాడని తెలియవలెను. అవియే శ్రద్ధ, నిష్ఠ, యింద్రియ నిగ్రహము. ఈ మూడు దీక్షలను స్వీకరించువారు జ్ఞానమున నడచి, బంధములను తొలగించుకొనగలరు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
25 Dec 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment