శ్రీ శివ మహా పురాణము - 308


🌹 . శ్రీ శివ మహా పురాణము - 308 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

75. అధ్యాయము - 30

🌻. సతీదేహత్యాగము - 2 🌻


ఆ పెద్ద హాహాకారముతో దిక్కులన్నియు పిక్కటిల్లెను. అచట నున్న దేవతలు, మునులు, ఇతరులు అందరు భయమును పొందిరి (18). ఆ గణములన్నియూ కోపించి, ఆయుధములను పైకెత్తి, పరస్పరము సంప్రదించుకొని, ప్రలయమును సృష్టించనారంభించిరి. వారు చేయు వాద్య ధ్వనులతోనే గాక, వారి శస్త్రములచే దిక్కులు నిండెను (19).

ఓ దేవర్షీ !అచట కొందరు గణములు దుఃఖముచే వ్యాకులులై, ప్రాణములను తీసే మిక్కిలి పదునైన ఆయుధములతో తమ శిరస్సులను, ముఖములను, ఇతరు అవయవములను ఖండించు కొనిరి (20). ఈ విధముగా ఆ సమయమునందు ఇరువది వేల గణములు దక్షపుత్రితో బాటు ప్రాణములను వీడిరి. ఆ దృశ్యము అత్యాశ్చర్యమును కలిగించెను (21).

ఇట్లు నశించగా మిగిలిన, మహాత్ముడగు శంకరుని గణములు ఆయుధములను పైకెత్తి కోపించియున్న ఆ దక్షుని సంహరించుటకు ముందునకురికిరి (22). ఓ మహర్షీ !ఉరుకుచున్న వారి వేగమును విని భృగు మహర్షి యజ్ఞనాశకులగు రాక్షసులను సంహరించే యజుర్వేదమంత్రముతో దక్షిణాగ్ని యందు హోమమును చేసేను (23). భృగువు హోమమును చేసిన వెంటనే మహావీరులు, ఋభునామము గలవారు నగు గొప్ప దేవతలు ఆ అగ్ని నుండి పైకివేలాదిగా లేచిరి (24).

ఓ మహర్షీ! ప్రమథగణములకు, కాగడాలను ఆయుధములుగా ధరించిన ఆ దేవతలకు అచట మిక్కిలి బీభత్సమును కలిగించునది, వినువారికి రోమహర్షణమును కలుగుజేయునది అగు యుద్ధము జరిగెను (25). బ్రహ్మతేజస్సుతో నిండియున్న మహావీరులగు ఆ బు భువులు అన్నివైపుల నుండి ప్రమథ గణములపై దాడి చేయగా, వారి తిరుగు ప్రయాణము వారి యత్నము లేకుండగానే సిద్ధించినది (26).

ఈ విధముగా శివుని మహాశక్తియుతమగు ఇచ్ఛచే ఆఋభువులు శివగణములను కొట్టి వేగముగా తరిమివేసిరి. ఆ దృశ్యము అద్భుతముగ నుండెను (27). అపుడా దృశ్యమును చూచి, ఋషులు, ఇంద్రుడు మొదలగు దోవతలు, మరుద్గణములు, విశ్వే దేవతలు, అశ్వినీ దేవతలు, లోకపాలురు మిన్నకుండిరి (28). వారిలో కొందరు విష్ణుప్రభుని చుట్టూ చేరి ప్రార్థించుచుండిరి. మరికొందరు యజ్ఞము విఘ్నము లేకుండగా జరుగు విధమును ఉద్వేగముతో పునః పునః సమాలోచన చేయుచుండిరి (29).

గొప్ప బుద్ధిశాలురగు విష్ణువు మొదలగు దేవతలు సతీ దేహత్యాగమునకు, శివగణములను తరిమివేయుటకు భవిష్యత్తులో కలుగుబోవు ఫలమును గూర్చి బాగుగా విచారించి తీవ్రమైన ఆదుర్దాను పొందిరి (30). ఓ మహర్షీ! దుష్ట బ్రాహ్మణుడు, శివద్రోహి, దుర్మార్గుడునగు దక్షుని యజ్ఞములో అపుడీవిధమైన విఘ్నము ఘటిల్లెను (31).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండములో సతీదేహత్యాగమనే ముప్పదియవ అధ్యాయము ముగిసినది (30).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


25 Dec 2020

No comments:

Post a Comment