కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 142


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 142 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము - 72 🌻


హిరణ్యగర్భునిచే సృజించబడిన విరాట్ఫురుషుని శాస్త్రము అగ్ని రూపమున వర్ణించుచున్నది. గర్భిణీ స్త్రీలు తమ గర్భమందున్న శిశువునకు ఎటువంటి అపాయము కలుగకుండుటకై శుచియైన ఆహారము తీసుకొని కాపాడుచున్నారో అటులనే అధియజ్ఞుడగు విరాడ్రూప అగ్నిని పై అరణి, క్రింద అరణి అను రెండు అరణుల యందు ఋత్విక్కులు కాపాడుచున్నారు.

అధ్యాత్ముడగు జఠరాగ్నిని యోగులు మితాహారముచే కాపాడుచున్నారు. అట్టి అధియజ్ఞాగ్నిని జాగరణశీలురైన ఋత్విక్కులు ప్రతినిత్యము కాపాడుచున్నారు. విరాడ్రూపమున ఉన్న ఈ అగ్నియు పరబ్రహ్మమే. ఇదియే నీవడిగిన తత్వము.

ఇపుడు హిరణ్యగర్భతత్వాన్ని గూర్చి వివరించ పూనుకుంటున్నారు. సాధకులందరూ ఈ హిరణ్యగర్భ తత్వాన్ని దర్శన రూపంగా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది.

ఎనిమిది తనువులు కలిగినటువంటి ఈ ప్రయాణంలో జీవ తనువులు విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యగాత్మ. విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత పరమాత్మలు ఈశ్వర తనువులు. ఈ ఎనిమిది తనువుల సమాహారమైనటువంటి ‘నేను’ విశ్వుడుగా ప్రారంభించి, విరాట్ పురుషుని వరకు పరిణామం చెందుతూ ఉన్నాడు.

మరల విరాట్ పురుషుని దగ్గర నుండి పరమాత్మ వరకు పరిణామం చెందుతూఉన్నాడు. ఈ పరిణామం అంతా కూడ పిండాండ బ్రహ్మాండ పంచీకరణల యందు స్పష్టంగా బోధించబడుతూఉంది.

జాగ్రత్ సాక్షి యైనటువంటి విశ్వుడు, స్వప్న సాక్షి యైనటువంటి తైజసుడు, సుషుప్తి సాక్షి యైనటువంటి ప్రాజ్ఞుడు, తురీయసాక్షి యైనటువంటి ప్రత్యగాత్మ- విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యగాత్మలు. ఇదే ప్రత్యగాత్మ అనంత విశ్వానికి విరాట్ పురుషుడు గా ఉన్నాడు. పురుష సూక్తం వర్ణించినటువంటి ఏ పురుషుడైతే అక్షర పురుషుడు గా ఉన్నాడో , ఆ అక్షర పురుషుడే ఈ విరాట్ పురుషుడు.

ఈ విరాట్ పురుషుడు మరల ఈశ్వర తనువులలో స్థూలదేహాన్ని కలిగి ఉన్నాడు. ఈశ్వర తనువులలో స్థూలదేహ సాక్షి - విరాట్ పురుషుడు, సూక్ష్మదేహ సాక్షి - హిరణ్యగర్భుడు, కారణ దేహ సాక్షి- అవ్యాకృతుడు, మహాకారణ దేహ సాక్షి- పరమాత్మ. అయితే జీవ తనువులలో తురీయసాక్షి యైనటువంటి ప్రత్యగాత్మ, ఈశ్వర తనువులలో మహాకారణ దేహసాక్షి యైనటువంటి పరమాత్మ అభిన్నులు. ప్రత్యగాత్మ, పరమాత్మ అభిన్నులు. జ్ఞాత, కూటస్థుడు అభిన్నులు.

అయితే సర్వ వ్యాపకంగా ఉన్నటువంటి చైతన్యానికి హిరణ్యగర్భుడుగా సాక్షిగా ఉన్నటువంటి స్థితియందు అనంత విశ్వాన్ని తన లోకి గ్రహించి, గర్భిణీ స్త్రీ వలే ఉన్నాడట. అదీ పోలిక.

ఇక్కడ ప్రతిచోట ఒక ఉపమానాన్ని ఉద్దేశిస్తూ, ఆ ఉపమానాన్ని వివరించి చెబుతూ, అదే రీతిగా సృష్టి యొక్క పరిణామాన్ని కూడా వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, మొదటినుండి. ఈ నడక చాలా ఉత్తమమైన నడక అన్నమాట. ఇది సిద్ధాంతరీత్యా బోధించినట్లుగా బోధించితే, దర్శనరీతిగా గ్రహించ కలిగి నటువంటివారు సత్శిష్యులు.

అలా కాక ఆ సిద్ధాంత రీతిని కొద్దిగా తగ్గించి, అందుబాటు లోకి వచ్చేటట్లుగా వివరణ వ్యాఖ్యాన సహితంగా బోధించినపుడు సూచన స్థాయి నుండి వ్యాఖ్యాన స్థాయికి దిగిపోతుంది బోధ.

సూచన స్థానంలోనే దర్శన రీతిగా చెప్పగానే గ్రహించేటటువంటి సమర్ధుడైనవాడు శిష్యుడైతే, వ్యాఖ్యాన సహితమైనటువంటి బోధోపదేశం తరువాత అర్ధమయేటటువంటి వాడు, బౌద్ధికంగా అర్ధం చేసుకుని, వివరణాత్మకంగా అర్ధం చేసుకుని, సాధనగా స్వీకరించేటటువంటివాడు శిష్యుడు.

వ్యాఖ్యాన సహితమైనటువంటి బోధను అందుకోలేనటువంటి వారికి ఉపమాన పద్ధతిగా బోధించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ దర్శన విధిని అనుసరించినటువంటి వికాసాన్ని పొందనటువంటి వారున్నారో వారిని ఉద్దేశించి, వారికి అర్ధం కావటం కోసమని వ్యాఖ్యానాన్ని ఉపమాన స్థాయికి తీసుకువస్తారు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


25 Dec 2020

No comments:

Post a Comment