కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 133


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 133 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము - 63 🌻

దీనికి అడ్డువస్తున్నది ఏమిటి? సహజంగా తాను ఈశ్వరుడే అయివున్నప్పటికీ, తనకు తాను ఈశ్వరుడుగా తోచడం లేదు. ‘ఈశ్వరుడు వేరే కలడు’ - అనేటటువంటి భ్రాంతికిలోనై, ప్రథమ భ్రాంతి ‘పంచ భ్రమ నిరూపణ’ అని ఆది శంకరులు ఒక విధానాన్ని అందించారు. (అన్నపూర్ణోపనిషత్‌ అంతర్గతంగా)

అందులో మొట్టమొదటి భ్రాంతి ‘జీవేశ్వరోభిన్నః’ కాబట్టి ‘జీవుడు ఈశ్వరుడు వేరు వేరే’ అనేటటువంటి ప్రథమమైనటువంటి భ్రమ చేత, మనోభ్రాంతికి, మనస్సు అనేటటువంటి మయాకల్పితమైనటువంటి, ప్రతిబింబ సమానమైనటువంటి, అసలు లేనేలేనటువంటి భ్రమకి గురౌతున్నాడు. ఈ విభ్రమ నుంచి తప్పక ప్రయత్నశీలియై, ఆత్మవిచారణ చేత తనకు తాను బుద్ధికి వేరు పరుచుకుని తాను ఈశ్వరుడు అనే నిర్ణయాన్ని, అనే స్థితిని తప్పక సాధించాలి. అలా లేకపోయినట్లయితే ఎప్పటికి అభిమానగ్రస్థుడుగా మిగిలిపోతాడు.

ఇప్పుడు మనమందరం సామాన్యంగా జీవిస్తున్నటువంటి జీవనం ఎలా జీవిస్తున్నాము అంటే ‘విధి, వ్యాధి, అభిమానము’ - అనే మూడింటికి గురై, జీవుడుగా జీవిస్తూఉన్నాము. కానీ, ఈ మూడింటికి ఆధారం పట్టుకొమ్మ అభిమానం. ‘శరీరం నేను’ అనేటటువంటి అభిమానం. ‘నేనే కర్త’ ను అనేటటువంటి అభిమానము.

‘నేనే భోక్త’ ను అనేటటువంటి అభిమానము. కార్యకారణమునకు లొంగినటువంటి అభిమానము. కాలత్రయానికి లొంగినటువంటి అభిమానము. అవస్థాత్రయానికి లొంగినటువంటి అభిమానము. దేహత్రయానికి లొంగినటువంటి అభిమానము. శరీర త్రయానికి లొంగినటువంటి అభిమానము.

ఈ రకంగా ఎన్ని త్రిపుటులున్నాయో, ఆ అన్ని త్రిపుటులకు, గుణత్రయానికి లొంగిపోయినటువంటి అభిమానము. ఇట్లా ప్రతీ దానికి కూడా ఈ అభిమానమే అడ్డు వస్తూఉంటుంది. ఒకరు ఒకరితో మాట్లాడాలి అంటే, అభిమానం అడ్డు వస్తుంది. ఒకరు ఒకరితో సంబంధ పడాలి అంటే, అభిమానం అడ్డం వస్తుంది. ఒకరు ఒకరిని క్షమాపణ అడగాలి అనంటే, అభిమానం అడ్డు వస్తోంది.

ఒకరు ఒకరిని ప్రశంసించాలి అంటే, అభిమానం అడ్డు వస్తుంది. ఈ అభిమానం అనే తెర ఏదైతే ఉందో, నిజానికి ఇదొక పెద్ద తెర. ఇనుప గొలుసుల తెర. సాత్విక, రాజసిక, తామసిక శక్తులతో కూడినటువంటి, గుణ త్రయంతో కూడినటువంటి తెర. “తెర తీయరా తిరుపతి దేవర తెర తీయరా..” - అనేటటువంటి పాటలో ఆ తెర అంటే ఈ అభిమానము అనేటటువంటి తెర.

నేనే చేస్తున్నాను. సర్వకర్తను నేనే. సర్వహర్తను నేనే. సర్వభర్తను నేనే. అనే ఈశ్వరత్వాన్ని సాధించవలసినటువంటి మానవుడు, నిమిత్తమైనటువంటి కర్తృత్వ భావంతో, పరిమితమైనటువంటి,శరీరం చేత పరిమితించబడినటువంటి, దేహాభిమానం చేత పరిమితించబడినటువంటి చైతన్యం కలిగినవాడై, జీవాత్మగా వ్యవహరించడం చేత, ఇంద్రియాలకు లోబడి వ్యవహరించడం చేత, ఈ రకమైనటువంటి అజ్ఞానావృతమైన, అవిద్యావృతమైన, మోహావృతమైన, మాయావృతమైన జీవనశైలిని మానవుడు కలిగియుంటున్నాడు. - విద్యా సాగర్ గారు

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


16 Dec 2020

No comments:

Post a Comment