గీతోపనిషత్తు - 99


🌹. గీతోపనిషత్తు - 99 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍀 27. యజ్ఞార్థ భావము - యజ్ఞార్థముగ జీవించువారు అట్టి కార్యము లందు అందరి శ్రేయస్సును హృదయమున స్మరించుచు నిర్వర్తించ వలెను. యజ్ఞము లాచరింపగ అందు శేషించిన ఫలము అమృతమయము. దాని ననుభవించు వారు శాశ్వతమైన బ్రహ్మమును పొందుచున్నారు. పరమాత్మ తెలిపిన యజ్ఞము ఫలాపేక్షలేక యితరుల శ్రేయస్సు కొరకు ఆచరించు కార్యము. అట్టివారే దైవానుగ్రహ ప్రాప్తులగుదురు. అట్టి వారికే సనాతనము, శాశ్వతము అగు బ్రహ్మనుభూతి అనుభవమగును. 🍀

యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనమ్ |
నాయం లోక్కో స్త్యయజ్ఞస్య కుతో 2 వ్య: కురుసత్తమ || 31

కురుసత్తముడవగు ఓ అర్జునా! యజ్ఞము లాచరింపగ అందు శేషించిన ఫలము అమృతమయము. దాని ననుభవించు వారు శాశ్వతమైన బ్రహ్మమును పొందుచున్నారు. లోకమున యజ్ఞము చేయనివానికి ఈ లోకమునందే అస్థిత్వము దొరుకదు.

పరలోకమెట్లు దొరుకును? పరమాత్మ తెలిపిన యజ్ఞము ఫలాపేక్షలేక యితరుల శ్రేయస్సు కొరకు ఆచరించు కార్యము. అట్లు కార్యములను నిర్వర్తించు రాజవంశమైన కురు వంశమునందు అర్జునుని శ్రేష్ఠునిగ శ్రీకృష్ణుడు సంబోధించినాడు. నిజమునకు అర్జునుని జీవితమంతయు యజ్ఞార్థమే.

ఇట్లు యజ్ఞార్థముగ జీవించువారు అట్టి కార్యము లందు అందరి శ్రేయస్సును హృదయమున స్మరించుచు నిర్వర్తించ వలెను. అట్టి విశిష్టమగు కార్యముల నుండి పుట్టిన ఫలములను అందరికిని పంచవలెను. అందరికి పంచగ మిగిలినది తాను భుజించినచో అది అమృతమగును. ముందుగ భుజించుట వలన ఫల మమృతము కాదు. అందువలన అందరికొరకు తాను, అందరి శ్రేయస్సు తరువాత తన శ్రేయస్సు అనునది యఁరభావము.

అట్టివారే దైవానుగ్రహ ప్రాప్తులగుదురు. అట్టి వారికే సనాతనము, శాశ్వతము అగు బ్రహ్మనుభూతి అనుభవమగును. అన్ని విషయములందు అందరికన్న ముందు పొంద వలెనని, అందరికన్న ముందు భుజించవలెనని భావించువారు ప్రాపంచికులు. వారికి నిదానమే లేదు. అట్టి వారికి యజ్ఞమన నేమో తెలియదు. వారీ లోకమున కూడ స్థిమితముగ నుండలేరు. వారి పరలోక ప్రయత్నము లన్నియు హాస్యాస్పదములే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


16 Dec 2020

No comments:

Post a Comment