శ్రీ శివ మహా పురాణము - 297


🌹 . శ్రీ శివ మహా పురాణము - 297 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

72. అధ్యాయము - 27

🌻. దక్షయజ్ఞ ప్రారంభము - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -


ఓ మహర్షీ! ఒకప్పుడు ఆ దక్షుడు గొప్ప యజ్ఞమునారంభించెను. ఆ యజ్ఞమునకు దీక్షితుడైన దక్షుడు దేవతలను, ఋషులను ఆహ్వానించెను (1). మహర్షులు, దేవతలు అందరు శివమాయచే మోహితులై ఆతని యజ్ఞమును చేయించుటకు అచటికి విచ్చేసిరి (2). అగస్త్యుడు, కశ్యపుడు, అత్రి, వామదేవుడు, భృగువు, దధీచి, వ్యాస భగవానుడు, భారద్వాజుడు, గౌతముడు (3), పైలుడు, పరాశరుడు, గర్గుడు, భార్గవుడు, కకుపుడు, సితుడు, సుమంతుడు, త్రికుడు, కంకుడు, మరియు వైశంపాయనుడు విచ్చేసిరి (4).

నా కుమారుడగు దక్షుని యజ్ఞమునకు వీరేగాక ఇంకా ఎందరో మహర్షులు తమ భార్య పిల్లలతో ఆనందముగా విచ్చేసిరి (5). మరియు, సర్వదేవగణములు, మహాత్ములగు లోకపాలురు, సర్వ ఉపదేవగణములు తమ వాహనముతో, సైన్యములతో కూడి విచ్చేసిరి (6). జగత్స్రష్టనగు నన్ను స్తుతించి సత్యలోకమునుండి తీసుకొని వెళ్లిరి. నేను నా కుమారులతో, పరివారముతో, మరియు మూర్తీభవించిన వేదశాస్త్రములతో గూడి వెళ్లితిని (7). మరియు, వైకుంఠము నుండి విష్ణువును ప్రార్థించి గొప్ప ఆదరముతో దోడ్కొని వచ్చిరి. ఆయన ఆ యజ్ఞమునకు తన భక్తులతో, పరివారముతో గూడి విచ్చేసెను (8).

వీరే గాక, ఇంకనూ చాల మంది మోహితులై దక్షయజ్ఞమునకు వచ్చిరి. దుష్టుడగు దక్షుడు వారినందరినీ సత్కరించెను (9). విశ్వకర్మ మిక్కిలి విలువైన, గొప్పగా ప్రకాశించే మహాదివ్య భవనములను నిర్మించి యుండెను. దక్షుడు వారందరికీ వాటిలో మకామునిచ్చెను (10). ఆ భవనములన్నింటియందు యోగ్యతనను సరించి అందరు నివసించిరి. నేను, విష్ణువు కూడ అచట నివసింతిమి. అందరికీ సన్మానము చేయబడెను. వారందరు చక్కగా ప్రకాశించిరి (11).

అపుడు కనఖల తీర్థమునందు జరిగిన ఆ మహాయజ్ఞములో దక్షుడు భృగువు మొదలగు తపశ్శాలురను ఋత్విక్కులుగా నియమించెను (12). విష్ణువు మరుద్గణములన్నింటితో గూడి స్వయముగా ఆ యజ్ఞమునకు అధ్యక్షుడు గా నుండెను. నేను బ్రహ్మనై ఆ యజ్ఞములో వేద విధిని వివరిస్తూ నడిపించితిని (13).

సర్వదిక్పాలకులు ఆయుధములను ధరించి పరివారసమేతముగా ద్వారపాలకుల స్థానమునందు నిలబడి రక్షణనొసంగిరి. ఆ దృశ్యము చాల కుతూహలమును కలిగించెను (14). సుందరాకారుడగు యజ్ఞుడు ఆ దక్షుని యజ్ఞములో స్వయముగా హాజరయ్యెను. మహాముని శ్రేష్ఠులందరు స్వయముగా వేదోక్త కర్మలను నిర్వహించిరి (15). అగ్ని తన వేయి రూపములతో హవిస్సును స్వీకరించుటకై ఆ యజ్ఞమహోత్సవములో వెనువెంటనే ఉపస్థితుడాయెను (16). పద్ధెనిమిదివేల మంది ఋత్విక్కులు హోమమును చేసిరి. అరవై నాలుగు వేల దేవర్షులు ఉద్గాతృస్థానముల నలంకరించిరి (17).

అంతే సంఖ్యలో అధ్వర్యులు, హోతలు ఉపస్థితులైరి. నారదాది ఋషులు, మరియు సప్తవర్షులు వేర్వేరుగా గాథలను వినిపించిరి (18). ఆ దక్షుడు తన మహాయజ్ఞములో గంధర్వులను, విద్యాధరులను, సిద్ధ సంఘములను, ద్వాదశా దిత్యులను, అసంఖ్యాకములగు నాగులను వారివారి గణములతో యజ్ఞములతో సహా ఋత్విక్కులు గా వరణము చేసెను (19). ఆ యజ్ఞములో యజమానియగు దక్షుడు ద్విజర్షులను, రాజర్షులను, దేవర్షులను, మిత్రులతో మంత్రులతో సైన్యములతో గూడియున్న రాజులను, వసువులను, గణ దేవతలను అందరినీ వరణము చేసెను (20).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


16 Dec 2020

No comments:

Post a Comment